Facebook Twitter
“అజ్ఞాత కులశీలశ్య….” 4వ భాగం

                                        

“అజ్ఞాత కులశీలశ్య….” 4వ భాగం


   “గుర్రాన్నేమి చేద్దామమ్మా?” నంద మహాపాత్రుడు అడిగాడు, నూతిలోనుంచి నీళ్లు, తొట్టిలోకి  తోడుతూ. నందుడు, అతని భార్య గౌతమి, బాలవ్వ దగ్గరకు వచ్చి రెండు రోజులయింది.
   తొట్టిలో నీళ్లని కూర గాయల మళ్లలోకి పోస్తున్నాడు మాధవుడు. గత మూడు నెలలుగా బాలవ్వ పూటకూళ్ల ఇల్లు నడపడంలో మెళకువలు నేర్పిస్తోంది ఆతడికి.
   మొదటిదీ, ముఖ్యమైనదీ పెరటి తోట పెంచడం. ఏ రోజుకారోజు తాజాగా తోటలోనుంచి తెంపిన కూరలు వాడటం వల్లనే, బాటసారులే కాక, పల్లెలో వారుకూడా బాలవ్వ భోజనం చెయ్యడానికి వస్తుంటారు వారికి అవసరమైనప్పుడు.
   స్వతహాగా చురుకైన మాధవుడు అన్ని పనులనూ త్వరితగతిని నేర్చేసుకున్నాడు.
   అత్యవసరమైతే అత్తెసరు వేసి, చారు పెట్టి, అరటికాయ వేపుడు కూడా చెయ్యగలడు. ఏ పని చెయ్యాలన్నా నిస్సంకోచంగా చేసేస్తాడు.
   నందుడు,  గౌతమి కూడా మాధవుడినీ అతని కలుపుగోలు తనాన్నీ మెచ్చుకుని, పెంచుకుందుకు సంతోషంగా వప్పుకున్నారు. 
   బాలవ్వ హాయిగా నిట్టూర్చింది. ‘క్రిందటి జన్మలో వీడు నిజంగానే నా మనవడై ఉంటాడు’ అనుకుంది. రోజూ తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూనే ఉంది.
   పూటకూళ్ల ఇల్లన్నాక రకరకాల మనుషులు వస్తుంటారు. అందరితో నేర్పుగా మసలుకోవాలి. ఎన్నెన్నో వదంతులు.. ఒక్కోసారి ఎవరికీ చెప్పకూడని నిజాలు కూడా చెవుల బడుతుంటాయి.
   ఏదీ పట్టించుకోకుండా, అందరినీ సమ దృష్టితో చూడాలి.
   అవన్నీ మాధవునికి సమస్య కానే కాదు. రాజాంతఃపురంలో అలవాటే. అక్కడైతే మరీ కష్టం. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియదు. సరిహద్దు దేశాల గూఢచారులు కూడా తిరుగుతుంటారు. అందులో.. హిందువైతే ఒకరకంగా, ముసల్మానైతే మరొకరకంగా ఉంటుంది వ్యవహారం.
   బాలుడిని  సాగనంపడానికి వ్యాకుల పడుతున్న బాలవ్వతో అదే అన్నాడు వయసుకి మించిన అనుభవాలను ఎదుర్కొన్న మాధవుడు.

  ఉ.మా||  “అందరి తోడనే కలసి యండగ నుండమ నంటు నే సదా
               కొందరి మాటనే పనుచు కొందును నొవ్వను గాద నేన్నడున్
               పందను గాదునే నెపుడు పంకము లో కడకాలువే యగా 
               కొందల మేలనో వలదు కొంచెము యూరడి లమ్మ హాయిగన్.

