Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 28వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 28వ భాగం

 ఆ రోజు, తెల్లవారకుండానే, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్రాలను ధరించి, తన వద్దనున్న కొద్దిపాటి నగలను పెట్టుకుని వచ్చి, నంద గౌతమిలకు, సీతమ్మకి నమస్కరించింది పద్మావతీ దేవి. అప్పటికే వారు వంట ప్రయత్నంలో పడ్డారు.

  “ఈ రోజు నా జన్మదినమమ్మా! ఆశీర్వదించండి.”

  “దీర్ఘాయుష్మాన్ భవ. వచ్చే పుట్టినరోజుకి నీవు వుండవలసిన చోటికి చేరాలి తల్లీ!” నందుడు ఆశీర్వదించాడు.

  అప్పుడే అక్కడికొచ్చిన మాధవుడు కళ్లు విప్పార్చి సంభ్రమంగా చూస్తుండి పోయాడు.

  “అన్నా! నీవు కూడ ఆశీర్వదించాలి.” వంగి నమస్కరించ బోతే, ఆపి, లేపి, తల మీద చెయ్యి పెట్టి దీవెనలందించాడు.

                       

                       కం. “సిరి యొలుకు చుండు మోమున

                              చిరునగవులతో మరిమరి శింజానముగా

                              కరిముఖుడు నీకు నాసర

                              నిరతము నొసగును మరింత నెరవు నిలుపగా.”

 

  “ధన్యవాదాలన్నా! ఏనాటి బంధమో ఇది. మనిద్దరి తనువులున్నంత వరకూ నిలవాలని ఆ పరాశక్తిని కోరుతున్నాను.” మిలమిల మెరిసే కన్నులతో అంది పద్మావతి.

  “ఆ జగన్నాధుని దయ ఉండాలి గానీ ఏదీ అసాధ్యం కాదు ఈ జగాన. అంతా సవ్యంగా జరుగుతుంది సోదరీ. చింత వద్దు.” మాధవుడు చిరునవ్వుతో అన్నాడు.

  “అవును. వచ్చే రథయాత్రకి, సేవ చేస్తానని మొక్కుకోమ్మా! నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.” అనుకోకుండా సీతమ్మ అన్న మాటలకి ఉలిక్కి పడ్డారు, మాధవుడూ పద్మావతీ.

  “నిజమే అమ్మమ్మా! ఆ విధంగా.. ఇప్పుడే మొక్కుకుంటాను.” పద్మావతి తేరుకుని, వెంటనే అంది.

  మాధవుడు ప్రశంసా పూర్వకంగా చూశాడు.

                                    ………………..

 

  “అభినందనలు కుమారా!” కపిలేంద్రదేవుడు తన మందిరంలో, పురుషోత్తమదేవుని తో సమావేశమయ్యాడు.

  “అంతా మీ ఆశీర్వాదమే, మీ సహకారమేగా తండ్రీ!” పురుషోత్తముడు వినమ్రంగా అన్నాడు.

  “నా సహకారమే కాదు.. ఆ జగన్నాధుని దయ కూడా. అప్పుడు యుద్ధానికి సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నా కదా.. సరైన సమయానికి ఇరువురు అన్నదమ్ములు, యోధాను యోధులు.. పూరీ పట్టణం నుంచి వచ్చి సైన్యంలో స్వచ్ఛందంగా చేరారు. వారే, కాంచీపురం మీదికి సైన్యాన్ని తీసుకుని వెళ్లి, యుద్ధంలో పురుషోత్తమ రాకుమారునికి సహాయంగా వెళ్లెదమని అడిగారు. వారిని చూడగానే.. మన సైనికులకి ఎక్కడలేని జవ సత్వాలూ వచ్చేశాయి. అంతే.. ఆనతి నివ్వడమేమిటి.. కదం తొక్కుతూ బయలుదేరారు.” కపిలేంద్ర వర్మ సంతోషంగా అన్నాడు.

  “వారిరువురూ సాక్షాత్ జగన్నాధ, బలభద్రులని నా అనుభవం చెప్తోంది తండ్రీ.”

