Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 29వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 29వ భాగం

 

  చేతులు పైకెత్తి కొట్టుకుంటూ వడిగా పారుతున్న ఏటిలో కొట్టుకు పోతోంది రాకుమారి కాదంబరీ దేవి.

  పురుషోత్తముడు చప్పట్లు కొట్టి, భటులను పిలవ బోతుండగానే, మాధవుడు పరుగున వెళ్లి సెలయేరులో దూకాడు.

  చెలులు ఒడ్డున పరుగులు పెడుతున్నారు. ఒకటే కేకలు.. అంతా ఒక్క క్షణంలో గందరగోళం కింద తయారయింది. పురుషోత్తముడు, గజ ఈతగాళ్లని పిలవనంపాడు.

  మాధవుడు పెద్ద పెద్ద బారలు తీస్తూ, రాకుమారిని చేరుకుని, జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాడు

  అప్పుడు.. పరుగెత్తుకుంటూ వచ్చారు చెలికత్తెలు, పురుషోత్తమ దేవుడు, భటులూ.

  మాధవుడు, ప్రాధమిక చికిత్స చేసి, రాకుమారి తాగేసిన నీళ్లన్నీ కక్కించాడు. నోట్లో నోరుపెట్టి ఊదటం వచ్చా అని అడిగాడు, అక్కడున్న చెలులని.

  అడ్డంగా తల తిప్పారు అందరూ.

  ఏంచేద్దామన్నట్లు పురుషోత్తముడి కేసి చూశాడు. అతడు తల నిలువుగా ఊపాడు తనకేసి తిరిగిన మాధవునికి, నువ్వే తగిన వాడివన్నట్లుగా..

  వెటనే మాధవుడు, రాకుమారి నోటిలో నోరు పెట్టి గాలి ఊద సాగాడు. చుట్టూ మూగినవారందరూ రాకుమారుని చూసి దూరంగా కదిలారు. కాదంబరి వద్ద మాధవుడు, పురుషోత్తముడు మాత్రమే ఉన్నారు.

  కొంచెం సేపటికి నెమ్మదిగా కన్నులు తెరిచింది రాకుమారి. ఆ లోగా కొందరు చెలికత్తెలు పరుగున వెళ్లి రాకుమారి వస్త్రములు తీసుకొని వచ్చారు.

  పరిచారికలు సపర్యలు చేస్తుండగా, మిత్రులిద్దరూ, మండపం దగ్గరకు వెళ్లి, అక్కడున్న అరుగు మీద కూర్చోబోయారు. అప్పుడే మాధవునికి, పొడి అంగవస్త్రము, పంచ, అంగీ తీసుకొని వచ్చి ఇచ్చాడొక భటుడు. అతడు నీటిలోనికి దూకగానే, రాకుమారుని సైగ అందుకుని మాధవుని ఇంటికి వెళ్లి తీసుకొని వచ్చాడతడు.

  మాధవుడు దుస్తులు మార్చుకోగానే, అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నారు మిత్రులు.

  “ధన్యవాదాలు మిత్రమా! మా సోదరిని కాపాడినందుకు.”

  “నాకంటే మీరు ఈతలో సమర్ధులు కదా! మరి అలా ఊరుకున్నారేమి రాకుమారా?” మాధవుడు సందేహంగా అడిగాడు.

  “నాకంటే ముందు నువ్వు స్పందించావు మిత్రమా! ఇరువురమూ ఏటిలోనికి దూకి.. అక్కడ చేసేదేమీ లేదని ఊరకున్నాను.” పురుషోత్తముడు చిరునవ్వుతో అన్నాడు. కానీ మాధవునికి అనుమానంగానే ఉంది. కావాలనే తనకి అవకాశం ఇచ్చాడు రాకుమారుడని.

  తన సంశయమును మనసునందే నిలిపి, రాకుమారునితో పద్మావతీ దేవి గురించి చెప్ప బోయాడు మాధవుడు. అంతలో..