   మాధవుని పద్యాన్ని గుర్తు చేసుకుంటూ, వాడి ముందు చూపుకి, సమయస్ఫూర్తికి మురిసిపోతున్న బాలవ్వ కడుగుతున్న వంటపాత్రలను పక్కన పెట్టి ఆలోచనలో పడింది..
   “అవ్వా! గుర్రాన్ని నాతో తీసుకెళ్ల వచ్చా?” మాధవుని ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు నందుడు, గౌతమి.
   తీసుకెళ్లడానికే ఇబ్బందీ లేదు. ఇంకా ఒక గుర్రాన్ని తగ్గిస్తే ప్రయాణపు వ్యయం తగ్గుతుంది కూడా. కానీ.. తీసుకెళ్లాక బాలుడు గుర్రాన్ని అమ్మడానికి వప్పుకోకపోతే? కటకంలో వారు చేసే పనికి హయం అవసరం లేదు. పోషించడానికి తగిన ధనం వారు సమకూర్చుకోలేరు.
   కానీ, మాధవుడు లేకున్న అశ్వం ఏ విధంగా ఉంటుందో అనుమానమే. వారిరువురికీ ఉన్న భంధం అటువంటిది.
   “అలాగే తీసుకెళ్లు కన్నయ్యా!”
   మాధవుడు ఆనందంతో ఎగురుకుంటూ వెళ్లాడు గుర్రానికి దాణా వెయ్యడానికీ, తన నేస్తానికీ శుభవార్త చెప్పడానికీ.
   “అశ్వాన్ని పోషించగల శక్తి మనకి లేదమ్మా. యుద్ధ భయాలతో కటకం కూడా అట్టుడికి పోతోంది. వచ్చిన ఆదాయం బొటాబొటీగా సరిపోతోంది. ఇప్పుడు బాలుని కూడా పోషించాలి. వానికి చదువు సంధ్యలు నేర్పించాలి. మా అబ్బాయని చెప్తాము కనుక పనివానిలా చూడలేము. మాధవుని చూస్తే విధివశాన వీధిన పడిన రాకుమారుని వలె ఉన్నాడు” నందుడు ఆందోళనగా అన్నాడు.
   బాలవ్వ చిరునవ్వు నవ్వింది.
   “వ్యయం గురించిన చింత వద్దు నందా. రాకుమారుడన్నావు కదా.. మరి సంపద ఉండదా? బాలుడు యుక్తవయస్కుడయ్యే వరకూ సరిపోయే టన్ని నాణాలున్నాయి వాని వద్ద. అందులోనూ సువర్ణ నాణాలెక్కువ. వాటి విలువ ఎంతో కూడా తెలియని అమాయకుడు మాధవుడు. అతడికి, అశ్వానికీ కూడ పోషణకి సరిపోతాయి. మీకు కూడనూ సౌలభ్యంగా ఉంటుంది.”
   తల్లిని సాలోచనగా చూశాడు నందుడు.
   “ఇంకేమి సందేహము? మాధవుడు చాలా అణకువగల పిల్లడు. ఇంత చిన్న వయసులో అంతటి అవగాహన ఉండటము అరుదు. ఏ బెంగా లేకుండా హాయిగా వెళ్లి రండి. అప్పుడప్పుడు జగన్నాధుని పంపుతుంటాను.”
   “నా ఆదాయం అశ్వాన్ని కొని, పోషించగల స్థాయిలో లేదు కదా మరి ఏ విధంగా చుట్టుప్రక్కల వారికి సమాధానము చెప్పగలను? వారి అసూయా దృక్కులను ఎదుర్కొనేదెలా?”
   అదీ నిజమే.. బాలవ్వకి ఏమనాలో పాలుపోలేదు.
   “అవ్వా, నేనొక ఆలోచన చెప్పనా?” అప్పుడే అక్కడికి వచ్చిన మాధవుడు సంకోచంగా అడిగాడు.
   తలూపింది బాలవ్వ.
   “గుర్రాన్ని మీరు మాకిచ్చారని చెప్దాము. నన్ను కూడా అక్కడి వారెవరూ చూడ లేదు కదా? నా తోడని చెప్పవచ్చును. ఇంక దాని పోషణకి.. అక్కడక్కడే బాడుగకి ఇవ్వ వచ్చును కదా? నేను చెప్తే నా కళ్యాణి వింటుంది. మరీ దూరం కాకుండా, ఒకటి రెండు దినాల్లో వచ్చేలాగున..” ఆశగా నందుని కేసి చూశాడు మాధవుడు.
   నిజమే.. గుర్రాలను బాడుగకి తీసుకుంటారు. అందరూ కొన లేరు కదా! నందునికి బాలుని సూచన నచ్చింది. పైగా పట్టణం కనుక అద్దె కూడా ఎక్కువే కటకంలో.
   “ఇంక రెండు దినములలోనే మన ప్రయాణం. అన్నీ సర్దుకో మాధవా.” నందుడు అనుమతి ఇచ్చినట్లు తలూపి అన్నాడు.
   అవ్వని వదిలి వెళ్లడం బాధ గానే ఉన్నా మాధవుడికి కటకం వెళ్లక తప్పదు. అది అమ్మ కోరిక. వంగ రాజ్యానికి వీలైనంత దూరంగా వెళ్లాలని దుర్గాదేవి ఆశించింది. ఆ విధంగానే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు మాధవుడు.

