Facebook Twitter
" ఏడు రోజులు " 15వ భాగం

" ఏడు రోజులు " 15వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

    ఇద్దరూ కలిసి మౌనంగా ముందుకు నడుస్తున్నారు. షూటింగ్ ఏర్పాట్లు ఆగిపోయాయి. వాతావరణం కలవరంగా తయారైవుంది.
    
    "తమ్మారెడ్డి భరద్వాజ, దాసరినారాయణ రావు, నరేష్, ఇంకా చాలామంది వచ్చారు" మరికొంత ముందుకు వెళ్ళాక చెప్పాడు జోసెఫ్.
    
    "అలాగా" అన్నట్టుగా తలపంకించాడు భవానీశంకర్.
    
    "రేపట్నుండి ఈ జూనియర్ ఆర్టిస్టులు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కొనసాగిస్తారట"
    
    "...."
    
    "ఏదోలేరా! కాసేపు వుండి వెళ్ళిపోదాం"
    
    పదిహేను నిమిషాల్లో వివాదస్థలికి చేరుకున్నారు. ఇద్దరూ అక్కడ వున్న మిగతా మిత్రులు భవానీశంకర్ ని చీవాట్లు వేశారు. కిమ్మనలేదు భవానీశంకర్. నిశ్శబ్దంగా నిలబడి అందర్నీ పరికించసాగాడు.
    
    పత్రికలవాళ్ళు టీవీ ఛానెల్స్ వాళ్ళు, హడావిడి పడుతున్నారు. "చచ్చేవాడు చస్తే బతికున్నోడికి పండుగ" అన్నట్లుగా టీవీ కెమేరాల్లో బంధింపబడాలని చాలామంది ప్రయత్నిస్తూ కెమేరాలు ఎటుతిరిగితే అటు తిరుగుతున్నారు.
    
    వాళ్ళవైపు వెటకారంగా చూశాడు భవానీశంకర్ ఇప్పుడే కాదు, ఒకసారి కర్నూల్ లో కూడా ఇట్లాంటి సంఘటనే జరిగింది.
    
    "తను బంధువుల పెళ్ళికోసం కర్నూల్ వెళ్ళాడు. పెళ్ళి మద్యలో ఆగిపోయింది. కట్నం కోసం పీటల మీద పెళ్ళి ఆగిపోవడంతో పెళ్ళికూతురు తరపువాళ్ళ వేదన అంతా ఇంతా కాహ్డు. తను పెళ్ళికొడుకు తరపు అయినప్పటికీ, పెళ్ళికూతురి తరపు వాళ్ళమీద జాలి కనబర్చాడు.
    
    పెళ్ళికూతురి తల్లిదండ్రులు బాగా ముసలివాళ్ళు పైగా పేదవాళ్ళు వాళ్ళను చూస్తుంటే తనక్కూడా ఏడుపు ముంచుకొచ్చింది. కఠినంగా వ్యవహరిస్తున్న పెళ్ళికొడుకువైపు వాళ్ళను శక్తిమాన్ లా మారికొట్టాలనిపించింది కూడా!
    
    ఇట్లాంటి విపత్కర పరిస్థితిలో పెళ్ళికూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి అందరూ వున్నారు కాబట్టి ఆమెను ఆదుకోగలిగారు.
    
    పెళ్ళిపెద్దలు ఇరువురి మధ్య ఏకీభావానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి సమీపంగా వున్న ఒక హాస్పిటల్ లో షూటింగ్ నిమిత్తం చిరంజీవి వచ్చాడు అంతే! ఇక్కడ వీళ్ళ బాధ ఏమైతే మాకెందుకు అన్నట్టుగా సగానికి పైగా బంధుజనాలు చిరంజీవిని చూడ్డానికి పరుగో పరుగు!
    
    ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే కనపడుతోంది. ఏంటో వెర్రిజనాలు!"
    
    "జోసెఫ్" కాసేపటి తర్వాత పిలిచాడు భవానీశంకర్.
    
    "ఊ..." చూడకుండానే పలికాడు జోసెఫ్.
    
    "ఇంకా ఇక్కడ నిల్చుని ఏం చేస్తారు?" అన్నాడు భవానీశంకర్.
    
    "సరేలేరా! ఇంకా నువ్వు బతకనిచ్చేట్టు లేదు" అని మిగతా మిత్రులవైపు చూస్తూ, "రేయ్! నాష్టచేసి ఇంకా వెళ్దాం రండి" అన్నాడు జోసెఫ్.
    
    మిత్రులందరూ అక్కడ్నుంచి బయలుదేరారు. వెళ్తుంటే జోసెఫ్ అన్నాడు.
    