  రాకుమారి కాదంబరీ దేవి, నెమ్మదిగా, చెలుల ఆసరాతో వచ్చి పురుషోత్తముని ఎదురుగా నిలిచింది. మాధవునికి, గుండె ఒక క్షణం ఆగినట్లు అనిపించింది.

  మోములో అలసట, శారీరక నిస్త్రాణ, మానసిక అలజడి..

  అయినా రాకుమారి కన్నులు మాత్రం స్వచ్ఛమైన నీటిలో తిరుగుతున్న చేప పిల్లల లాగ అనిపించాయి మాధవునికి.

  

 కం.      “మిలమిల మెరిసే చుక్కలు

            అల నింగిన నిలువ లేక అవనికి వచ్చే

            ఎల నెలత కన్నుల నిలిచె

            కలనైన మరువగ లేను గాదిలి మీరన్.”

 

  మనసులోనే తన భావాలని దాచుకుని, ఏదో పని ఉన్నట్లు లేచి వెళ్ల బోయాడు.

  “మిత్రమా! ఎచ్చటికి? మా సోదరి నీకు కృతజ్ఞతలు తెలుపుకుందామని అనుకుంటుంటే.. పలాయన వాదం పనికిరాదు సుమా!” పురుషోత్తముడు వారించాడు.

  మొహం, బుగ్గలు ఎఱ్ఱ వడుతుండగా మాధవుడు కూర్చున్నాడు.

  పురుషోత్తముడు, మిత్రుని అవస్థ ఓరకంట చూసి నవ్వుకున్నాడు.

  “ధన్యవాదాలు మాధవ మంత్రులకి. తమ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడారు. ఎన్నటికి మరువలేను. ఏమిచ్చిననూ ఋణము తీర్చుకొనలేను.” కాదంబరి వినమ్రంగా పలికింది.

  “అంత మాటనవద్దు రాకుమారీ! అది నా ధర్మం.” అలవోకగా తనను చూస్తున్న కాదంబరి వాలు చూపులకు పరవశమౌతూ అన్నాడు మాధవుడు.

  ఏమా సౌందర్యపు గుబాళింపులు.. అందని చందమామకై ఆరాట పడకూడదని ఎంత చెప్పినా వినదే ఈ పాడు మనసు.

  వద్దు వద్దనుకుంటూనే కాదంబరీ దేవినే  చూస్తున్నాడు. బుద్ధెరిగాక ఒక మగువని, అదీ.. తన మనసు దోచిన వనితని ఇంత దగ్గరగా చూడడం ఇదే.. ఎంత మరలిద్దామనుకున్నా, బుద్ధి నిర్దేశిస్తున్నా, మనసు మాట వినడం లేదు.

  పురుషోత్తముడు వినోదంగా పరికిస్తున్నాడు ఇరువురినీ. కాదంబరీ దేవి కూడా, మాధవుని అందానికి ఆకర్షితు రాలయినట్లే ఉందనుకున్నాడు.

  తనని స్పృశించిన తొలి పురుషుడతడు.. ఎంత స్పృహ లేకున్నా, మొహంలో మొహం పెట్టి, పెదవులకి పెదవులానించి.. ఊపిరందించిన యువకుడు. తెలిసీ తెలియని స్థితిలో అందిన ఆ స్పర్శ వెంటాడుతూనే ఉంది.

  “అలా ఆసీనులు కండి సోదరీ!”

  చెలులు, మండపంలో నున్న పెద్ద బండని శుభ్ర పరచగా, సుకుమారి కాదంబరి, సున్నితంగా కూర్చుంది.

  “కఠినమైన బండ మీద కూర్చుంటే కందిపోతుందేమో రాకుమారి మేను..” మాధవుడు మదిలో అనుకుంటూ అటూ ఇటూ చూశాడు ఏదయినా మెత్తని గడ్డి దొరుకుతుందేమోనని.

  అంతలో చెలులు మాధవీలతా మంటపం లో దీపం వెలిగించారు. పగలైననూ, అక్కడ వృక్ష ఛాయలు చీకటిని వ్యాపింప చేస్తాయి.

