Facebook Twitter
చందమామ రావే (కవిత)

 

// చందమామ రావే //



ఏం చెప్పను?
ఏమీలేదు అనటం వెనక ఎంతుందో
అంతుంది నీ గురించి చెప్పటానికి
అమ్మ అబద్ధం కూడా ఎంత తీయగా ఉంటుందో
గోరుముద్దల లాలిత్యానికి మురుస్తున్నపుడు
నాపై జెలసీతో ఆ అబద్ధం నిజం చేద్దామన్నట్టుగా
అమ్మ కళ్ళలో మెరిసిన నీ వెన్నెలను చూడటం ఆనాడు ఒక అద్భుతమే నాకు.

కొండెక్కి రావే గోగుపూలు తేవే పాటల్లో
నిజంగానే కొండలన్నీ ఎక్కినట్టు వచ్చే మిత్రుని కోసం చూస్తూ
గోగుపూలంటి నక్షత్రాల్లో పరవశిస్తూ
మేఘాల్లో దాగుడుమూతలాడుతుంటే
నీతోపాటు పరిగెత్తటం ఎంత అందమైన జ్ఞాపకమో.
అమావాస్య తరువాత నువ్వు కనిపించినపుడు
"అన్నం తినకపోతే నిన్ను బూచాడు పట్టుకెళ్ళాడు చూసావా?" అని నీతో మాట్లాడిన ఆ అమాయకత్వపు గర్వం మాటలు నిన్ను చూసినప్పుడల్లా చెవిలో మారుమ్రోగుతుంటే
అమ్మ జోలపాట విన్నంత హాయి

వెన్నెల అంటేనే ఓ అందమైన అనుభూతి
ఎన్నెన్ని మధురస్మృతులో నీతో
ఈ యాంత్రిక జీవనంలో నిన్ను చూడకుండా ఎన్నిరాత్రులు గడుస్తున్నాయో తెలుస్తూనే ఉంది అందుకే ఓసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్దాం
చందమామ రావే ! జాబిల్లి రావే !!

 

....... సరిత భూపతి