.png)
స్నేహమా...
ఒక్కో సారి గుర్తొస్తుంది అసలు మౌనానికి దాహమెంతని?
కన్నీటిని తాగి బతికేదే మౌనం అన్నంతగా అర్దం నిలబడిపోయింది, నీ తలపుల వేడిలో
మార్చుకోవాలని మొహమాటమెందుకో ఈపిచ్చి మనసుకి.
నిన్ను మరచిన క్షణాలెక్కడని వెతికితే పెదాలు వెక్కిరించి మరీ నవ్వుతున్నాయి. రాలు పూల తేనియకై అని రాసిన కవి మనసుకి మోకరిల్లాలనే వినమ్రత ఒక వైపు అంతకంటే భావుకతను గుండెల్లో దాచాననే భావన ఒకవైపు!
ధృవాలన్నీ కరిగిపోయి, విశ్వమంతా అరిగిపోయినట్లుగా శూన్యం ఆవరిస్తుంది.
నీ చెలిమి చెలమల్లో విరహపు చేయి ముంచగానే..!
అంత మాత్రన భావాన్ని అంతం చేసుకున్నానంటే పొరపాటే. సున్నితపు పొలికేక ఏదో నిన్ను పిలుస్తూ విశ్వాంతరాలను దాటి వెళ్లలేదంటావా? నువ్వే చెప్పు.. నీకై నే చేజార్చుకున్న నా జీవితానికి అర్దవంతమైన సమాధానం!
ఆ పలుకుల కోసం కలత నిదురలో ఎన్ని కలవరింతలో,కారు మబ్బుల మధ్యనున్న చందమామని అడుగుదాం రా మరి.పాలపుంతల ను చూసిన ఏకాకి మదికి ఏమారపాటులోనైన ఒక ఊ కొడతావని ఈ అవని నుంచి వేచి చూస్తున్నా...
కారిపోయిన కన్నీరు తిరిగి వస్తే బావుండు, మరోసారి ఏడుస్తా...
సమాధానం కోసం వేచి చూస్తుంది సమాధి చేయబడని నా మనోః శవం.
నీకు ఈలేఖ అందదని తెలిసినా కాస్త ఊరట నా మదికి ఏదో భావాన్ని కాస్త బయటపెట్టానని!
ఉంటా నేస్తం!!
.jpg)
---- Raghu Alla