    "రజనీకాంత్ తో మాట్లాడి, ఫోటో తీయించుకుని, నా గుర్తుగా ఆయనకి ఏదైనా గొప్ప కానుకను ఇవ్వాలని వుందిరా"
    
    "అభిమానం వుండాలి. కాని నీలా వెర్రి అభిమానం వుండకూడదు. ఒకసారి గొప్ప కానుక అంటావు, ఇంకోసారి సినిమా హిట్టయితే ఫ్రెండ్స్ అందరికీ చికెన్ బిరియాని డిన్నర్ అంటావు. ఈ పిచ్చి కాస్త వదిలించుకోరా" అన్నాడు భవానీశంకర్.
    
    "వెర్రిగా వుండకూడనిది అభిమానం ఒక్కటే కాదు, ప్రేమ కూడా" అన్నాడు జోసెఫ్.
    
    "అంటే?"
    
    "నీది వెర్రిప్రేమ"
    
    "న అపరిమ వెర్రిది కహ్డు, ప్రేమకోసం వెర్రివాడినయ్యాను"
    
    "మాటలు నేర్చాడు మన హీరో" అంటూ భవానీశంకర్ ను చుట్టేశాడు జోసెఫ్.
    
    మిగతా మిత్రులు అందుకు వంతపాడుతూ "మామూలు హీరో కాదు, మెగాస్టార్ మనవాడు" అన్నారు.
    
            *    *    *
    
    ఉదయం పదకొండు గంటలకు కావొస్తోందనగా ఇంటికి వచ్చాడు భవానీశంకర్.
    
    "నువ్వేదో ఆ పిల్లను ఉద్దరిస్తాను అన్నావుకదా! నువ్వు ఉదరించక మునుపే ఆ పిల్ల వెళ్ళిపోయింది" రాగానే అంది లక్ష్మీదే వమ్మ ఆ గొంతులో కాసింత వ్యంగ్యం.
    
    ఉలిక్కిపడి చూశాడు భవానీశంకర్.
    
    నవ్వింది లక్ష్మీదేవమ్మ. "ఏంట్రా అలా చూస్తావు? రాత్రి పన్నెండు గంటలకు మీసాలు లేని గడ్డపాయన కార్లో వచ్చాడు. ఒంటిగంటకల్లా ఆ పిల్లను తీసుకుని వెళ్ళిపోయాడు" నవ్వాక అంది.
    
    ఒక్కసారి అగ్నిపర్వతం కూలి తన మీద పడుతున్న భావన కలుగుతుంటే అప్రయత్నంగా చేతిలోని పాకెట్ రేడియోని జార విడిచాడు భవానీశంకర్.
    
    "కానీ ఒక్క విషయంలో జాలివేస్తోంది. చేసుకునేవాడు ఎవ్వడైనప్పటికీ పడుచువాడై వుంటే బాగుండేది. కాని ఆ వచ్చినవాడు సాయిబుకే తండ్రిలా వున్నాడు" లక్ష్మీదేవమ్మ గొంతులో కొద్దిగా సానుభూతి.
    
    అప్పటికి భవానీశంకర్ పరిస్థితి అరణ్య రోదనలా తయారయ్యింది. సత్తువ లేనివాడిలా అడుగులో అడుగు వేస్తూ గుమ్మం దాకా వెళ్ళి గౌసియా వాళ్ళ ఇంటివైపు చూశాడు.
    
    దేవతలేని గుడిలా కనిపించింది ఆ ఇల్లు కాని అదేమీ పట్టనట్లుగా ఆమె చిన్న చెల్లెళ్ళు ముగ్గురు ఇంటిముందు తాడు ఆట ఆడుకుంటున్నారు. పెద్ద చెల్లెళ్ళు ఇద్దరు కూలిన బాతుల గూడును తిరిగి కడుతున్నారు. ఇంకో చిన్న పిల్ల గడప సందుల్లో కూర్చుని వుంది. అందరికంటే చిన్నదాన్ని ఎత్తుకుని వున్న ఖతీజాబీ మాత్రం కొత్త చీరలు అమ్మేవాడిని ఇంటిముందు నిల్చోబెట్టుకుని ఏదో మాట్లాడుతోంది.
    
    ఎప్పుడూ పాత చీరలు బేరం చేసే ఖతీ జాబీని అలా చూడగానే భవానీశంకర్ సహించలేకపోయాడు. అలాగని ఆమెను ఏమీ అనలేడు కాబట్టి పగిలిన గుండె గుప్పెడు వేదనను పంచి ఇస్తుంటే అప్రయత్నంగా కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.
    
    విమానంలో షేక్ పక్కన కూర్చుని వుంది గౌసియాబేగం. బాగా ఏడ్చినందున ఆమె కళ్ళూ, ముఖం ఉబ్భిపోయి వున్నాయి. అవేమీ బయటికి కనిపించకుండా ధరించిన బురఖా అడ్డుకుంటోంది. అప్పటికే బాగా అలసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆమె ఏడవడంలేదు. నిశ్శబ్దంగా కూర్చుని ప్రియుడి గురించి ఆలోచిస్తోంది సన్నగా వెక్కుతోంది కూడా కాని ఆమెను ఎవ్వరూ గమనించడంలేదు.

...... ఇంకా వుంది .........