  ఒద్దికగా కూర్చుని ఉన్న కాదంబరీ దేవి, సృష్టికర్త శ్రద్ధగా కూర్చుని అమర్చినట్లుంది. మోమున కానపడు ప్రశాంతత ఎటువంటి కలతనైనా దూరం చేసేట్లుంది.

  

                    th-3.jpg   

 

  కన్నులు తిప్పుకోడం కష్టంగా ఉంది మాధవునికి. పురుషోత్తమ దేవుడు మాత్రం అదేమీ గమనించనట్లు, కాదంబరి వద్దకు వెళ్లి, చెయ్యి పట్టుకుని నాడి చూశాడు.

  “ఫరవాలేదు.. కొద్ది వేగంగా ఉంది కానీ, త్వరితంగానే సరై పోతుంది.”

  అన్నగారి వాక్కులకి రాకుమారి మోము మరింత మందార ఛాయని దాల్చింది.

                          కం.   అలతిగ తలవంచి యతివ

                                  కలలుగనే కన్నుల వెలుగదె కాంచగనే

                                  అల మందస్మిత వదనము

                                  వెలయగ కను విందుగ నిల వేడుక గానే.

  

  కాదంబరీ దేవి సౌకుమార్య సౌందర్యం మాధవుని మనస్సుని మరే పక్కకీ మరలింప నంటోంది. కానీ వివేకం వెనక్కి లాగుతోంది.

  “మాధవ మంత్రులకి మా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము.” కాదంబరి నమస్కరిస్తూ పలికింది.

  “అది నా ధర్మము రాకుమారీ.” మాధవుడు గంభీరంగా అన్నాడు.

  “రాకుమారిని మందిరానికి తీసుకుని వెళ్లండి.” పురుషోత్తముడు ఆనతిచ్చాడు.

  నెమ్మదిగా అడుగులు వేస్తూ కాదంబరీ దేవి రాజమందిరం వయిపు సాగింది, చెలులు పట్టుకుని తీసుకుని వెళ్తుండగా.

  మలుపు తిరిగేటప్పుడు వెను తిరిగి మాధవుని వైపు ఒక వాలు చూపు విసిరింది. అనుకోకుండా మాధవుడు చెయ్యి పైకెత్తాడు, అభివాదం చేస్తున్నట్లుగా.

  పురుషోత్తముడు గమనించనట్లు, వనం లోనికి నడిచాడు.

 

  మాధవుడు తేరుకుని పరిసరాలు గమనించే లోగా మిత్రుడు బ్రహ్మకమలం చెట్టు దగ్గరగా వెళ్లి ఆ పుష్పాల అందాలని పరికిస్తున్నాడు.

  “ఫ్రభూ! రాకుమారి..”

  “అవును మాధవా.. మా కుటుంబమంతా నీకు ఋణపడి ఉంటుంది, రాకుమారిని కాపాడినందుకు. ఆ ఋణం ఏ విధంగా తీర్చుకోవాలా అనేది తండ్రిగారితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను.”

  “ఈ రాకుమారి గురించి కాదు దేవా నేను అడుగుతున్నది.. పద్మావతీ దేవి భవిష్యత్తు. తండ్రి చేసిన తప్పిదానికి బిడ్డని శిక్షించడం న్యాయమేనా? ధర్మ ప్రభువులు ఆలోచించాలి.” మాధవుడు  

  “మనసుకి గాయం చాలా లోతుగా తగిలింది మాధవా! చూద్దాం.. ఆ జగన్నాధుని నిర్ణయమేమిటో.”

  అప్పటి వరకూ ఉన్న తీవ్రత రాకుమారుని కంఠంలో కనిపించక పోవడంతో మాధవుడు కాస్త ఉపశమనం పొందాడు. కొద్ది ధైర్యం వచ్చింది, పరిస్థితులు చక్కబడతాయని.

 

  మాధవుడు తోటలో పచార్లు చేస్తున్నాడు అస్థిమితంగా. కుడి చెయ్యి పిడికిలి బిగించి ఎడం అరచేతిలో కొట్టుకుంటున్నాడు.

