Facebook Twitter
ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం (కవిత)

ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం

 

యా దేవీ సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత
లోకమాతా! లవకుశులంటి వీర కొమరులెవరూ లేరిక్కడ
క్షమించాలి వీరత్వం లేకపోవటమేమిటీ కామంతో కళ్ళు బయర్లు కమ్మి, నీ మాతృరూపాన్ని కూడా గుర్తించని మెుగతనమంతా వీరత్వమేగా

యా దేవీ సర్వభూతేశు శాంతిరూపేణ సంస్థిత
ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగో నిన్ను పొగిడినపుడే గుర్తించాల్సింది

రాఘవప్రియా! ఆ ప్రియత్వం అంతా చేయని
అపరాధాన్ని మోస్తూ అగ్నికి నిన్ను నువ్వు అర్పించుకొని పునీత అని నాలుగు నోళ్ళలో నానితేనే బయటపడుతుందనీ, కర్కశత్వానికి భయపడి తల్లి ఒడిన దాగోకపోతే ఇంకెన్నాళ్ళో కదూ రామవల్లభా అని పిలుస్తూ నిరంతరం వధిస్తూ

విష్ణుపత్నీ! మరి సిరికిన్ చెప్పడే? సిడి ముడి తడబడినా, జారే పవిట ఆపటానికి అష్టకష్టాలు పడటం ముల్లోకాలు చూస్తున్నా, అది నీ పరువు తీయటం కాదనీ గజేంద్రమోక్షం అంటే లోకం చంకలు గుద్దుకొని ఆలకిస్తుందనీ

ద్రుపదరాధ్యా.. ధర్మరాజప్రియాయై.. అర్జునవిమోహనాయై.. భీమసేనమనూవల్లభాయై.. సవ్యశాచిశివశాయై .. నకులస్వాంతభూషణాయై వారి నామధేయములను ముందు తగిలించుకున్నా ఆ అయిదుగురు భర్తల ముందు విధవ అవుతుంటే గుడ్లప్పగించి చూసారే?యజ్ఞసంభూతా! పేరుకు తగిలించిన నీ పురుషపుంగవుల పేర్లు ఆనాడే నిన్ను నగ్నంగా చూస్తూ వెక్కిరించాయి కదా

స్త్రీ శక్తిస్వరూపిణి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ పొగడ్తలన్నీ నిన్ను తుంగలో తొక్కటానికే
యుగాలు మారినా ఈ పురుషాధిక్య సమాజంలో
స్త్రీ అంటే కార్యేషు దాసీ శయనేషు రంభ

 

...సరిత భూపతి