Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 16 వ భాగం

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 16 వ భాగం

"పాండవులు అరణ్యవాసం చేసే సమయమున మార్కండేయ మహర్షి చూడడానికి వెళ్తారు. అప్పుడు ధర్మరాజు ఆయన్ని అడుగుతాడు..
   "స్వామీ! ద్రుపదరాజ తనయ అయిన ద్రౌపది యజ్ఞవేదిక నుండి ఆవిర్భవించిన పవిత్ర మూర్తి. సుకుమారి. అయోనిజ. ధర్మమూర్తి అయిన ఆమెకి ఈ కష్టాలేమిటి? కానల తల దాచుకుని, కందమూలాలు తినవలసిన కర్మ మేమి? ధర్మాన్నే ఊపిరిగా భావించే నాకీ దుర్గతి ఏమిటి? మా వంటి దురదృష్టవంతులు ఎక్కడైనా ఉన్నారా? ఉంటే చెప్పండి."
   మార్కండేయముని ధర్మరాజునకు ధైర్యం చెప్తూ.. వారే కాక చాలా మంది కష్టాలు పడిన వాళ్లున్నారని అంటూ సీత కథ అయిన రామాయణం, సావిత్రి చరిత్ర చెప్తారు.
   రామాయణం మీకు బాగా తెలిసిందే కదా..
   సావిత్రి కథ చెప్పుకుందాం."
   పోతమ్మ, కోడలికేసి చూసి సైగ చేసింది. ఇంటి పనేమయినా ఉందా అన్నట్లు.. కోడలు అంతా అయిపోయిందని చెప్పగానే.. సర్దుకుని కూర్చుంది. అత్తా, కోడలు సౌకర్యంగా కూర్చుని.. వినడానికి సిద్ధంగా ఉండుట చూసి ఎర్రన మొదలుపెట్టాడు.
   "పూర్వము మద్ర దేశాన్ని అశ్వపతి అనే రాజు పాలిస్తుండేవాడు. అతడు సత్యవ్రతుడు, దానశీలుడు, జనులకు ఇష్టుడు, ఉదార చరితుడు, జితేంద్రియుడు. అన్నీ ఇచ్చిన భగవంతుడు అతడికి పుత్ర సంతానము ఇవ్వలేదు.
   సంతానము కొరకై అతడు సావిత్రీదేవిని పద్ధెనిమిది సంవత్సరాలు ఆరాధించాడు. నియమిత ఆహారముతో, కఠోర నియమాలతో, బ్రాహ్మణ సమేతుడై, ప్రతీ దినము గాయత్రీ మంత్రముతో లక్ష ఆహుతులు అర్పించాడు. సావిత్రీ దేవియే గాయత్రీ మాత.
   గాయత్రీ మాత సంతసించి సుగుణవతి అయిన ఒక పుత్రికని ప్రసాదించింది. పుత్రుని కోరిన నరపతికి, ఈ పుత్రిక ద్వారానే తన కోరిక తీరునని చెప్పి అంతర్ధానమయింది.
   సావిత్రీ సత్యవంతుల గాధను మార్కండేయముని ధర్మరాజుకు చెప్పాడని, జనమేజయునికి, వైశంపాయనుడు సర్పయాగంలో చెప్తాడు. అదే కథను సూతుడు శౌనకాది మునులకు నైమిశారణ్యంలో చెప్తాడు.
   అశ్వపతి పట్టపురాణి మాళవి గర్భం దాల్చి, ఒక శుభ ముహుర్తాన బాలికను ప్రసవిస్తుంది. సావిత్రీదేవి వరప్రసాదం కనుక ఆ పాపకి సావిత్రి అని నామకరణం చేస్తారు. అందాల రాశి అయిన సావిత్రి అల్లారు ముద్దుగా పెరుగుతుంటుంది.
   యుక్త వయసు వచ్చిన సావిత్రికి సౌందర్య గుణగణాల్లో దీటైన, తగిన వరుడ్ని తేవడం సాధ్యంకాదని తెలిసింది అశ్వపతికి.
 
                      
   "అమ్మా! నీకు తగిన వరుడ్ని నీవే ఎన్నుకో.. మంత్రులు, సేవకులు నిన్ను సర్వ సన్నాహాలతో అనుసరిస్తారు. యాత్రకు బయలుదేరు. ఈడు వచ్చిన కన్యకు పెండ్లి చేయని తండ్రి, తండ్రి మరణించిన తల్లిని సరిగ్గా చూడని కొడుకు నిందాపాత్రులు."
   తండ్రి యాజ్ఞను తలదాల్చి, వరాన్వేషణ ధ్యేయంగా యాత్రకు బయలు దేరుతుంది సావిత్రి.
