Facebook Twitter
" ఏడు రోజులు " పార్ట్ -4

" ఏడు రోజులు " పార్ట్ -4

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 * మంగళవారం *
     వేకువజామునే లేచి వ్యాయామశాలకు బయలుదేరాడు భవానీ శంకర్.
    వాతావరణం ఆహ్లాదంగా వుంది. అతడి మనసు గందరగోళంగా వుంది.
 "జన్మ ఒక్కటే... జననం  ఒక్కటే! పిల్చే గాలి  ఒక్కటే... తాగే నీరు  ఒక్కటే! వుండే దేశం  ఒక్కటే ప్రవహించే రక్తంలో రంగు  ఒక్కటే!  కాని మనసులోని  భావాలు మాత్రం  ఒక్కటిగా లేవు. మనుషులుగా క్రూరమృ గాలకంటే హీనంగా ప్రవర్తిస్తుంటారు "  మనసులో అనుకుంటూ నెమ్మదిగా  అడుగులు ముందుకు వేస్తున్నాడు అతడు.
  "శంకర్... " కొద్దిదూరం వెళ్ళాక వెనుకనుండి బాలాస్వామి కంఠం వినబడిది.
   ఆగుతూ వెనక్కి చూశాడు  భవానీ శంకర్.
  "ఆరోగ్యం బాగోలేదా?  బాగోలేకపోతే ఇంట్లోనే పడుకోవచ్చుకదా? " దగ్గరగా వస్తు అడిగాడు బాలాస్వామి.
  "అలాంటిది ఏంలేదు" చెప్పాడు భవానీ శంకర్.
 "మరి  ఒంట్లో శక్తిలేని వాడిగా నడుస్తూన్నావేం? " దగరగా వచ్చి  భవానీ శంకర్ భుజాల చుట్టురా చేయివేసి ముందుకునడుస్తూ అన్నాడు బాలాస్వామి.
  వెంటనే ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు  భవానీ శంకర్ కు. అందుకే చిన్నగా నవ్వి వూరుకున్నాడు.
  "ఏంట్రా  పిల్లగా! నవ్వుతావు? " భవానీ శంకర్ భుజాన్ని చరిచాడు బాలాస్వామి.
 "ఏడవమంటావా? " మనసులో అనుకున్నాడు  భవానీ శంకర్.
  ఇద్దరు హనుమాన్ వ్యమాయశాలకు సమీపంగా వెళ్ళారు. అది బాలాస్వామి నడిపిస్తున్నదే! అక్కడ ముస్లిలకు ప్రవేశంలేదు. దానికి ఎదురుగా 'ఇస్మాయిల్ బాడీ లాంగ్వేజ్ ' పేరుతో మరొక వ్యాయామశాలవుంది. సాయిబు ప్రోద్బలంతో ఇస్మాయిల్ అనే యువకుడు నడుపుతున్న వ్యాయామశాల అది.
  "ఆ   తుర్కనా కొడుకుల్ని చూశావా? సగం తుర్కపేరు, సగం ఇంగ్లీషు పేరు పెట్టుకున్నారు? " ఇస్మాయిల్ వ్యాయామశాలవైపు చూస్తూ వెక్కిరింతగా అన్నాడు బాలాస్వామి.
 "వాళ్ళ ఇష్టంలే అన్నా!  మనకు ఎందుకు? "  ఏదో  ఒకటి  అనాలనుకుని  అన్నాడు  భవానీ శంకర్.
 "అదేం  శంకర్?  ఆ  సున్తీనాకొడుకులకి సపోర్టు ఇస్తున్నావు? " వెంటనే అడిగాడు బాలాస్వామి.
 "లే  లేదన్నా " గాభరాగా అని బేకార్ నా కొడకా " మనసులో అనుకున్నాడు  భవానీ శంకర్.
 "అదీమాట " అన్నాడు బాలాస్వామి.
 "అవును  అన్నా...  ఒకమాట " భయపడ్తూనే అన్నాడు  భవానీ శంకర్.
 "ఒక్కమాట ఎందుకు? పది మాటలు అడుగు" అన్నాడు బాలాస్వామి.
  వెంటనే అడగలేకపోయాడు  భవానీ శంకర్. కాసేపు తడబడి, ఆ తర్వాత  కొద్దిగా ధ్యైర్యాన్ని తెచ్చుకుని, "ఆ... " అంటూ  ఏదో అడగబోయ, అంతలోనే విరమించుకుని, "ఏంలేదు"  అంటూ బాలాస్వామినుండి ముందుకు నడిచి వ్యాయామశాల లోపలికి వెళ్ళాడు భవానీ శంకర్.
   వెళ్తున్న భవానీ శంకర్ వైపు చిత్రంగా చూస్తూ "పోరేగాడు " తనలో తను అనుకున్నాడు బాలాస్వామి.
   అరగంట తర్వాత వ్యాయామం ముగించుకొని వ్యాయామశాల వెలుపలికి వచ్చాడు భవానీ శంకర్.
  అప్పుడు సమయం ఐదు గంటలు. సమీపంగా వున్న మసిడులోంచి "అల్లాహో అక్బర్..." అంటూ  నమాజు ఆరంభం అయ్యింది.
  నమాజు అలా మొదలయ్యిందో లేదో వ్యాయామశాల వెలుపలే వ్యాయామం  చేసుకుంటున్న బాలాస్వామి...  చేతిలోని  డంబుల్స్ కిందపడేసి  వడివడిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