                                                  2
                                          మలి జీవనం

   “ఒక్కనివీ రాగలవా మాధవా? మీ అమ్మ నేను లేకుండా గుర్రం మీద కూర్చొనుటకు భయపడుతుంది.”
   మాధవుడు తలూపాడు మౌనంగా, రెండు కారణాలతో.. ‘మీ అమ్మ’ అని నందుడు అనగానే అమ్మ కన్నుల ముందు మెదిలి దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. అనుకోకుండా ఇంకొక అమ్మ, ఇంత త్వరలో దొరికినందుకు ఆనందోద్వేగాలతో కూడా మాట రాలేదు.
   ఆ పసివాని కన్నులలో నీటి పొర చూడగానే అసంకల్పితంగా గౌతమికి మాతృ భావన ఉప్పొంగింది. స్త్రీకి సహజ లక్షణం కదా అది! దగ్గరగా వెళ్లి అదుముకుని తల మీద ఆప్యాయంగా రెండు చేతులతో నిమిరింది.
   ఆ దృశ్యం చూస్తున్న బాలవ్వ నిశ్చింతగా నిట్టూర్చింది, బాలకృష్ణుడిని నందుడి ఇంటికి చేర్చిన వసుదేవుని లాగ.. కొద్ది మాసములలోనే మాధవుని మీద ఎంతో వాత్సల్యాన్ని పెంచుకున్న బాలవ్వకి, తీసుకెళ్తున్నది తన కొడుకే ఐనా తన శరీరంలోని ఒక భాగం వెళ్లిపోతున్నట్లే అనిపించింది. అదే... విశ్వప్రేమ నిర్వచనం.
   కళ్లు తెరవని పసిగుడ్డును ఎచటికో.. ఎరుగని చోటికి తీసుకెళ్తుంటే దేవకీదేవి మనసు ఎంత క్షోభించి ఉండాలి! బాలవ్వ కన్ను ముందు పచ్చి బాలింత నిలిచింది, కళ్ల నిండా నీళ్లతో..

      కం.  కన్నులు తెరవని పాపడు
             కన్నయని వదల మనమును గట్టి పరచియున్
             దన్నుల నిస్త్రాణమునను
             వెన్నుని మీదనె బరువును వేసెను కలతన్||

   తెలిసీ తెలియని వయసులో తనయుడిని ఒంటరిగా దూరతీరాలకు పంపవలసి వచ్చినప్పుడు మాధవుని కన్న తల్లి ఎంత క్షోభ పడి ఉంటుందో! కళ్లు తుడుచుకుంటూ, కను చూపు మేర వరకూ, సాగిపోతున్న గుర్రాలని చూసి ఇంట్లోకి వెనుతిరిగింది బాలవ్వ.
                                      …………………