   దేశాన్నేలే రాజుకే వరాన్వేషణ కష్టమయి తనయను, తగిన వరుడ్ని తననే వెతుక్కోమని పంపాడు. అందరూ స్వయంవరాలేర్పాటు చేస్తే అశ్వపతి వరాన్వేషణకి అమ్మాయిని పంపాడు. కుమార్తెకు పూర్తిగా ఇష్టమయితేనే వివాహం చెయ్యాలి అని ఈ చరిత్రలు చెపుతాయి మనకి.
   కుమార్తె మీద అటువంటి విశ్వాసం ఉంది ఆ రాజుకి. తనకి చేతకాని పని ఆమె చేయగలదని నమ్మకం. ఆమెయే ఎంచుకుంటే తన సంశయాలు పోయినట్లే.
   స్వర్ణరధం మీద, పరిచారికలు, మంత్రులు, వృద్ధులూ అనుసరిస్తుండగా బయలుదేరింది సావిత్రి. ఎక్కడికి వెళ్ళాలి. ఏ విధంగా అన్వేషించాలి అనే నిర్ణయాన్ని సావిత్రికే వదిలి పెట్టారు పెద్దలు.
   ముందుగా మునుల ఆశ్రమాలకు వెళ్ళాలని, పిదప తీర్థ క్షేత్రాలను దర్శించాలని సావిత్రి నిర్ణయించుకుంది.
    "తపోవనాని రమ్యాణి రాజర్షీణాం జగామ హ
    మాన్యానాం తత్ర వృద్ధానాం కృత్వా పాదాభి వాదనం
    వనాని క్రమ శస్తాత సర్వాణ్యేవాభ్య గఛ్ఛత
    ఏవం తీర్థేషు సర్వేషు ధనోత్సర్గం నృపాత్మజా."
   రాజర్షులుండే తపోవనాలను దర్శించి, అక్కడ మాన్యులు, పెద్దలు అయిన మహర్షులను సందర్శించి వారికి నమస్కరించి, వారి ఆశీర్వాదాలను ముందుగా తీసుకోవాలి. ఆ తరువాత తీర్థ క్షేత్రాలలో తిరిగి, అర్హులకు దానం చెయ్యలని నిర్ణయించింది సావిత్రి.
   కొండ అడ్డువస్తే నది మలుపు తిరిగినట్లే, తను తీసుకున్న నిర్ణయం మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. నదులు ఆగకుండా ప్రవహించినట్లే జీవితాలు కూడా ఆగకుండా కాలప్రవాహంలో గడిచిపోతూ ఉంటాయి.
   సరయిన నిర్ణయం తీసుకొనక పోతే జీవితంలో కష్టాలు తప్పవు. జీవితం అస్తవ్యస్తంగా నడుస్తుంది. వరనిర్ణయం సులువైన పని కాదు. అటువంటి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మహనీయుల ఆశీస్సులు కావాలి.
   మహాత్ముల శుభాశీస్సులు ఎంతగానో ఉపయోగిస్తాయి.
   అందుకనే తపోవనాలను దర్శించి మహర్షుల ఆశీస్సులను ముందుగా పొందాలని సావిత్రి అనుకుంది.
   నిర్మల చిత్తులైన మహాత్ములకు నమస్కరించడం సంప్రదాయం. అదే విధంగా అర్హులకు దానం చెయ్యడం కూడా. నేడు ఇచ్చిందే రేపు మనకు వస్తుంది. ఇప్పుడు మనకు ఉన్న రాజభోగాలకి కారణం మనం ఎప్పుడో చేసిన దానమే!
   సాధు దర్శనం, సపాత్రదానం ముగించి నగరానికి వచ్చింది సావిత్రి. తండ్రిని దర్శించి యాత్ర విశేషాలను చెప్పాలని వెడలింది.
   అక్కడ నారద మహర్షి, అశ్వపతితో సంభాషిస్తూ కనిపించాడు. ఆయనకు నమస్కరించింది సావిత్రి.
   "కుమార్తెకు వివాహయత్నం చేశావా రాజా" నారదుడు అడిగాడు.
   "మహర్షీ! వరాన్వేషణ అమ్మాయికే వదిలిపెట్టాను. ప్రాజ్ఞురాలైన సావిత్రి యాత్రలు చేసి వచ్చింది. ఆమె ఎవరిని ఎంచుకుందో విందాం."
   సావిత్రి సౌమ్యంగా, వీణ మీటి నట్లుగా చెప్పసాగింది.
