Facebook Twitter
వెర్రి మొగమాటం (కథ)

 

 

వెర్రి మొగమాటం (కథ)


 - మొక్కపాటి నరసింహశాస్త్రి

    మొక్కపాటి నరసింహశాస్త్రి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని హాస్య రచయిత. బారిష్టరు పార్వతీశం వీరి ప్రసిద్ధ రచన. చలనచిత్రంగా కూడా వచ్చింది. అసలు వీరి సంభాషణే హాస్యంతో కూడి ఉంటుందని చెప్తారు పరిచయస్థులు. బందరు జాతీయ కళాశాలలో చాలాకాలం ఉద్యోగం చేశారు. చమత్కారి అయిన మొక్కపాటి నరసింహశాస్త్రి కేవలం హాస్య కథలే కాకుండా సీరియస్ కథలు, నాటికలు కూడా రాశారు. వారు రాసిన హాస్య సంజీవిని వంటి కథే 'వెర్రి మొగమాటం'.
       'వెర్రి మొగమాటం' కథలో ప్రధాన పాత్ర ఉమ్మాయి. ఉమ్మాయి అసలు పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు అనే పేరును ఆఖరుకు ఉమ్మాయే మర్చిపోతాడు. పుట్టినప్పుడు మాత్రమే అతడ్ని ఆ పేరుతో పిలిచి ఉంటారు. తర్వాత అందరూ ఉమ్మాయే అని పిల్తుస్తుంటారు. ఒకవేళ ఎవరన్నా ఉమామహేశ్వరరావు అంటే తన పేరు కాదని ఉలిక్కిపడేవాడు. అదీగాక ఎవరు కొత్తగా పరిచయం అయినా మొదట మర్యాదగా మాట్లాడినా వెంటనే 'అరేయి ఉమ్మి' అని సొంత మనిషిలా మాట్లాడేస్తారు. ఉమ్మాయి కూడా బాగానే కలిసిపోతాడు. ఉమ్మాయికి మొగమాటం కూడా ఎక్కువే. అందువల్ల అతని స్నేహితులు అందరూ ఉమ్మాయిని హాస్య నిలయుడిగా చూసేవారు. అసలు ఏమాత్రం హాస్య స్ఫోరకం లేని వాళ్లకు కూడా ఉమ్మాయిని చూడగానే హాస్యం పుట్టుకొచ్చేది.
          ఉమ్మాయిలో మరోలోపం ఏమిటంటే ఎవరేది చెప్పినా కాదనలేక పోయేవాడు. దాంతో అందరూ అతడ్ని కష్టాలు పెట్టేవాళ్లు. చిన్నప్పుడు ఒకసారి నలుగురు స్నేహితులు ఉమ్మాయిని కూర్చోపెట్టి ముప్పై ఇండ్లీలను బలవంతంగా తినిపించారు. కానీ ఉమ్మాయి మాత్రం 'నేను తినను... నా వల్ల కాదు' అని గట్టిగా చెప్పేవాడు కాదు. ముప్పై ఇడ్లీలకు తినడంతో ఉమ్మాయికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆ బాధ తీరడానికి అతని స్నేహితులే మళ్లీ జింజిర్లు తాగించి, వాంతి చేయించి, అగ్నితుండి మాత్రలు వేసి నానా అవస్థలు పెట్టారు. అప్పుడు కానీ ఉమ్మాయి ఆరోగ్యం బాగు కాలేదు. కాలేజ్ లో చదువుకునేటప్పుడు వార్షికోత్సవానికో, పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవానికో ఓ వినోద కార్యక్రమం జరుగుతుంటే- ఉమ్మాయి యోగాసనాలు వేస్తాడని అనౌన్స్ మెంట్ చేస్తాడు అతని స్నేహితుడు. ఉమ్మాయి 'నావల్ల కాదు, నేను ఏమీ చేయలేను' అని చెప్పినా వినిపించుకోకుండా స్టేజీ మీదకు లాక్కుపోతారు. అక్కడ ఉమ్మాయి శీర్షాసనం వేయలేక నానా తంటాలు పడితే అందరూ నవ్వుకుంటారు.