   నంద, గౌతమిల అశ్వం వేగంగా వెళ్లలేకపోతోంది. అక్కడికీ, బాలవ్వ ఇచ్చిన తినుబండారాలు, కొద్ది సంభారాలు మాధవుడి కళ్యాణికే కట్టేశారు. మాధవునికి కళ్యాణి కళ్లెం పట్టుకుని లాగి కూర్చోవడం కష్టమనిపిస్తోంది. పది ఘడియల ప్రయాణం పిదప కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది రౌతులకి, గుర్రాలకీ కూడా.
   చెట్టు నీడన ఆగి, గుర్రాలకి మేత తినిపించి, వానిని రుద్ది, తోమి.. వాటితో మాటలాడి తాము కూడ తెచ్చుకున్నది తిని విశ్రాంతిగా చెట్టు నానుకుని కూర్చున్నారు.
   మాధవుడు, గౌతమి పక్కన చేరి కాళ్లు వత్త సాగాడు.
   “ఇదేం పని కన్నయ్యా?” ఒక వంక మురిసిపోతూనే అంది గౌతమి.
   “అశ్వారూఢ యైన అమ్మకు అలసట తీరే వరకూ కాళ్ళు పట్టడం నాకు అలవాటే కదా! ఇంకా చాలా దూరం పయనం సాగించాలి మనం.” మాట్లాడుతూనే గౌతమి ఒడిలో నిద్ర పోయాడు మాధవుడు.
   “ఫరవాలేదు. ఎవరికీ అనుమానం రాదు. మాధవుడు మన బిడ్డే అనుకుంటారు అందరూ. మనసులో నుండీ ప్రేమ వస్తేనే ఈ విధంగా ప్రవర్తిస్తాము. లేకున్న తెచ్చిపెట్టుకున్నట్లే ఉంటుంది.” తృప్తిగా అంది గౌతమి.
   ఒక ఘడియ విశ్రాంతి తరువాత జరిగిన ప్రయాణం వేగంగా జరిగింది.
   కళ్యాణి మీద మాధవునితో పాటు గౌతమి కూర్చుంది. నందుడి గుర్రం మీదికి కొద్ది సామాన్లను చేర్చారు. బరువు సమానంగా సర్దటం వలన సులువయింది అశ్వాలకి.
   సూర్యాస్తమానం లోగా అనుకున్న గ్రామానికి చేరుకో గలిగారు.
   రాత్రికి అక్కడి పూటకూళ్ల ఇంటిలో బస చేస్తున్నప్పుడు మొదలయింది పరీక్ష, అందరికీ. అచ్చటి వారికి నంద, గౌతమిలు పరిచయమైన వారే..
   “ఈ బాలుడు మీ అబ్బాయా? మరి ఇంతకాలం వదిలి ఏ విధంగా ఉన్నారు?” ప్రశ్నల పరంపర..
   అడిగిన వారందరికీ తృప్తి కలిగేటట్లు సమాధానాలు చెప్పి హాయిగా నిట్టూర్చారు ముగ్గురూ. పైగా వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న శ్రద్ధ అనుమానాలకి తావీయలేదు.
                                       ………………….
   రెండు రాత్రుల మజలీల తరువాత కటకం పరిసరాల్లోకి ప్రవేశించింది మహపాత్రుల కుటుంబం. క్రోసు దూరమునుండే బారాబతీ కోట గోడలు గోచరమయ్యాయి. మాధవుని కన్నులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి. ముందుకు వంగి కళ్లెం పుచ్చుకున్నవాడు, నిటారుగా అయి అటూ ఇటూ కదిలాడు. వెనుకగా కూర్చున్న గౌతమి ఉలిక్కి పడింది.
   “ఏమాయె మాధవా?” ఆతృతగా ప్రశ్నించింది.
   తలపైకెత్తి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూపించాడు. కొద్ది దిగువ నుంచి వెళ్తున్నారేమో, ఎత్తుగా చిత్రాకారుడు శ్రద్ధతో గీసిన త్రిమితీయ చిత్రంలా కనిపిస్తోంది. సూర్యాస్తమయానికి ఆకాశం సిద్ధమౌతోంది.
   రెండు పాయలుగా విడి పోయిన మహానదీ ప్రవాహం మందంగా సాగుతోంది.  పచ్చని చెట్లకి రంగు రంగుల పువ్వులు. ఫల వృక్షాలకి వేళ్లాడుతున్న కాయలు పళ్లు.  వీటి మధ్య ఠీవిగా నిలుచున్న కోట, మాధవునికి స్వాగతం పలుకుతోంది.
   గౌతమికి అందులో వింతేమీ కానరాలేదు. ఎప్పుడూ చూసేదే.. బాలుడు ఎప్పుడూ కోటని చూసినట్లు లేదు, అందుకే సంభ్రమంగా చూస్తున్నాడనుకుంది.
   “అది రాజుగారి కోట. కళింగ దేశాన్నేలే గాంగేయ రాజు, నాల్గవ భానుదేవుడు అందులో ఉంటాడు. రాజుగారి కోట ఎప్పుడూ చూడలేదా? ఈ సారి ఎవరైనా వంటవాళ్లు సంభారాలు తీసుకెళ్లేటప్పుడు నిన్ను తీసుకెళ్లమని చెప్తాలే..” గౌతమి మాటలకి నవ్వుకున్నాడు అటువంటి కోటలోనే పుట్టి పెరిగిన మాధవుడు.

