Facebook Twitter
వద్దు ఏదీ వద్దు...


 

వద్దు
ఏదీ వద్దు...

నాకేదీ వద్దు..
ఏ బాధ్యతా వద్దు..
ఏ బంధమూ వద్దు
అవసరాణుగుణంగా మీరు పంచే ప్రేమా వద్దు.
బాధ్యత పేరుతో మాకిచ్చే విలువా వద్దు
సంస్కృతి,ఆచార,వ్యవహారాల పేరుతో మాపై చూపే నమ్మకమూ వద్దు
ఏదీ వద్దు బాబోయ్...
మాకేదీ వద్దు..
నన్ను నన్నుగా బ్రతకనీయని ఏదీ వద్దు
నేను నాలా ఉండలేనప్పుడు నాకెందుకీ సంబంధబాంధవ్యాలు.

రెక్కలున్నా ఎగరలేము
పరిగెట్టాలనున్నా కనీసం నడవలేము
మనసారా నవ్వాలనున్నా
మాపై పెట్టిన గౌరవభావ భారానికి నవ్వలేము
గగనతలాన్ని కనుచూపుమేర చూస్తూ కలలు కందామన్నా...
తల ఎత్తలేని బాధ్యతల్లో మునిగి-మునిగి పోతుంటాము.

పుట్టింది మొదలు
ఇలా ఉండాలి..
అది చేయకూడదు..
ఇదే సరే..అది వద్దు..
వాడు మగాడు..నువ్ ఆడపిల్లవి
నీకెందుకే వాడితో పంతం..
ఒక ఇంటికి పోవలసిందానివేగా
"ఆడ"పిల్లా అని ఊరకనే అనలా..
ఎప్పటికయినా పరాయిదానివే..
వినీ వినీ వద్దన్నా కాదన్నా మాకు మేమే పరయి వారమవుతాం..

పెళ్ళి చేస్తారు
అత్తింట్లో మొదలు ..
"ఆడ"పిల్ల" "ఆడ"పిల్లే..
"ఈడ"పిల్లవుతుందా..
అమ్మాయ్ అంటూనే మరో "అమ్మ"
తనూ ఆడదనే విషయం మరచిన మరో "ఆడపిల్ల.
మారాలీ మారాలీ అని అనుకుంటాము గానీ..
మనలో మనం తొంగి చూసుకుంటే
మార్పు ఎక్కడ రావాలన్నది మనకి తెలుస్తుంది.

జీవితమంతా అయిపోతుంది.
కానీ..
"ఆడాపిల్లో "ఈడ"పిల్లో మాత్రం
ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు
అన్నింటా తానై ఉంటూ నడిపించే ఆడదానికి
తానేడ పిల్లో మాత్రం తెలియదు.

 

- సంధ్యా తులసి