Facebook Twitter
" ఏడు రోజులు " 14వ భాగం

" ఏడు రోజులు " 14వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 

  అనుకోని ఆనందం ఎదురైతే అందరూ ఎలావుంటారో తెలీదు కాని తను మాత్రం లోకాన్ని మరిచిపోయాడు. అందుకే ఒక పని చేయాల్సింది పోయి మరోపని చేయడం ఒక మాట మాట్లాడాల్సింది పోయి మరొక మాట మాట్లాడ్డం చేశాడు. తన ప్రవర్తనకు మిత్రులంతా నవ్వుకున్నారు. తనూ నవ్వాడు కాని తమ ప్రేమ గురించి ఆ రోజే తన మిత్రులతో చెప్పుకోలేక పోయాడు.

    అదే సమయంలో గౌసియా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఇంటినుండి వచ్చారు.
    
    వాళ్ళను చూడగానే సిరాజ్ గాడు అలవాటుగా తన పాత 'చాయ్ బండి చపాతీ' అంటూ సన్నగా ఈల వేస్తూ పాడటం మొదలెట్టాడు.
    
    "ఊరుకోరా" వారించాడు తను.
    
    "ఏంట్రా? ఏ రోజూ లేందీ ఈ రోజు సపోర్ట్ ఇస్తున్నావు?" ఆశ్చర్యంగా చూశాడు సిరాజ్.
    
    "ఒకర్ని వెక్కిరించడం దేనికి? వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు" అన్నాడు తను.
    
    "ఇది వెక్కిరించడం కాదు జస్ట్ కామెడీ సో టేకిట్ ఈజీ?" అంటూ కూర్చున్న చెయిర్ లోంచి ముందుకు వంగి, "నాకేదో అనుమానంగా వుంది" అన్నాడు సిరాజ్.
    
    "అనుమానం దేనికి?" గుమ్మడికాయల దొంగలా అడిగాడు తను.
    
    "సపోర్ట్ ఎందుకు ఇస్తున్నావు?"
    
    "సపోర్ట్ అని కాదు"
    
    "మరి?"
    
    "ఏదో... అన్నాడు అంతే!"
    
    అంటూ అప్పుడు విషయాన్ని దాటవేశాడే గాని, నిజానికి తమ ప్రేమ గురించి మిత్రులతో చెప్పుకోవాలని తనకు ఆరాటంగా వుంది. కాని ఏదో భయం అందుకే కొన్ని రోజులవరకు మౌనంగా వుండిపోయాడు.
    
    అయితే ఆరోజు దావత్ తర్వాత ఇంటికి వెళ్తుంటే గౌసియా గురించి ఆలోచనలు తనను వివశుడ్ని చేశాయి. అందుకే తనలో తనే నవ్వుకుంటూ ఇంటివైపు నడవసాగాడు.
    
    "ఏయ్ పిల్లగా... శంకర్" కొంతదూరం వెళ్ళాక బాలస్వామి గొంతు వినబడింది.
    
    "వోర్నీ! వీడు చూశాడా? క్లాసు తప్పదు" అనుకుంటూ ఆగి వెనక్కు చూశాడు.
    
    "నీకు మొలతాడు లేదా?" అనుకుంటూ దగ్గరగా వచ్చాడు బాలస్వామి.
    
    "ఆ..." తడబడ్డాడు తను.
    
    "మొలతాడు లేని ఆ తుర్కనాకొడుకులు మనిషికి రెండు ముక్కలు అంటూ లెక్కగట్టి కూర వేస్తారు. అట్లాంటివాళ్ళ దావత్ కు నువ్వు వెళ్తావా? అస్సలు నీకు ఎన్నిమార్లు చెప్పాలి? ఆ తుర్కోళ్ళ పిల్లగాడితో దోస్తానం చేయొద్దని?" అధికారం చలాయించాడు బాలస్వామి.
    
    "ఆ..." తడబాటే తన సమాధానం అయింది.
    
    "ప్చ్! మన హిందువులు బాగుపడరు" అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా అక్కన్నుండి విసుగ్గా వెళ్ళిపోయాడు బాలస్వామి.
    
    "హమ్మయ్య" అతడు వెళ్ళిపోగానే ఊపిరి పీల్చుకున్నట్టయింది తనకు.
    
    "రేయ్... రేయ్..."
    
    మిత్రుల కంఠం వున్నట్టుండి వినబడింది.
    
    ఉలిక్కిపడి చూశాడు భవానీశంకర్.
    
    "కలలోకి వెళ్ళావేమిరా?"
    
    "కలలో ఎక్కడెక్కడ విహరించావు?"
    
    మిత్రులు టీజింగ్ గా అడుగుతుంటే లేదురా... లేదురా...." జుత్తు సరిచేసుకుంటూ దాటవేశాడు భవానీశంకర్.
    
    అప్పటికి సమయం ఏడున్నర కావొచ్చింది. షూటింగ్ ఏర్పాట్లు ఇంకా గావిస్తున్నారు.
    
