Facebook Twitter
“అజ్ఞాత కులశీలశ్య….” 5వ భాగం


“అజ్ఞాత కులశీలశ్య….” 5వ భాగం


“కళింగం”.. దేశంలోనూ, గృహంలోనూ కూడా అతి త్వరలోనే ఇమిడి పోయాడు మాధవుడు. నదీ జలాల పాయలు నేలనంతా సస్య శ్యామలం చేస్తున్నాయి. ఏటి ఒడ్డున కొబ్బరి చెట్లు, ఇళ్ల వెనుక అరటి తోటలు. అంబరాల్లా నీడనిచ్చే వృక్షాలు. అందులో ఫల వృక్షాలు ఎన్నెన్నో.. మాధవుడికి వంగదేశానికీ, కళింగ దేశానికీ పెద్ద వ్యత్యాసమేమీ కనిపించలేదు.
   ఇంటిలోని వారికి తలలో నాలుకలా, పూటకూళ్ల అతిధులకి ఆహ్లాదాన్ని పంచే చిన్ని కృష్ణునిలా కలిసిపోయాడు. ఒక్క క్షణం కనిపించకపోతే అందరి నోటా మాధవుని పేరే..
  
    సీ. తొలిపొద్దు రాకమున్ దోటలో కలకలం
               మాధవుఁ కదిలించి మత్తు తీర్చ;
        నిదురని వదిలించి నేరిమి చూపించ
                దినకృత్యములకేగి దీక్ష జూపు.
        లేలెమ్మనుచునమ్మ లేబుగ్గ నిమురగా
                గారాల బాలుండు గరిమ జూపె.
        అంతట యరుదెంచె నతడు, తండ్రియు కూడ,
                నట్టింట చెలరేగె నవ్వులెన్నొ.

 ఆ.వె. అలికిడి వినగానె నమ్మమ్మ సీతమ్మ
          మురిపె మంత జూపె ముదము తోను
          ఒక్క బుడుత డొచ్చి యూపెను యిల్లంత
          సంతసంబు నంత సరస మాడ.
 
   మాధవుని అశ్వం, కళ్యాణికి కూడా కటకం బాగా నచ్చింది. తన చిన్ని యజమాని బాధ్యత తనదే నన్నట్లు ప్రవర్తిస్తుంటుంది. అతడు ఆనందంగా ఉంటే.. అంతకన్న ఇంకేమి కావాలి?
   కళ్యాణిని బాడుగకి కూడా బాగానే తీసుకెళ్తున్నారు. గుర్రపు స్వారీ నేర్పించడానికి తప్ప, దూరా భారాలు పంపడం మాధవుని ఇష్టం లేదు. ఆ సంగతి గ్రహించిన నందుడు కూడా అర్ధం చేసుకుని, ఆ పనికే నియోగిస్తున్నాడు. పైగా ఆ ఆదాయం మీదనే ఆధార పడి లేరు కదా! అవసరమొస్తే మాధవుని ధనమే బోలెడుంది.
   వారానికి మూడు రోజులు, రోజంతా కళ్యాణిని తీసుకెళ్తారు రెండు క్రోసుల దూరంలో ఉన్న విద్యాలయం వారు. మొదట్లో మాధవుడు కూడా వెళ్లేవాడు. మధ్యాహ్నాలు, గుగ్గిళ్లు తినిపించడం, మాలిశ్ చెయ్యడం వంటి పనులు చేసి అలవాటు చేశాడు.
   మరీ వెంటపడుతుంటే నిఘా చేసినట్లుగా ఉంటుందని నందుడు, గుర్రంతో వెళ్లద్దని మాధవుడికి చెప్పాడు. ఆ మాటే కళ్యాణికి నాలుగు రోజులుగా చెప్పి.. తనతో వెళ్లడం మానేశాడు. అశ్వాలకి ఆకళింపు చేసుకునే శక్తి ఎక్కువే. ఏ మాత్రం ఎదురు తిరగకుండా వెళ్లి వస్తోంది.
   మిగిలిన రోజుల్లో, మాధవుడు ఐదారు ఘడియలపాటు, సవారీ చేసి వస్తున్నాడు. కోట చుట్టూ తిరగడం, దగ్గరలో నున్న అడవికి వెళ్లడం.. స్వారీ చేస్తూనే కత్తి తిప్పడం వంటివన్నీ సాధన చేస్తున్నాడు.
   యుద్ధ విద్యలు నేరుస్తూ ఉండక పోయినా. తను నేర్చుకున్నది మరచి పోకుండా ఉండాలని ఆ బాలుని ఆలోచన.
   కోట చుట్టూ తిరుగుతూ అనుకుంటాడు.. ఎప్పటికైనా లోపలి కెళ్తానా అని..
   ఏమో! ఎవరు చెప్ప గలరు? ఏం జరగబోతోందో!
                                     ……………..