  “అంత కన్నా మనకి పెద్ద వరమేముంటుంది. ఈ సంతోష సమయంలో నాదొక కోరిక కుమారా!”

  “ఆజ్ఞాపించండి తండ్రీ.”

  “కాంచీ పురం రాజును విడుదల చేద్దాము. చెప్పుడు మాటలను విని అతడు అనాలోచితంగా ప్రవర్తించాడు. అతని రాజ్యాన్ని అతనికిచ్చేద్దాము. మన ప్రతీక్షని తిరిగి వచ్చెయ్య మందాం.”

  “మీ చిత్తం తండ్రిగారూ!” కొద్దిగా ఖిన్నుడై అన్నాడు పురుషోత్తమ దేవుడు.

  “కుమారా! మీరే రణ మందు గెలిచి కంచిరాజును బందీగా తెచ్చారు. మేము కాదనుట లేదు. కానీ.. రాజనీతి కొద్దిగా అర్ధం చేసుకోవాలి మీరు. ఇప్పుడు వారి రాజ్యం వారి కిస్తే భవిష్యత్తులో మనకి అనుకూలంగా ఉండగలరు కంచి రాజు. కావాలంటే కప్పం కట్టమని అడుగుదాము. నేను కావేరీ తీరం వరకూ మన రాజ్యాన్ని విస్తరింప వలెనని యోచిస్తున్నాను..”

  “అంటే..”

  “అవును. విజయనగర సామ్రాజ్యాన్ని కూడనూ జయించవలెనని నా వ్యూహం! మీది ఉడుకు రక్తం. కొంచెం ఆగి ఆలోచిస్తే మీకే అర్ధమవుతుంది.”

  “సరే తండ్రీ! మీరే వెళ్లి వారిని విడిపించి పంపండి. కానీ.. ఆ మంత్రి వరదయ్యని మాత్రం..”

  “ఎప్పటికీ వదలను. రోజూ కారాగరం అంతా ఆ వరదయ్య చేతనే చీపురుతో తుడిపించమని ఆజ్ఞ ఇస్తాను.” కపిలేంద్ర దేవుడు నవ్వుతూ అన్నాడు.

  అప్పటికి పురుషోత్తమునికి కినుక తగ్గి, మోములో ముదము వచ్చింది.

  “అమ్మయ్య. ఇప్పటికి నాకు చింత వదలినది. తక్షణమే కారాగారానికి విచ్చేస్తున్నామని కబురు పంపండి.” సేనానికి ఆదేశమిచ్చాడు ప్రభువు.

  పురుషోత్తముడు తండ్రికి నమస్కరించి తన మందిరానికి వెళ్లి పోయాడు. తండ్రిగారి ప్రతిపాదనకి, మనస్ఫూర్తిగా అంగీకరించి. వారు పంపిన సైన్యమే లేకున్న, యుద్ధములో గెలిచే అవకాశమే లేదు కదా!

                                     ………………………..

 

  “సోదరా! మా పితృదేవులు క్షేమంగా ఉన్నారా?” సూర్యోదయానికి ముందే నిదుర లేచిన పద్మావతి, కాసేపు తోటలో మొక్కల సంరక్షణ చూసి, పూజకి పువ్వులు కోసి, మాలలు కడుతూ అడిగింది. అప్పుడే పశువుల దగ్గర పని ముగించుకుని వచ్చిన మాధవుడిని.

  “కాంచీపుర రాజుగారిని బంధ విముక్తులని చేశారు రాకుమారీ! నిన్నటిరోజునే. వారిని కంచి రాజ్యానికే సామంతులుగా నియమించారు కపిలేంద్ర వర్మ. మీరు మీ రాజ్యానికి ఏగ వచ్చును.. హాయిగా.” మాధవుడు చిరు బాధాతప్తుడై అన్నాడు.

  ఇంట్లో గలగల్లాడుతూ ఆడపిల్ల తిరుగుతుంటే ఆ అందమే వేరు అనుకుంటూ. .

  పద్మావతి మౌనంగా ఉండిపోయింది.. అనేకానేక భావాలు మదిలో సుళ్లు తిరుగుతుండగా.

