Facebook Twitter
ఒక దీపం వెలిగించు (దీపావళి స్పెషల్)

 

ఒక దీపం వెలిగించు
 


 దీపం వెలిగించు –ఒక
దీపం వెలిగించు!
ఎదనే ప్రమిదగ చేసీ
మమతల తైలము  పోసీ 
శాంతి అహింసల వత్తుల వేసీ 
దీపం వెలిగించు – ఒక
దీపం వెలిగించు !
 
నాదం పలికించు- ఒక
నాదం పలికించు !
తనువును మురళిగ చేసీ
శ్వాసను ఊపిరి పోసీ
జీవన ప్రణవము పూరించీ
నాదం పలికించు-ఒక
నాదం పలికి కించు!
 
భావం పలికించు-ఒక
భావం పాలికించు !
చిరు యెదనే కదలించీ
భావ కడలుల మధించీ
సమతల మమతల నిలలో పెంచీ
భావం పలికించు-ఒక
భావం పలికించు !
 
యోగం సాధించు –ఒక
యోగం సాధించు!
మనసును కోవెల చేసీ
పలుకుల తేనెల జిలికీ
చేతల నితరుల సాంత్వన పరచే
యోగం సాధించు –ఒక
యోగం సాధించు !
 
శ్వేదం ఒలికించు – నీ
శ్వేదం ఒలికించు!
పరులను యోచన మానీ
ఇతరుల యెదను రవళించే
విశ్వ మానవ  సౌభ్రాతృ  భావనను
మురళి రవళి మ్రోగించు –మధు
మురళి రవళి మ్రోగించు –నీ
శ్వేదాన్నే ఒలికించు !

 

రచన :- నల్లాన్ చక్రవర్తుల  వేంకట రంగనాథ్