 


               
                     
   మాధవుడు కళింగం వచ్చి నెల దాటింది.
   జన్మతః తనకున్న కుతూహలం కొద్దీ, కోట చుట్టూ తిరిగేటప్పుడు, లోపల జరిగేదేమైనా కనిపిస్తుందేమోనని గోడ సందుల దగ్గరొక క్షణం ఆగి చూస్తాడు.    రాజుగారి లాగా దుస్తులు ధరించిన ఒక ఆజాను బాహుడు రోజూ లోపలికి వెళ్లి రావడం చూస్తున్నాడు. అతని వెంట గుర్రాల మీదా, నడుస్తూ సైనికులు..
   అప్పుడప్పుడు నందుడు కూడా మాధవునితో స్వారీకి వెళ్తుంటాడు.
   “వారేనా రాజు గారు తండ్రీ?” ఒకరోజు అడిగాడు మాధవుడు, ప్రముఖంగా కనిపిస్తున్నఆ వ్యక్తిని చూపించి.
   “రాజుగారు కోటలో ఉంటారు. బైటెందుకు తిరుగుతారు? అతడు సామంత రాజులలో ముఖ్యుడు. పేరు కపిలేంద్ర దేవుడు. ప్రస్థుతం పరిపాలనంతా వారే చూస్తున్నారు. రాజు గారికి నమ్మకమైన సామంతులు.”
   “నిజమా! వారే మహారాజులనుకున్నా..” మామూలుగా అనేసి అటూ ఇటూ చూడ సాగాడు మాధవుడు.
   ఉలిక్కి పడ్డాడు నందుడు. బాలవాక్కు బ్రహ్మ వాక్కంటారు. ఆందోళనగా చూశాడు.. ఎవరైనా వింటే..
   కను చూపు మేర ఎవరూ లేరు.
   “నీకు ఈ రాచ విద్యలన్నీ బాగా అబ్బాయే?” మాట మార్చాడు.
   “అవును తండ్రీ. రాజుగారి అబ్బాయి కంటే నేనే బాగా స్వారీ, కత్తి తిప్పడం చేస్తా తెలుసా!” అంతలో అమ్మ వారింపు గుర్తుకొచ్చి, కళ్లు గట్టిగా మూసుకుని మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
   “ఎవరా రాజు గారు?”
   “వారు వంగ దేశ రాజు గారి వద్ద సామంతులు.” తనకి తెలిసిన అంత పా్రముఖ్యత లేని పేరు చెప్పాడు మాధవుడు.
   “ఈ విద్యలన్నీ సరే, రేపటి నుండీ, సూరి సోమయాజి గారి దగ్గరకు పంపుతున్నా నిన్ను. అక్షరాలు, మంత్రాలు, వీలైన భాషలు నేర్చుకోవాలి. బ్రాహ్మణ బాలునికి పాండిత్యం ప్రధానం.”
   “అలాగే నేర్చుకుంటాను నాన్నగారూ! సంస్కృతం, ఆంధ్రం, వంగ భాషలు అక్షరమాలలు, మాటలు, పదాలు రాయడం వచ్చు నాకు. ఓడ్రమే రాదు.”
    “ఫరవాలేదు. మూడు భాషలు చాలు. కళింగ, ఉత్కళాలలో ఓడ్రం సంభాషణ జరపగలుగుతే సరి పోతుంది.” నందుడికి ఆశ్చర్యమేసింది, మాధవుని ప్రతిభ చూస్తుంటే.
                                           ……………