  మధ్యలో తల అడ్డంగా తిప్పుతున్నాడు.

  ఆ రోజు యాత్రికులు, బాటసారులు ఎక్కువ మంది రాలేదు. నందుడు, సీతమ్మ కలిసి వంటపనులు చేస్తున్నారు. గౌతమికి శిరోభారంగా ఉందని, వెనుక పంచలో చాప మీద పండుకుని కన్నులు మూసుకుని విశ్రాంతి తీసుకుంటోంది.

  పద్మావతి అప్పుడే సీతమ్మకి కూరగాయలు తరిగి ఇచ్చి పున్నాగ చెట్టు కింద ఉన్న బండ మీద కూర్చుని మాధవుడ్ని గమనిస్తోంది.

  భృకుటి ముడిచి తీవ్రంగా మధన పడుతుంటే ఇంక ఆగలేకపోయింది.

  “సోదరా! నీ వ్యాకులతకి కారణం నేనేనా? నా వలన మీకు అసౌకర్యం కలుగుతోందా? ఏదయినా ధర్మ సత్రం లోనికి..”

  ఆందోళనగా అటు తిరిగాడు మాధవుడు.

  “అయ్యో.. అది కాదమ్మా! జగన్నాధుని ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. నీ సమస్యకి పరిష్కారం చూపమని ఆ దేవ దేవుడ్ని వేడుకుంటున్నాను. ఆయన తప్పక కరుణిస్తాడు.. దారి చూపుతాడు. నీ వంటి సౌజన్యవతికి ఇటువంటి కష్టం రాకూడదు.”

  “ఇది నేను కష్టం అనుకోవట్లేదు అన్నా! ఏది జరిగినా మన మంచికే అని నమ్ముతాను. ఇది లేకున్న మీ ఇంటి ఆడపడుచునయ్యే అదృష్టం నాకు కలిగేదా?

ఆ రాజ బోగాలకంటే, ఈ స్వేచ్ఛా జీవనమే నాకు ఉల్లాసం కలిగిస్తోంది. పరిచారికలూ, ఆర్భాటాలూ లేకుండా.. ఏకాంతంలోని ఆనందాన్ని అనుభవించే భాగ్యం కలిగింది. నా జీవితంలో మరపురాని, మరువ లేని రోజులని గడుపుతున్నాను.” పద్మావతి మిలమిల మెరిసే కన్నులతో అంది.

  నిజమే.. పద్మావతిలో చాలా మార్పు వచ్చింది.

  అందని చందమామలా, అందరికీ ఆమడదూరంలో ఉండే రాకుమారి, సాధారణ యువతిలా మారిపోయింది. పరిసరాల మీద కొత్తగా కలిగిన ఆసక్తి, అనురక్తి.. సహజత్వం, వ్యక్తిత్వాన్ని మెరుగు పరచింది.

  కాకి గూడులోనుంచి బైటికి నెట్టి వేయబడ్డ కోకిల పిల్లని చూసినా, ధాన్యం గింజలేరుకుంటున్న పిచ్చుకలని చూసినా, ఉట్టి మీద పెట్టడం మర్చి పోయిన పాలకుండలో మూతి పెట్టి మూతి నాక్కుంటూ వెళ్లే నల్ల పిల్లిని చూసినా.. ఏ సహజమైన ప్రక్రియని చూసినా స్పందిస్తోంది.

  ఒక రోజు రెండు ఉడుతలు ఒక దాన్నొకటి తరుముకుంటూ వెళ్లే దృశ్యాన్ని కళ్లార్పకుండా చూస్తూ, ఆనందిస్తోన్న పద్మావతిని చూసి అడిగాడు.

  “సోదరీ.. మా బంధువుల అమ్మాయిలని అప్పుడప్పుడు వస్తుండమని చెప్పేదా?”

  “నేనెవరో చెప్పనని మాట ఇస్తేనే..” పద్మావతి షరతుకి ఒప్పుకున్నాడు.