   ఉ.     కోటకి కాపలా వలెను కూకటి యైన నదీమ తల్లియే
           దీటుగ హారమై నిలిచి తీరుగ కన్నుల విందు సేయగా
           మాటయె రాని మాధవుడు మానుల రంగుల పూల కాంచుచున్
           మేటి కుమారుడై కదలి మీరము దాటెను ధీ పటుత్వమున్.

   పుట్టినదాదిగా అనుక్షణం భయాందోళనల అంతరాళం లోనే అందిన విద్యలు నేర్చుకుంటూ పెరిగిన మాధవునికి, స్వత సిద్ధంగా ప్రకృతిని ఆస్వాదించే ప్రకృతిని ప్రసాదించాడు ఆ పరమాత్మ.
   కత్తి యుద్దంలో, గుర్రపు స్వారీలో, విలు విద్యలో తన వయసుకి మించి రాణిస్తున్నాడు. . అంతే కాదు, తన భావాలని మాటల్లో వ్యక్తీకరించే నేర్పు, పరిసరాలలో నిశ్శబ్దంగా నీటిలా కలిసిపోయే స్వభావం.. బాలుని ఇతర ప్రతిభలకి, సువర్ణానికి సువాసన అబ్బినట్లు అమరింది.
   తెర చాటునుంచి గమనించిన హత్యలు, బలాత్కారాలు.. ఏ పరిస్థితులలో నైనా మొండిగా జీవనం సాగించగలిగే ధైర్యాన్నిచ్చాయి. అయితే, చూడ్డానికి మాత్రం, అమాయకంగా అప్పుడే ప్రపంచాన్ని గమనిస్తున్న పసిబాలుడిలాగే ఉంటాడు.
   ప్రతీ విషయాన్నీ కుతూహలంగా, ఉత్సాహంగా పరిశీలించే విశాల నేత్రాలు అదనపు ఆకర్షణ, సుందరమైన ఆ మోముకి. అందుకే చూడగానే మారు ప్రశ్న వేయకుండా ఒప్పేసుకున్నారు నందుడు, గౌతమీ,
మాధవుడిని పెంచుకోవడానికి,!