   “అసలు మాధవుడు మీ కన్న కొడుకేనా?” సీతమ్మ ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు ముగ్గురూ. అందరూ పెరటి వాకిలిలో ఉన్నారు.
   సూర్యోదయం అయి నాలుగు ఘడియలయింది. మాధవుడు కళ్యాణికి ఆహారం తయారు చేస్తున్నాడు. తల ఎత్తి గౌతమిని చూశాడు. వంట పాత్రలు శుభ్రం చేస్తున్న గౌతమి మొహం పాలిపోయింది.
   అరటి మొక్కలకి, వాడిన నీళ్లు వెళ్లడానికని, కాలువలు చేస్తున్న నందుడు ఏదో అనబోయి ఆగిపోయాడు.. సీతమ్మ ప్రశ్నలోని అర్ధాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ..
   గౌతమి ఒకసారి మాధవుడిని పరకాయించి చూసింది.
   నిజమే..
   మాధవుడు తమ బిడ్డడి లాగ లేడు. ఆచ్ఛాదన లేని వక్షము, నీరెండలో పచ్చగా, నున్నగా మెరిసిపోతోంది. తీర్చి దిద్దిన నాసిక, విశాల నేత్రాలు, ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే పెదవులు.. నలకూబరుడు చిన్నతనాన ఈ విధంగానే ఉండే వాడేమో! ‘దిష్టి తగులగలదు..’ అని తనకు తనే వారించుకుని నందుడిని చూసింది.
   నందుడు కూడా అందగాడే.. నున్నని గుండు, ముడి వేసిన పిలక. పచ్చని పసిమి ఛాయ. ఆ శరీర ఛాయే ఇద్దరినీ తండ్రీ కొడుకులంటే నమ్మ బలుకుతుంది.
   అంతే.. కానీ… ఏమిటి తేడా?
   ఒక్కసారిగా సీతమ్మ ప్రశ్నకి కారణం అర్ధమయింది గౌతమికీ, నందుడికీ కూడా.             ఇంకా అయోమయంగానే చూస్తున్నాడు మాధవుడు...
   వారు ఏమని సమాధానం చెప్తారా అనుకుంటూ. ఇన్ని రోజులుగా రాని అనుమానం ఇప్పుడు.. తాను ఏమైనా అనుచితంగా ప్రవర్తించలేదు గద..
   ఒక్క సారిగా అమ్మ గుర్తుకొచ్చింది మాధవునికి. ఆపుకోలేని ఏడుపొచ్చేసింది. పరిస్థితుల పాబల్యం కానీ, ఆటలాడుకుంటూ అమ్మ ఒడిన నిదురించే వయసు..
   ఏం చెయ్యాలి?
   అమ్మ కావాలి.. ఎక్కడుంది?
   మమకారంతో తననే చూస్తున్న గౌతమి కనిపించింది.
        
   మ.   అటు చూస్తే మరి రక్కసుల్ వలెను తన్నాఘా తమున్చేయనే
           కటువున్ కంటకులందరూ తరుముతూ కారుణ్యమున్ జూపకన్
           ఎటుపో యేవని క్రోధమున్ వదలకా యీ బాలునిం రూపు బా
           పుటకే వేచియు నుండ నమ్మకడకే పోవంగ దుఃఖింపనున్.

పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమె ఒడిలో దూరి భోరుమన్నాడు. ఆ మట్టి నేల మీదే, తడి చీరతోనే, హత్తుకుని తల నిమురుతూ ఉండి పోయింది గౌతమి, మాధవుని గిరజాల జుట్టులో వేళ్లు జొనిపి నిమురుతూ.
   అవును.. మాధవుడు వచ్చిన నాటినుండీ వానికి పరిసరాలనీ, ఊరిలోని పరిచయస్థులనీ, బంధువులనీ చూపడం,  పూటకూటింటికి వలసిన సంభారాలన్నీ సమకూర్చుకోవడంలోనూ కాలం వేగంగా గడిచి పోయింది.
   కొన్ని సున్నితమైన అంశములను పట్టించుకోలేదు. ముఖ్యంగా మాధవుని కేశములు..
   భుజాలు దాటి, ఉంగరాలు తిరిగిన దట్టమైన శిరోజములు, పాల భాగాన్ని సగం పైగా కప్పుతున్న ముంగురులు.. మాధవుడు క్షత్రియ బిడ్డడేమో అనే సందేహము కలుగక మానదు చూసిన వారికి.
   వెక్కుతూనే నిద్రలోకి జారుకున్నాడు మాధవుడు. నందుడు వచ్చి పిల్లవాడిని భుజం మీదికి వేసుకుని తడిసి పోయిన పంచని అలాగే విప్పి సావడిలోనికి తీసుకెళ్లి చాప మీద పడుక్కో బెట్టాడు. గౌతమి వచ్చి, పొడి వస్త్రం కట్టి కంబళీని కప్పింది.
   సీతమ్మ కొద్దిగా బెదురుతూ లోపలికి వచ్చింది..
   “ఇలా అవుతుందనుకో లేదు నందా! మీకు ఏదో చెప్పాలని, ఉపోద్ఘాతంగా అన్నాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఏమనుకోకండి. కావాలని చెయ్యలేదీ పని.”
   “ఫరవాలేదు సీతమ్మగారూ. మాధవుడు అసలే నాన్నమ్మ మీద బెంగ పెట్టు కున్నాడు. ఇంతకాలం అక్కడే ఉన్నాడు కదా! మీరలా అడగడం వలన ఆవిడ జ్ఞప్తికి వచ్చింది. అందుకే అమ్మ ఒడిలోకి పరుగెత్తాడు.” నందుని మాటలకి తలూపింది సీతమ్మ, అర్ధం చేసుకున్నట్లుగా.
   “ఇంతకీ మీరు ఏదో చెప్పాలని అన్నారు, ఏమిటదీ” గౌతమి అడిగింది.
   సీతమ్మ మొహమాటంగా చూసింది.
   “చెప్పండమ్మా! ఏమనుకోము.”
   “ఏం లేదు, మాధవునికి ఉపనయనం చెయ్యాలి కదా అని. పదేళ్లు నిండాయన్నారు.. అందుకని. బోసిగా ఉన్న వాని వక్షం చూడగానే అనిపించింది.. ఆ విషయం మరచారని ఆ విధంగా మాట్లాడాను.” సీతమ్మ మొహమాటంగా అంది.
   నంద, గౌతమిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
   నిజమే.. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చెయ్యాలి కదా! చెయ్యకపోతే సీతమ్మలాగే అందరూ అనుకునే ప్రమాదం ఉంది. ఈ మాసంలోనే..
   “అలాగే సీతమ్మా! రేపే పురోహితుల వారిని కలుస్తాను. అమ్మనీ, తమ్ముడినీ కూడా రప్పించుకోవాలి. పనిలో పని, మా జగన్నాధుడికి మంచి పిల్ల ఎక్కడైనా ఉందేమో చూడు. వీని ఒడుగూ, వాని పెళ్లీ కలిపి చేసేద్దాము.” నందుని మాట వింటూనే సీతమ్మ మొహం ఆనందంతో విప్పారింది.
   తనమాటకి విలువ ఇచ్చారు.. యజమాని అనే భావమే కలగనియ్యరు ఎన్నడూ. వీరి అండ దొరకుట నిజంగా తన అదృష్టమే.
   “అదెంత పని. నీటి కోసం ఏటికి పోయినప్పుడొక మాట వేశానంటే రేపే మన ఇంటికి వస్తారు కన్యాదాతలు.” సీతమ్మ ఉత్సాహంగా బైటికి వెళ్లింది, బిందె పట్టుకుని.
                                    ……………………

 

......మంథా భానుమతి



“అజ్ఞాత కులశీలశ్య….” 4వ భాగం