           ఉమ్మాయి స్నేహితులలో ఎక్కుమంది మద్రాసువాసులవుతారు. అందువల్ల ఉమ్మాయి అప్పుడప్పుడు మద్రాసు వెళ్లి పదిరోజులు ఉండివస్తుండేవాడు. ఉమ్మాయి మద్రాసులో ఉన్నన్ని రోజులు వాళ్ల స్నేహితులకు ఇట్టే గడిచిపోయేది. అలా వెళ్లిన ప్రతిసారి ఉమ్మాయి అనుకున్న సమయం కన్నా మరో పదిరోజులు ఎక్కువ ఉండేవాడు. అలా ఒకసారి ఉమ్మాయి మద్రాసు వెళ్లి నప్పుడు పదిరోజులు సరదాగా గడిపి, తిరిగి వద్దాం అనుకునేటప్పుడు అతని స్నేహితుడు వెంకన్న వచ్చి ' వెళ్లు నాయనా వెళ్లు, నీకేం మహారాజువు. నిన్ను అడ్డు పెట్టేవాళ్లు ఎవరు... మేం ఎలా చస్తే నీకేం...' అని నిష్టూరంగా మాట్లాడితే ఉమ్మాయి అతనికి నా వల్ల ఎలాంటి అవసరం ఉందో అనుకుని అక్కడే ఉండిపోతాడు. అలా పదిరోజులు మద్రాలులోనే ఉన్నాడు. తర్వాత పాండీ బజారులో ఎవరితోనే నేను ఊరికి వెళ్తున్నాను అంటే... వెంటనే అక్కడ నలుగురు స్నేహితులు చేరి 'నీతో బోలెడంత పని ఉంది.. నువ్వు వెళ్లడానికి వీలు లేదు' అని చెప్తారు. కానీ వాళ్లు ఎవ్వరూ ఉమ్మాయికి ఒక్కరోజు కూడా తిండిపెట్టినోళ్లు కారు. అసలు ఆ పదిరోజులు ఉమ్మాయికి వాళ్లు కనపడలేదు. ఉమ్మాయికి చేతిలో డబ్బులు అయిపోవడంతో- ఇంటి నుంచి వందరూపాయలు తెప్పించుకుంటాడు.
         డబ్బులు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని మౌంటు రోడ్డులో ఇంట్లో వాళ్లకు అవసరమైనవి ఏవో... కొనుక్కుందామని వెళ్తాడు. అక్కడ శంకరం కనిపిస్తాడు. అంతే అతను ఉమ్మాయిని ఇంటికి వెళ్లనీయకుండా... విషయాన్ని స్నేహితులందరికీ చేరవేస్తాడు. అంతే చివరకు ఉమ్మాయిని తీసుకొని గోపాలం ఇంటికి, తర్వాత వెంకన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ స్నేహితులందరూ కలిసి- తీర్మానాలు చేస్తారు. ఉమ్మాయి ఇప్పుడే ప్రయాణం చెయ్యడం భావ్యం కాదు. ఒకవేళ తర్వాత వెళ్లినా స్నేహితులు అందరికీ విందులు, వినోదాలు ఏర్పాటు చెయ్యాలి. తర్వాతే ఉమ్మాయిని రాజ గౌరవాలతో ఇంటికి పంపిస్తారు. అలా ఉమ్మాయి వాళ్ల దగ్గర మొగమాటానికి పోయి ఊరి ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాడు. ఇక సినిమాలు, షికార్లు, నాటకాలు, ఫలహారాలు, విందులు ఏర్పాటు చేస్తాడు. సెలవలు ఉండడంతో మహాబలిపురం యాత్రకు కూడా వెళ్లి వస్తారు. చివరకు ఉమ్మాయి ఊరికి వెళ్లడానికి స్నేహితులందరూ ఒప్పుకుంటారు. గోపాలం ఉమ్మాయిని ఊరికి సాగనంపడానికి అతనితో కలిసి టాక్సీలో మౌంట్ రోడ్డుకు వస్తాడు. అక్కడ కాఫీ తాగుతారు. గోపాలం 'మీ ఇంటికి వెళ్లే టప్పుడు ఏవో కొనాలని అనుకున్నావు కదా... కొను' అని చెప్తాడు. అప్పుడు గోపాలం 'పోస్టాఫీసుకు వెళ్దాం' అని చెప్తాడు. లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత గోపాలం 'ఎక్కడికి వెళ్దాం' అంటే... ' బసకు వెళ్దాం. ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడే ఒక్క రూపాయి ఉంటే... దాంతో ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాను డబ్బులు పంపమని' అని చెప్తాడు.
         ఇలా ఈ కథమొత్తాన్ని మొక్కపాటి నరసింహాశాస్త్రి మొగమాటం వల్ల ఉమ్మాయి అనుభవించే కష్టాలను చెప్తాడు. ఒక వెర్రి అమాయకుడిని స్నేహితులు ఎలా ఆడుుకుంటారో, ఏడిపిస్తారో ఈ కథ వల్ల తెలుస్తుంది. అందుకే సున్నితమైన హాస్యాననికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ. 
                              

                                  ......డా. ఎ.రవీంద్రబాబు