Facebook Twitter
పూర్ణమదం పూర్ణమిదం

 

పూర్ణమదం పూర్ణమిదం

శూన్యం నుంచే పుట్టి
శూన్యంలోనే కలిసిపోయే మస్తిష్కమొక్కటి
రెండు గాజుకళ్ళేసుకొని
లోకాన్ని వెతుకుతుంటుంది

శూన్యంలో ఏముంటుందని దాన్ని అడగ్గలవా?
అనంత జగత్తు నిండి ఉన్నది శూన్యంలోనే అని
ఎప్పటికో స్ఫురిస్తుంది దానికి

కటిక రాత్రుల నల్లటి నిశ్శబ్దాలనోసారి అడుగు
ఇంత ఏమీలేనితనాన్ని గుడ్డిగా మోస్తున్నదెందుకని
మరో ఉదయంలో ఇగిరిపోయి శూన్యమవటానికే అనదూ!

చిగురుటాకుల రెక్కలు పండి నిర్ధాక్షిణ్యంగా రాలిపడిపోతూ ఎందుకింకా నవ్వు
నీకిపుడు ఇంకేం మిగిలిందన్నపుడు
శూన్యంలో పుట్టే మరో వసంతం
మరో శూన్యంలోకి తీస్కెళ్తున్నంత కాలం
ఈ నవ్వు చెదరదనే చెప్తుంది

ఏది ఎక్కడ మొదలైనా
ఏది ఎక్కడ అంతమైనా
ఉన్నదొక్కటే శూన్యం
పూర్ణమదం పూర్ణమిదం

-సరిత భూపతి