Facebook Twitter
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె'


- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

 

తలుపుల్లేని హృది గదికి

వలపుల తలుపులే నివాసం!

బంధాల్లేవి జీవితానికి

బర్లాతెరిచిన ఆకాశమే ఆవాసం!!

 

బ్రతుకంతా భారంగా ... భయంగా..

అదేమిటో మరి-

ఆమె కౌగిలిలో

అలెగ్జాండర్ చక్రవర్తినౌతాను!

 

వైకుంఠ ద్వారాలు తెరిచేందుకు

ఎక్కడికీ వెళ్లనఖ్ఖరలేదు

ఆమె చుంబనంతో

అతిలోక ద్వారాల్లా

బార్లా తెరుచుకుంటాయి!

 

సుడిగాలిలా ప్రవేశిస్తావు

చిరుగాలిలా వెళ్ళిపోతావు.

మిగిలిపోతాను శూన్య హృదయంగా...

చెల్లాచెదురయిన పూదోటగా!!

 

అమృతం అంగడి దిగకముందే

హాలహలం చేసేస్తాడు!

అందుకే దేవుణ్ణి శపిస్తున్నాను-

మానవ జన్మ ఎత్తమని.

ప్రేమికుడిగా బతికి చూడమని!!

 

వచ్చే పాదాలూ

పోయే పాదాలూ

జీవితం

భళ్ళున తెల్లవారింది!

ఆమెతో అడుగుకలిపి నడుస్తాను

మానవారణ్యపు దారుల్లో-

అమెరికాను కనుగొన్నకొలంబస్ లా!

ఖగోళ రహస్యాల్ని చూసిన గెలీలియోలా!!

త్యాగాలు చేయిస్తావు,

ఛాలెంజ్ లు విసురుతావు

 

నొప్పుకుంటున్నా.....

ప్రేమభిక్షకు హృదయం జోలెపట్టిన

పిరికివాణ్ణేనంటున్నా!

కళ్ళజోడు ధరించాను.

కన్నీళ్ళను దాచుకుందామని-

నీ చేతిలో స్పృశించావు

ఆనంద భాష్పాలయ్యాయవి!

ప్రేమికులారా వినండి...

ప్రేమ సామ్రాజ్యాన్ని జయించాలంటే

కత్తులు దూసి లాభం లేదు-

హృదయార్పణకి సిద్ధం కండి.

 

వాళ్ళంతా గొప్పవాళ్ళు

ఖరీదైన ప్రేమతో నేన్నుసేవిస్తారు....

ఏ గొప్పాలేని వాణ్ణి...

మట్టివాసనల్తో నీ ముంగిలిలో నిలబడతాను.!

నీ ప్రేమను నీకివ్వకపోయినా

నా దుఃఖాన్ని నాకిచ్చేశావు!

ఎన్ని జన్మలెత్తి

నీ రుణం తీర్చుకోగలను?!

గుండెను కాగితం మీద అద్ది

దుఃఖం బరువును తగ్గించవా?

అక్షర ప్రాయోపవేశంలో

అనంతదుఃఖాన్ని కప్పుకోగలవా??

 

సశేషం