    భవానీశంకర్ కు విసుగ్గా వుంది. "ఈ ఏర్పాట్లకు అంతం ఎప్పుడో" హడావిడి పడుతున్న వర్కర్స్ ని చూస్తూ అన్నాడు.
    
    "ఆ తొందర ఎందుకు?" అన్నాడు జోసెఫ్.
    
    అందుకు ఏం మాట్లాడలేదు భవానీశంకర్ మనసును కుదుటపర్చుకునేందుకు గానూ తనకు వచ్చిన పాటను హమ్ చేయసాగాడు.
    
    "హింద్ దేశ్ కే నివాసీ సబ్ జనో ఏక్ హై..."
    
    అంతలో మూడు పోలీస్ వ్యాన్లు సర్రున అక్కడికి దూసుకువచ్చాయి.
    
    "షూటింగ్ కి ఇంత బందోబస్తా?" ఆశ్చర్యపోయారు. పోలీసులు వ్యాన్లలోంచి దిగి హుటాహుటిగా అక్కడికి సమీపంగా వున్న గుడి సెలవైపు నడిచారు.
    
    ఎవ్వరికీ ఏమీ అర్ధం కావడంలేదు. అక్కడున్న జూనియర్ ఆర్టిస్టుల గుడిసెల్ని తొలగించడానికి పోలీసులు సంసిద్దులు అయ్యారని కాసేపటి తర్వాత అందరికీ అర్ధం అయింది.
    
    జూనియర్ ఆర్టిస్టులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు వాళ్ళ ఆక్రందల్ని, ప్రతి ఘటనల్ని, అరుపుల్ని, ఎంతమాత్రం లెక్కచేయడంలేదు. విచక్షణారహితంగా గుడిసెల్ని కూలగొడుతున్నారు.
    
    షూటింగ్ చూడ్డానికి వచ్చినవాళ్ళంతా అటుకేసి పరుగెట్టసాగారు. భవానీశంకర్, అతడి మిత్రులు అక్కడే నిలబడిపోయి చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
    
    "మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడేదో పెద్ద గొడవలు జరిగేట్టువున్నాయి" కాసేపటి తర్వాత అన్నాడు భవానీశంకర్.
    
    "వద్దు" అన్నాడు జోసెఫ్.
    
    "గొడవలు జరిగితే కష్టంరా" అన్నాడు భవానీశంకర్.
    
    "గొడవలు ఏం జరగవు" మరో మిత్రుడు అన్నాడు.
    
    "గొడవలు జరగవుగానీ కాసేపయ్యాక సినిమా ప్రముఖులు వస్తార్రా ఇక్కడికి! వాళ్ళను దగ్గర్నుండి చూడొచ్చు" అన్నాడు జోసెఫ్.
    
    "ఏంట్రా? గొడ్డోడు గొడ్డుకి ఏడిస్తే మాలోడు కొవ్వుకు ఏడ్చాడంట" అన్నాడు భవానీశంకర్ (తెలంగాణ సామెత)
    
    "ఎవ్వడికి ఏమైతే మనకేంట్రా? మనం చూడాల్సింది ఫిల్ముస్టార్లను ఆ కోరిక పెద్ద ఎత్తున తీరబోతోంది" ఖుషీగా అన్నాడు జోసెఫ్.
    
    "ఛ! రాస్కెల్" కోప్పడ్డాడు భవానీశంకర్.
    
    అతడితో మిత్రులు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. పోలీసుజులుం గురించి మాట్లాడుకోసాగారు.
    
    "గొడవలు జరిగినా ఈ వెధవలు కదిలేట్టులేరు" తనలోతను అనుకోబోయి పైకే అనేశాడు భవానీశంకర్.
    
    "విసిగించొద్దురా నువ్వెళ్ళు" భవానీశంకర్ వైపు చూడకుండానే చేయి విదిల్చాడు జోసెఫ్.
    
    "వెళ్తానురా" రోషంగా అన్నాడు భవానీ శంకర్.
    
    అతడి మిత్రుడు ఆ రోషాన్ని కించిత్ కూడా లక్ష్యపెట్టలేదు. కాసేపటి తర్వాత అక్కడికి ఐదారు కార్లు వచ్చీరాగానే, అతడి మిత్రులంతా వడివడిగా కార్ల వెనక పరుగెట్టినట్టుగా వెళ్ళారు.
    
    భవానీశంకర్ వెళ్ళలేదు. వెనక్కితిరిగి బస్టాండ్ వైపు అడుగులు వేశాడు.
    
    బస్టాండ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా కలకలమే కనబడింది. జూనియర్ ఆర్టిస్టులు కొందరు అక్కడికి చేరి గొడవ సృష్టిస్తున్నారు.
    