  “అనగా.. కాంచీపురం రాజు ఓడిపోయిన రాజ్యాన్ని తీసుకుని ఏలుకుంటారా?” రాకుమారి పౌరుషంగా అడిగింది.

  మాధవుడు నిలువుగా తల ఊపాడు.

  “ఇప్పుడు నేను మా తండ్రితో వెళ్తే ఛండాలునితో పెండ్లి చేయించాలని శపధం పట్టిన పురుషోత్తమ దేవుల వారి మాట ఏమిటి? ఆ ఒప్పందాలలో నన్ను కూడా విడిచి పెట్టెదమని అని యుంటిరా మహారాజు?”

  పద్మావతి ప్రశ్నలకి మాధవుడు ఆశ్చర్యంగా చూశాడు.

  “సోదరీ! మీకు..”

  “నాకు అన్నీ తెలుసు సోదరా! నేను ఇప్పుడు ఆత్మాభిమానము వదలి వెళ్లినా, పతిదేవునిగా భావించి మనసులో నిలుపుకున్న పురుషోత్తమదేవుని పౌరుషమునకు భంగము కలిగించిన దాననవుతాను. దానికి నేనొప్పలేను. పైగా..

 

                   సీ.       కన్నకూతురి కూర్మి కానని నాతండ్రి

                                    దుష్టబుధ్ది యయిన ధూర్తు నమ్మి

                              కన్నుమిన్ను కనరాక యథార్ధ మెరుగక

                                    విష్ణు భక్తు వివిధ విధములుగను

                              హేళనము సలిపి హీనపరచుటను

                                    సైపగ లేక నే శ్రమము పడితి

                               తొందరపాటు యెంతో చేటు యౌనని

                                     యెరుగని నా రాజు  యేద పోయె

 

                 ఆ.వె.      బిచ్చముగ నొసగిన విషయము నేలను

                              బిడియమును వదలిన పేద వాడు;

                              స్వాభిమానము కల జవ్వని యెన్నడూ

                              తిరిగి వెడలదుకద తిరిపెమునకు”

 

  “మరి ఈ పేదవాని ఇంట నుండగలరా రాకుమారీ?”

  “మా జనకునకు రాజ్యము లేనప్పుడు కలుగని సందేహము ఇప్పుడెందుకు కలిగింది అన్నా?”

  “అంటే..” మాటలు దొరక్క ఆగిపోయాడు మాధవుడు.

  “అర్ధమయింది. రాకుమారి అనగానే ఆ దూరం వచ్చేస్తుంది సహజంగా. అందుకే నేను ఆ పదవి వద్దనుకుంటున్నా సోదరా! నాకు మీ అందరితో బాంధవ్యం, మీ ఆప్యాయత కావాలి. పైపై మెరుగులే తప్ప ప్రేమలు లేని ఆ సౌధాలు, ఆ భోగ భాగ్యాలు నాకు వద్దు. పురుషోత్తమ దేవుల ఆజ్ఞానుసారమే నాకు సేవకుని వెదకండి. కానీ, కాస్త మంచివానిని చూడండి.”

  మాధవుని గుండె కదిలి పోయింది పద్మావతి పలుకులు విని.

  పక్కనే ఉండి అంతా వింటున్న నందుడు కన్నులు తుడుచుకుంటూ ముందుకు వచ్చాడు.

  “మాధవా! సిరులొలుకు ఈ చిన్నారి మన ఇంటికి వచ్చినపుడే నా కూతురయింది. ఆ విధముగనే భావించి ఇచ్చట నుంచితిమి..

 

మానినీ వృత్తం.    మంజుల నాదము మా యెద నిండగ మప్పుగ నుండగ మన్ననతో

                          రంజిలు నిల్లదె రమ్యముగా చిరు లాస్యము సవ్వడి రాజిలగా

                          కంజజు సృష్టిన కన్నులు పండగ కానగ నుల్లము కంపితమౌ

                          పంజన జవ్వని బంగరు తల్లిగ వచ్చెను గామన వాకిటకే.

 

  మన ఇంటి సిరిని మంచివానికే ఇచ్చి కళ్యాణ మొనర్చెదము.”