   "సాళ్వదేశరాజు ద్యుమత్సేనుడు ధర్మాత్ముడు. తన ఏకైక కుమారుడు బాలుడిగా ఉన్నప్పుడు, ఆ రాజుకు అంధత్వం ప్రాప్తించింది. రాజుకి కన్నులు లేవు, కొడుకు చిన్నవాడు.. శతృ రాజులు దేశం మీదికి దండెత్తి, రాజ్యాన్ని అపహరించారు.
   మహారాజు భార్యా పుత్రులతో అడవికి వెళ్ళి నియమ నిష్టలతో తపస్సు చేసుకుంటున్నాడు. వారి కుమారుడే సత్యవంతుడు. మహారాజ పుత్రుడైనా కానలలోనే పెరిగాడు. మాయామర్మం తెలియనివాడు. నియమ నిష్టలుగలవాడు. జననీ జనకుల సేవలో జన్మని చరితార్ధం చేసుకుంటున్న సత్యవంతుడ్ని నేను వరించాను." తన నిర్ణయం చెప్పి తల దించుకుని నిలబడింది సావిత్రి.
   సావిత్రి చెప్పినది విని మహర్షి అంగీకారం, ఆశీస్సులకోసం, వేచి చూచాడు అశ్వపతి.
   నారదుడు ఉదాసీనంగా ఉన్నాడు.
   "మహర్షీ!" రాజు పిలిచాడు.
   సావిత్రి కూడా ఉద్వేగంతో చూసింది. తన నిర్ణయాన్ని ఏమంటారో మహర్షి..
   "రాజా! సత్యవంతుడు నీతిమంతుడు, బుద్ధి మంతుడు. అతనికి చిత్రాశ్వుడు అనే పేరు కూడా ఉంది. వివిధ రకాల గుర్రాల బొమ్మలు తయారు చేసేవాడు. చిత్ర లేఖనంలో మంచి ప్రావీణ్యముంది.
   రాకుమారి చెప్పినట్లు సత్యవంతుడు పితృ భక్తి పరాయణుడు. గుణగణాలను చూసి సావిత్రి అతడిని వరించింది. కానీ అతనికి నివారించలేని దోషం ఉంది. అతడు అల్పాయుష్కుడు. ఈవేళ్టికి సరిగ్గా ఒక సంవత్సరాని అతనికి ఆయుషు అయిపోతుంది."
   మహారాజు సావిత్రిని చూశాడు.
   "అమ్మా! చూస్తూ చూస్తూ అల్పాయుష్కునికి ఏవిధంగా కన్యాదానం చెయ్యగలను? సత్యవంతుని మరచిపో. మళ్ళీ వరాన్వేషణ సాగించు."
   కన్నతండ్రి మనసు అది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె, విధవరాలై కళ్ళ ముందు తిరుగుతుంటే ఏ తండ్రి భరించగలడు..
   కానీ సావిత్రి ధృఢ మనస్కురాలు.
   "తండ్రీ.. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు, దానశీలుర వాగ్దానాలు, కన్యాదానం ఒకేసారి జరుగుతాయి. అదే విధంగా వర నిర్ణయం కూడా. మీ ఆజ్ఞనుసారమే అన్వేషణ జరిపి, సత్యవంతుడిని పతిగా వరించాను.
   సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడైనా, అల్పాయుష్కుడైనా, గుణవంతుడైనా గుణహీనుడైనా.. అతడిని నా భర్తగా ఒక సారి ఎన్నుకున్నాను. మరొకరిని ఊహించడం కూడా నావల్లకాదు."
   భారతీయ సంస్కృతి వంట బట్టించుకున్న సావిత్రి ప్రేమమయి. విజ్ఞానఖని. ఆమెది స్వచ్ఛమైన ప్రేమ కథ.
   కానలలో కాపురముండాలని తెలిసే సత్యవంతుడిని వరించింది. రాజ్య భోగాలను వదులుకోవడానికి సిద్ధపడింది. అల్పాయుష్కుడని తెలిసినా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది.
   అందుకే పవిత్ర నారీమణులను స్తుతించేటప్పుడు, సీత, సావిత్రి, ద్రౌపది, దమయంతి అని చెప్తారు మన పెద్దలు. సీత, దమయంతి, ద్రౌపది.. వీరికి వివాహానికి ముందు అడవుల్లో కాపురం చెయ్యాలని తెలియదు. కానీ సావిత్రికి తెలుసు.
   సావిత్రి అందుకే విలక్షణమైన స్త్రీ. వరునితో పాటు విపత్తులను వరించింది. తెలిసి తెలిసి ఎవరూ ఆవిధంగా చెయ్యరు. ఆమె ఆలోచనా విధానంలో, నియమ నిష్టలుపాటించడంలో ఋషులకు సమానము.