అతడు వెళ్లిన కాసేపటి తర్వాత గుడి దగ్గర భక్తి గీతాలు ఆరంభమయ్యాయి.  మైకు లోంచి వినబడుతున్న భక్తిగీతాలు నమాజు స్వరప్రవాహానికి అడ్డుకట్టలా మారాయి.

" వీడికి కాలమే బుద్దిచెప్పాలి" బాలస్వామిని ఉద్దేశిస్తూ అన్నాడు ఒక పెద్దమనిషి. అతడు రోజూ వ్యాయామశాలకు వచ్చి యోగా చేస్తుంటాడు.

" అంకుల్..." పెద్ద మనిషికి దగ్గరగా వెళ్లాడు భవానీశంకర్

ఏంటన్నట్టుగా చూశాడు పెద్దమనిషి.

" మీతో ఒక్కమాట" అన్నాడు భవానీశంకర్.

" ఏంటీ?" అన్నాడు పెద్దమనిషి.

" హిందువులు, ముస్లీంలు, ఐక్యత లేకుండా ఉండటం మీకు బాధగా ఉన్నట్టుంది" నెమ్మదిగా అన్నాడు భవానీశంకర్.

" ఉన్నట్టుంది కాదు బాబూ ఉంది" అన్నాడు పెద్దమనిషి.

" మరి మీరు పెద్దవాళ్లు కదా, బాలస్వామితో ఈవిషయం గురించి మాట్లాడండి"

నవ్వాడు పెద్దమనిషి "  అభ్యుదయవాదిలా ఉన్నావే? " నవ్వుతూనే అన్నాడు.

ఆ మాటకు ఇబ్బందిగా కదిలాడు భవానీశంకర్.

" నీలాంటి కుర్రవాళ్లు ఈ సమాజానికి అవసరం. ఇలాగని ఆవేశం పనికిరాదు" అని కాసేపాగి " ఆ.. బాబూ! నీ పేరు శేఖర్ కదూ? "అడిగాడు పెద్దమనిషి.

" శంకర్. భవానీశంకర్" చెప్పాడు భవానీశంకర్.

" ఏం చదువుతున్నావు?" అడుగుతూ అక్కడ్నుంచి ముందుకు కదిలాడు అతడు.

" ఇంటర్ చదువుతున్నావు?" అడుగుతూ అక్కడ్నుంచి ముందుకు కదిలాడు అతడు.

" ఇంటర్ చదువుతున్నాను" వెంటే నడుస్తూ అసలు సంగతి చెప్పుకోలేకపోయాడు భవానీశంకర్.

" చదువుతున్నావు కాబట్టే నీకు ఇంగిత జ్ఞానం ఉంది. కానీ ఇటు బాలస్వామి, అటు సాయిబు, ఇద్దరూ చదువుకోలేదు. కాబట్టే అజ్ఞానులుగా వ్యవహరిస్తున్నారు. చదువుకున్నవాళ్లలో కూడా ఇలాంటి అజ్ఞానులు ఉన్నారు. కాని ప్రస్తుతం ఇక్కడ చదువుకోనివాళ్లే అజ్ఞానులు. వీళ్లను ఎవ్వరూ మార్చలేరు " అంటూ సిగరెట్టు వెలిగించుకున్నాడు అతడు.

వింటూ వెంటే నడుస్తున్నాడు భవానీశంకర్.

" నాది స్వతహాగా కర్నూలు బాబూ! మాది రాయలసీమ అయినా మా బంధువులు విజయవాడలోనూ, మహబూబ్ నగర్ లోనూ ఎక్కువగా ఉండేవాళ్లు. ఆ జిల్లాల్లో నాకు స్నేహితులు కూడా ఎక్కువే!