 

  “అంతే. మాధవుని వివాహముతోనే పద్మావతికి కూడా మంచి వరుని చూసి జరిపిద్దాము.” అప్పుడే అచటకు వచ్చిన గౌతమి అందుకుంది.

  అంతకు ముందు జరిగిన సంభాషణ వినకున్ననూ, నందుని మాటలతో, పద్మావతికి ధైర్యం కలిగించడానికి అనేసింది.. సమయోచితంగా.

  మాధవుని మనసులో కాదంబరీ దేవి మెదిలింది అసంకల్పితంగా.

  “అసాధ్యమౌ నా కోరికని అణగ దొక్కెయ్యాలి..” అనుకుంటూ ముందుకు కదిలాడు రోజూ వారీ కార్యాలు నెరవేర్చడానికై.

  వాకిలి దాటుతుండగానే ఎదురయ్యాడు, కోటలోని భటుడు.

  “రాకుమారుడు పురుషోత్తములవారు మిమ్మల్ని పిలువనంపారు ప్రభూ!” రాకుమారునికి కుడి భుజం వలే నుండే మాధవుని కూడా ప్రభూ అని మన్నించడం ఎవరూ చెప్పకుండానే నేర్చుకున్నారు, కోటలోని పరివారం.

  “అక్కడికే బయలుదేరాను. ఎక్కడున్నారు వారు?”

  “ఉద్యానవనంలో. మాధవీలతా మంటపం వద్ద. మిమ్మల్ని అచ్చటికే రమ్మన్నారు.”

  తన అశ్వం కళ్యాణిని అధిరోహించి భటుని వెంటే బయలుదేరాడు మాధవుడు.. పట్టణంలోని విశేషాలను విచారిస్తూ.

  “నగరంలోని ప్రజలందరూ కుశలమేనా? కపిలేంద్ర ప్రభువు పాలనలో సంతుష్టులై ఉన్నారా?”

  “ఉన్నారు ప్రభూ! యుద్ధాలు జరుగుతున్నా, పాడి పంటలకేమీ లోటు లేదు. సమరాలకి కూడా అలవాటు పడిపోయారు ప్రజలు.”

  మాధవుడు గ్రహించాడు.. ఎప్పటికైనా ఈ యుద్ధాలు ముగిసేనా అని అడుగుతున్నాడతడని.

  ఒక్కొక్క వంశం మారి కొత్త పాలన రాగానే జైత్ర యాత్రలు.. సామ్రాజ్య విస్తరణ. సామాన్య ప్రజ భీతితో కాలం గడపడం లో వింత లేదు. కానీ అది ఏ దేశంలో నైనా తప్పని స్థితే. వారు ఊరుకున్నా, పక్క రాజ్యం వారు ఊరుకోరు. ముష్కరుల దాడి సరే సరి. అది నిరంతరం సాగిపోయే ప్రక్రియే.

  “రాకుమారుడు పురుషోత్తమ దేవుల వారి మీదే కొంత ఆశ ఉంది ప్రభూ! వారు మహరాజు అయే సరికి కళింగ రాజ్యం సుస్థిర మవుతుందని, జన సామాన్యం నిశ్చింతగా కాలం గడప గలరనీ అనుకుంటున్నారు.” ఎందుకైనా మంచిదని, భటుడు పొగిడాడు.. రాకుమారుని మిత్రుడాయె మరి.

  మాధవుడు చిరునవ్వుతో తల పంకించాడు.

  “అదిగో ప్రభూ.. మాధవీలతా మంటపం. రాకుమారులు ఏ క్షణంలో నైనా వచ్చేస్తారు.” భటుడు అభివాదం చేసి వెళ్లి పోయాడు.

  

                              

 

  మాధవుడు, గుర్రాన్ని కొంచె దూరంలో కట్టేసి రాగానే, పురుషోత్తమ దేవుడు కూడా వచ్చేసి, మిత్రుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు.