    "మాకు జరిగిన అన్యాయాన్ని మేం సహించం"
    
    "మాకు న్యాయం జరగాలి"
    
    "అందరూ కుమ్మక్కై మా బతుకుల్ని నాశనం చేస్తున్నారు"
    
    "మాకు ఫిలింనగర్ లోనే ఇళ్ళు కావాలి"
    
    "ఇది కావాలని జరిగిన కుట్ర"
    
    "ఈ ఊబిలో మేం ఇరుక్కోం కష్టపడినా మేం అనుకున్నది సాధిస్తాం"
    
    "అవసరమైతే బస్సుల్ని, ఆటోల్ని ఆపేస్తాం అసలు ఈ రోడ్డెంబడి వాహనాలే తిరగకుండా చేస్తాం"
    
    జూనియర్ ఆర్టిస్టులు ఒకరితర్వాత ఒకరు ఆవేశంగా మాట్లాడుతూ ఎగిసెగిసిపడుతున్నారు.
    
    "కొంపదీసి బస్సులు, ఆటోలు, బంద్ అయిపోతే ఇంటికి వెళ్ళడం కష్టమైపోతుంది" వాళ్ళనే చూస్తూ భయంగా అనుకున్నాడు భవానీశంకర్.
    
    అతడి భయాన్ని, కంగారుని, పరీక్ష పెట్టినట్టుగా అర్ధగంట గడిచినా ఒక్క బస్సు రాలేదు.
    
    "శంకర్..." దూరంనుండి జోసెఫ్ గొంతు వినబడింది. తిరిగి చూశాడు భవానీశంకర్.
    
    "ఏంట్రా? చెప్పాపెట్టకుండా వచ్చేస్తే మేం ఏం అనుకోవాలి?" దూరంనుండే కోప్పడుతూ దగ్గరగా వచ్చాడు జోసెఫ్.
    
    "మరేం చేయాలి? మీరు కదిలేట్టు లేరు" అన్నాడు భవానీశంకర్.

    "నీకు ఇంత తొందర అవసరం లేదురా! మేం వుండగా నువ్వు ఏ విషయం గురించి కూడా బాధపడకూడదు మా స్నేహితుడు బాధపడితే మాకూ బాధేకదా! వెళ్దాంరా" దగ్గరగా వస్తూనే అన్నాడు.
    
    "..."
    
    "రారా" భవానీశంకర్ భుజంపై చేయివేశాడు జోసెఫ్.
    
    "నా మనసు ఎందుకో శంకిస్తోంది. నేను వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళాలి. గౌసియాను చూడాలి" స్నేహితుడి వెంట నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ అన్నాడు భవానీశంకర్.
    
    "నీవు ఇందాకట్నుంచి బాధపడుతుంటే, అర్ధం చేసుకోకుండా వుండేందుకు మేం చిన్నపిల్లలం కాదు గౌసియాతో నీ పెళ్లిని జరిపించే బాధ్యత మాది ఆ బాధ్యతను మేం ఎప్పుడు మర్చిపోయాం. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడొద్దు" అన్నాడు జోసెఫ్.
    
    "అది కాదురా" తన భయాన్ని చెప్పుకోబోయాడు భవానీశంకర్.
    
    "నువ్వు ఇంకేం మాట్లాడొద్దు" అన్నాడు జోసెఫ్.
    
    "నా మాట వినరా...." అన్నాడు భవానీశంకర్.
    
    "ఏంమాట?"
    
    "మీ ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తోంది అయితే అనుకోకుండా నిన్న రాత్రి కిరాత్రే గౌసియా పెళ్ళి జరిగింది అనుకో అప్పుడేం చేస్తారు?"
    
    "ఆ తాళిని తెంపి పడేస్తాం"
    
    "ఆ అవకాశం లేకుండాపోతే?"
    
    "ఎలా పోతుంది? ఐమీన్ అమ్మాయి చేసుకున్నవాడి వెంట వెళ్ళిపోవడమా? లేక చేసుకున్నవాడికి అంకితం కావడమా?" అని అడిగి ఆ వెంటనే "ఇఫ్ యూ డోంట్ మైండ్ రా! ఆ ఏసు ప్రమాణంగా నీ ప్రేమ గొప్పది అని నాకు తెల్సు అయినప్పటికీ అడిగాను...." అన్నాడు జోసెఫ్.
    
    కొన్ని క్షణాలవరకు భవానీశంకర్ ఏం మాట్లాడలేదు. స్నేహితుడివైపు కళ్ళింత చేసి చూశాడు.
    
    "ఊ... చెప్పరా?" అన్నాడు జోసెఫ్.
    
    "ఆమె లేకుండా నేను బతకలేను" అని మాత్రం అనగలిగాడు భవానీశంకర్.
    
    జోసెఫ్ ఇంకేం అడగలేదు. స్నేహితుడి మనసు తెరిచిన పుస్తకంలా అర్ధమైంది అన్నట్టుగా భవానీశంకర్ భుజాన్ని మృదువుగా తట్టాడు.

...... ఇంకా వుంది .........