నా స్నేహితుల్లో ముస్లీంలు కూడా ఉన్నారు. వాళ్లు ఎంత చక్కగా తెలుగు మాట్లాడతారూ అనేది విశేషం కాదు. తెలుగు సాహిత్యాన్ని సైతం ఎంతగా అభిమానిస్తారు అనేదే ముఖ్యం. ఇప్పటికీ నాలో గానీ, వాళ్లలోగాని, హిందూ ముస్లీం తేడాల్లేవు. మా బంధువులు కూడా తమ చుట్టు పక్కల ముస్లీంలతో ఎంతో సఖ్యతగా మెలుగుతుంటారు.." చెప్పుకుపోయాడు అతడు.

" అట్లాంటి సఖ్యత ఇక్కడ ఉంటే ఎంత బావుండేదికదూ అంకుల్? " అన్నాడు భవానీశంకర్.

" ఇక్కడ కూడా ఉంది. కాని మన వీధికి సంబంధించిలేదు. అందుకే నాకు ఇక్కడ ఉండాలి అన్పించదు. కాని స్వంత ఇల్లు కట్టుకున్నాను. కాబట్టి తప్పడం లేదు..

" నేను పుట్టింది బ్రాహ్మణుల ఇంట్లో! మా కులంవాళ్లుకు చాదస్తం కొద్దిగా ఎక్కువే! ఈ చాదస్తం మా ఇంట్లో కూడా ఉండేది. అయితే నేను మాత్రం అందుకు పూర్తిగా విరోధిని.

నాకు కులం, మతం తేడాల్లేవు. అందరూ ఒక్కటే అనుకుంటాను. అనుకోవడం ఒక్కటే కాదు, నా భావాల్ని పదిమందితో పంచుకోవాలి అనుకున్నాను, అనుకుంటున్నాను. కాబట్టే ఇప్పుడు నీతో నా భావాల్ని చెప్పుకుంటున్నాను. మరి అంకుల్ నాతో సుత్తికొడుతున్నాడు అనుకోవుకదా?" భవానీశంకర్ వైపు చూశాడు అతడు.

" అట్లా ఏమీ అనుకోను అంకుల్! మీ భావాలు నాకు బాగా నచ్చాయి" అన్నాడు భవానీశంకర్.

అతడు ముందుకు చూస్తూ తన భావాల్ని గుండెలోతుల్లోంచి మాట్లాడుతూపోయాడు.

" నేను సాహిత్యాభిమానిని కూడా!" అప్పట్లో పత్రికలకు నా రచనలు పంపేవాడ్ని. నారచనలు అన్నీ సామాజిక మానవ సంబంధాల చుట్టూ తిరిగేవి" అని కాసేపాగి.

" ఇప్పుడు ఈ సాహిత్యం గురించి ఎందుకుగానీ, నీది చాలా చిన్నవయసు. నీ వయసులో ఉన్న పిల్లలు తమాషా మనస్తత్వాన్ని కలిగిఉంటారు. కానీ నువ్వు అలా ఉండకూడదు. నీ దృష్టి కేవలం చదువుపైనే ఉండాలి.

తాత్కాలిక ఆనందాన్ని అందించే విషయాల మీదకు దృష్టిని అస్సలు పోనీవద్దు. ప్రేమ, దోమా అంటూ నీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు.

నీకు బంగారు భవిష్యత్ ఉంది. ఆ భవిష్యత్ ను పాడుచేసుకోవడం, తీర్చిదిద్దుకోవడం.. రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి "

అతడి మాటలు భవానీశంకర్ గుండెల్లోకి సూటిగా గుచ్చుకున్నాయి. అందుకే ఇబ్బందిగా చేతులు నలపసాగాడు.

" బాబూ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఉంటున్నది మత విధ్వంసాల గుప్పిట్లో. ఏరోజు ఏం జరుగుతుందో తెలీకుండా రోజులు గడుపుతున్నాం. ఇల్లాంటి రోజులు రాక పూర్వం రాన్రానూ ఇక కులమతాలు సమసిపోతాయి అనుకున్నారు. కానీ అవి సమసిపోవడంలేదు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి"

"...."

" కనీసం మీరయినా మున్ముందు ఇక్కడ సఖ్యతను నెలకొల్పాలి? మేం వచ్చిన మొదట్లో ఇక్కడ సఖ్యత ఉండేది. హిందూ ముస్లింలు ఒక కుటుంబంలా మెలిగేవారు.

అయితే ఒక ముస్లిం అమ్మాయిని, ఒక హిందూ అబ్బాయి టీజ్ చేసిన విషయమై ఇక్కడ క్రమంగా గొడవలు మొదలయ్యాయి. ఇరవై ఐదేళ్ల క్రితం మొదలైన ఆ గొడవలకు కారకులు ఈ సాయిబు, బాలస్వాములే!