  “మనం రోజూ, యుద్ధ విద్యని అభ్యాసం చెయ్యాలి మాధవా. గజ సమూహాలని పెంచాలి. తండ్రిగారు ఆనతిచ్చారు. రాబోయే కాలంలో, సామ్రాజ్య రక్షణకై, మనం తయారుగా ఉండాలి.”

  “అవశ్యం రాకుమారా! రేపటి నుండే ఆరంభిద్దాం.”

  “పద్మావతీ దేవి ఎక్కడుంది? ఆవిడ వివాహం ఏమయింది? ఆ కంచి రాజుతో వెళ్లి పోతోందా?” పురుషోత్తముడు, కించిత్ దర్పంగా అడిగాడు.

  మాధవుడు తనని పిలిపించిన కారణం గ్రహించాడు.. యుద్ధం, అభ్యాసం.. అవన్నీ సాకులే.

  “పద్మావతీదేవి క్షేమంగానే ఉన్నారు ప్రభూ! మా బంధువుల ఇంట ఉంచాను. వారందరితో బాగా కలివిడిగా ఉంటున్నారుట.”

  “హూ.. మరి వివాహం..”

  “తగిన వరుని కోసం వెతుకుతున్నాను.”

  “ఇంకా ఏ ఛండాలుడూ దొరకలేదా? అంత కష్టమా?”

  మాధవునికి అర్ధ మయింది. రాకుమారుడు తనకు జరిగిన అవమానం మరచి పోలేకుండా ఉన్నాడు. పద్మావతీ దేవి మీద మంచి అభిప్రాయం కలిగించుట తన ప్రధమ కర్తవ్యం.

  “రాకుమారా! పద్మావతీ దేవి ఉత్తమురాలు. రాకుమారి అయిననూ కించిత్తు కూడా గర్వము లేదు. మేము వారిని చాలా మధ్యతరగతి కుటుంబంలో ఉంచాము. వారితో వారి కుమార్తె వలెనే కలిసి మెలసి మెలగుతున్నారు.”

  పురుషోత్తమ దేవుడు, మాధవుని మాటల మీద పెద్ద ఆసక్తి లేనట్లు పరిసరాలని పరికించ సాగాడు.

  “ప్రభూ! మీరు ఆనతి ఇచ్చినటులే రాకుమారిని మాలిన్యాన్ని తీసి, శుభ్ర పరచే వాని కే ఇచ్చి వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాను. విజ్ఞులు మీరు.. ఆలోచించండి.. రాకుమారి పద్మావతీ దేవి..

     

                    సీ.   అభము శుభము తెలియని యమాయకురాలు

                                       ఎండకన్నెరుగని ఇంతి యాపె

                           నీ గుణగణముల నెటులనో విని యుండి

                                      పేర్మిని యెంతయో పెంచు కొనెను

                            పవలు రేయిను గడుప కడు కష్ట పడగ

                                      క్షణమొక గడియగా గడుపు చుండె

                            పరిచారిక వలెనే పనులు చేయుచునుండె

                                      పదుగురి మెప్పునే బాగ పొందె

 

                      ఆ.వె.   కన్న తండ్రి యేమొ కనడు వినడుమాట

                                 బెదరి పోయినట్టి బేల సుమతి

                                 తప్పు నొకరు చేయ దండన మొకరికా

                                 ఏమి తర్క మిదియె ఎన్నగాను?

 

  ఇంత కన్ననూ మీకు నేను చెప్పదగిన వాడను కాను.” మాధవుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

  పురుషోత్తమ దేవుడు సాలోచనగా చూశాడు మాధవుని. మంచి మిత్రుని లక్షణమే అది..

  అంతలో..

  “అన్నా! అన్నా.. కాపాడండి..” ఆర్తనాదం వినిపించింది..

  పురుషోత్తమ మాధవులిద్దరూ ఆందోళనగా చుట్టూ చూశారు. మాధవీ లతా మంటపం వెనుక నున్న సెలయేరు దగ్గర నుంచి..

  పరుగున వెళ్లారు ఇరువురూ.

  సెలయేరులో కొట్టుకుని పోతూ కనిపించింది, రాకుమారి కాదంబరీ దేవి..

                               ……………………….

......మంథా భానుమతి