  అప్పటి నుంచీ ఇద్దరు కన్నియలు రెండు రోజులకొక మారు వచ్చి ఆటపాటలతో కాలం గడపుతున్నారు. పద్మావతి ఒరియా నాట్యం, తెలుగు పాటలు నేర్చుకుంటోంది వారి వద్ద.

  “అన్నా.. ఏమా చింతన” పద్మావతి హెచ్చరికకి వర్తమానంలోకి వచ్చి చిరునవ్వు నవ్వాడు మాధవుడు.

  “నా గురించేనా లేక మా కాబోయే వదిన గారి గురించా ఆలోచనలు?”

  ఉలిక్కి పడ్డాడు మాధవుడు.

  ఇంటిలోని వారందరికీ తన మనస్థితి వ్యక్త మవుతోందా?

  “కొంచె కొంచెంగా.. నడతలో అన్య మనస్కం, చూపులో శూన్యత, మాటలో తడబాటు అన్యాక్రాంతమైన మనసుని చెప్తున్నాయి సోదరా. నేనిలా అంటుంటే ఎర్రబడ్డ నీ మోము కూడా..” మాధవుని అంతరంగాన్ని విప్పిచెప్తున్న పద్మావతిని కినుకగా చూశాడు.

  “ఎవరా అదృష్ట వంతురాలు అన్నా? నీ వంటి మంచిమనిషిని చేపట్టబోయే యువతిని నాకెప్పుడు చూపిస్తావు?”

  “అందని పండు సోదరీ. ఆశ పడితే నిరాశే ప్రాప్తం. ముందుగా నీ సమస్య పరిష్కరించాకే నా వివాహం. అది, తల్లిదండ్రులు మెచ్చిన అమ్మాయి తోనే.”

  “రాకుమారి కాదంబరీ దేవి కదా సోదరా? చూడ చక్కని వనిత. చాలా మంచి స్వభావం అని కూడా విన్నాను.”

  మాధవుడు కంగారుగా అటూ ఇటూ చాశాడు. అసలు తమ ఇంట అటువంటి ప్రస్థావన రావడమే తప్పు. ఎవరికైనా తెలుస్తే తన తల తియ్యడం ఖాయం.

  పద్మావతి ఎలా గ్రహించిందీ?

  “రాకుమారుడు పురుషోత్తమునికి నీడలా తిరిగే నిన్ను ఆకర్షించగల వనిత ఆవిడే అయుంటుందని ఊహించా అన్నా. నా వద్ద ఆమె చిత్ర పటం కూడా ఉండేది. రాకుమారుని కుటుంబంలోని అందరి గురించీ మా చారులు వార్తలు సేకరించారు. అప్పటి రోజుల్లో.. తెలుసుకోవడం ఆవశ్యం అనిపించింది.”

  “ఈ విషయం ఎవరి వద్దా..”

  “అనను. కానీ మన ప్రయత్న లోపం ఉండకూడదు సోదరా! కనీసం రాకుమారి మనసు తెలుసుకునే అవకాశం కొరకు చూడాలి.” పద్మావతి అనునయంగా అంది.

  “నా విషయానికి చాలా అవరోధాలున్నాయమ్మా! రాకుమారి వివాహం రాజకీయ ప్రయోజనాలను కలిగించాలని అనుకుంటారు. పైగా.. వారు క్షత్రియులు. కుల సమస్య ఉండనే ఉంది. ముందుగా నీ విషయం చూడాలి. మరల జగన్నాధుని రథయాత్ర ఆసన్న మవుతోంది. ఆ జగద్రక్షకుడే కాచుకోవాలి.”

  వీధి వాకిట సందడి విని పిస్తే అటుగా వెళ్లాడు మాధవుడు.

  ఇరువురు రాజ భటులు..

  “మహారాజు కపిలేంద్ర వర్మల వారు మిమ్ములను అత్యవసరంగా రమ్మన్నారు ప్రభూ!” వార్త వినిపించాడు ఒకడు.

                                         ………………….

......మంథా భానుమతి