  
     

 సంజకెంజాయ వెలుగులలో, మహానది ఒడ్డుకు దగ్గరగానున్న పట్టణంలోకి ప్రవేశించగానే కనిపించే “కళింగం” పూటకూళ్ల ఇంటి ప్రాంగణం లోనికి ప్రవేశించారు నందుని పరివారం.
   లోపల అంకణం విశాలంగా ఉన్నా, ఇల్లు చిన్నదే. ముందున్న పెద్ద వసారా అన్ని పనులకీ ఆసరా అవుతోంది. అక్కడే పది మంది వరకూ విశాలంగా కూర్చుని భోజనాలు చెయ్యడానికి అనుకూలంగా ఉంది.
   “క్షేమంగా వెళ్లి వచ్చారా తల్లీ! చీకట్లు కమ్ము కుంటున్నాయని కొంచెం ఆందోళన పడుతున్నాను. రండి.. స్నానాలు చేసి వచ్చారంటే వేడివేడిగా కుడుములు తినచ్చు.” కొద్ది బొంగురు గొంతుతో యాభై ఏళ్లు దాటిన స్త్రీ ఒకామె ఎదురొచ్చి ఆత్మీయంగా పలుకరించింది.
   “అంతా బాగేనా సీతమ్మా?” గుర్రం మీదినుంచి తాను దిగి, గౌతమీ, మాధవులకు చెయ్యందిస్తూ అడిగాడు నందుడు.
   నుదుట మెరిసి పోతున్న రాగి నాణమంత కుకుమ బొట్టుతో, కళ్లలో కరుణను, చిరునవ్వులో ఆప్యాయతను కురిపిస్తున్న సీతమ్మని అబ్బురంగా చూశాడు మాధవుడు.
   “ఈవిడ నీకు అమ్మమ్మ మాధవా! మన దగ్గరే ఉండి బాగోగులను చూసే దేవుడిచ్చిన తల్లి. వీడు మా అబ్బాయి సీతమ్మా. అమ్మ దగ్గరున్నాడు ఇన్ని నాళ్లూ. ఇంక మా దగ్గరకి తీసుకొచ్చి విద్యలన్నీ నేర్పిద్దామనుకున్నాము.” గుర్రాలకి కట్టిన వస్త్రాలనీ, వస్త్రాలలో కట్టి ఉంచిన కొన్ని సంభారాలనీ ఇంట్లోకి చేరుస్తూ అన్నాడు నందుడు.
    క్షణంలో సగంసేపు ముడిచిన కనుబొమ్మల్ని విడదీసి, అభావంగా లోనికి నడిచింది సీతమ్మ, ఆహారం ఏర్పాటు చెయ్యడానికి. ఇంతకాలం ఈ కుమారుని గూర్చి ఒక్క మాటైన అనలేదే అనే సందేహాన్ని మనసులోనే అదిమింది. అనవసరమైన విషయాలలో తల దూర్చడం ఆవిడ స్వభావం కాదు.
   నిజంగానే సీతమ్మ, మహాపాత్రుల గృహానికి భగవంతుడు పంపిన బహుమానమే.. అస్తవ్యస్తమైన ఆవిడ జీవితానికి కూడా రక్షణ దొరికింది. పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే, యుద్ధానికి బయలుదేరిన రాజుగారి సైన్యంతో, వారికి వంటవార్పులకి వెళ్లిన మొగుడు తిరిగి రాలేదు. శత్రురాజులకి పట్టుబడి, వారితో వెళ్లిపోయాడనే వార్త వచ్చింది. భర్త ఆనుపానులు తెలియని వారు సుమంగళులే.
   రంగురంగుల చీరలు పొందిగ్గా రోజూ కట్టి, నున్నగా దువ్వి వేసిన ముచ్చల ముడిలో తెల్లని పూదండ దురిమి, ప్రేమతో ఇంటివారిని చూసుకుంటూ.. బాటసారులకి ఆప్యాయత రంగరించి, అన్నపూర్ణాదేవిలా  భోజనం వడ్డించే సీతమ్మ, ఎంత పుణ్యం చేసుకుంటే లభ్యమౌతుంది! ఆవిడ అండ చూసుకునే ఆరు మాసాలకొక్కసారి ఉత్కళం వెళ్లి అమ్మని చూసి వస్తుంటాడు నందుడు, సతీ సమేతంగా. వారు లేరన్న లోటు తెలియకుండా పూటకూళ్ల గృహాన్ని నడిపిస్తుంది సీతమ్మ.
                                     ………………………..

 

 

......మంథా భానుమతి