   "మనసా నిశ్చయం కృత్వా తతో వచాభిదీయతే
   క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మన స్తతః.
   తండ్రీ మనస్సులో చేసుకున్న నిర్ణయం మాట ద్వారా బయటకు వస్తుంది. అది కర్మ ద్వారా ఆచరించబడుతుంది. అందుకే నాకు మనస్సే ప్రమాణం." సావిత్రి ధృఢంగా సెలవిచ్చింది.
   ఉదాత్తమైన సావిత్రి మాటలకు పరమానంద భరితుడై, సత్యవంతునితో ఆమె వివాహానికి తన సమ్మతిని తెలియజేశాడు నారదుడు.
   "మహారాజా! సావిత్రి స్థిరమైన మనస్సుతో ఉంది. ఆమెని ధర్మ మార్గం నుండి ఎవరూ తప్పించలేరు. సుగుణవంతుడైన సత్యవంతునికిచ్చి ఆమె వివాహాన్ని జరిపించు. మీకందరికీ శుభం కలుగుతుంది." అశ్వపతితో ఈ శుభకరమైన మాటలు పలికి వెడలిపోయాడు నారదుడు.
   సుదీర్ఘ ఉపన్యాసం తరువాత, దాహార్తుడై ఆగాడు ఎర్రాప్రగడ.
   పతి అవసరాలు గ్రహించగలిగిన అర్ధాంగి, రజతపాత్రలో సిద్ధంగా ఉన్న మంచినీరు అందించింది.
   "మధ్యాహ్న సమయం అయింది.. భోజనం అయ్యాక చెప్పుకుందాం." చేతులు నేలకానించి కష్టం మీద లేచింది పోతమ్మ. వృద్ధాప్యపు ఛాయలు అప్పుడప్పుడే బయట పడుతున్నాయి.
   చేతిలో పని అందుకునే కోడలుంది కనుక లోటు లేకుండా గడిచిపోతోంది. పోతమాంబ తేలిగ్గా ఇంట్లోకి నడిచింది.
                        ……………..
   "సావిత్రీ సత్యవంతుల వివాహమే కదా ఇంక.." పోతమాంబ అడుగుతుంటే నవ్వుతూ తల ఊపాడు కుమారుడు. శ్రోతలిరివురూ ముందుగానే వచ్చి, తమ ఆసనాలనలంకరించారు.
   ఎర్రన్న కొద్ది సేపు ఆగమన్నాడు భుక్తాయాసంతో. ఆ రోజు శుక్రవారం.. గాయత్రీ దేవికి ప్రియమైన గుడాన్నం, పెరుగన్నం నైవేద్యం పెట్టారు. దధ్యన్నాసక్త హృదయ, గుడాన్న ప్రీత మానస అయిన అమ్మవారిని ఆరాధించి ఆవిడ ప్రసాదం భుజించారు. నేతి పోపు దట్టంగా పడిన, మీగడతో కూడిన పెరుగన్నం.. వెన్నకాచిన నెయ్యి బాగా వేసి, యాలకుల వాసన గుబాళిస్తున్న గుడాన్నం.. కాసింత విశ్రాంతి కోరడంలో వింత ఏముంది..
   అందులో మహా భారత రచన మొదలుపెట్టినదాది మితాహారం, కోడికునుకు.. కలలో, ఇలలో, సుషుప్తిలో వ్యాస మహర్షే. ఆ అలసట అంతా ఇప్పుడు తెలుస్తోంది.
   అత్తాకోడళ్ళు సరేనని, దూరంగా నున్న వెనుకటింటిలో, బియ్యం విసిరే కార్యక్రమం మొదలుపెట్టారు.
   రెండు ఘడియలయ్యేసరికి రెండు శేర్ల బియ్యం మొరుం అవడం.. ఎర్రనగారు విశ్రాంతి పూర్తయి తన స్థానానికి రావడం జరిగాయి. సూరనార్యుడు భోజనం అవగానే తన పాఠశాలకి వెళ్ళిపోతాడు రోజూ.
   అప్పుడు పురాణశ్రవణానికి కూర్చుంటే సంధ్యా సమయానికి ముందు వరకూ నిరాటంకంగా సాగిపోవచ్చు.
                          …………...
   "అశ్వపతి మహరాజు అడవికి బయలుదేరాడు, ద్యుమత్సేనుని కలవడానికి. ఆశ్రమానికి వెళ్ళి తన అభీష్టమును తెలియజేశాడు.
   "రాజర్షీ! నేను మద్రదేశరాజును. నా కుమార్తె సావిత్రి సుగుణవతి. సౌందర్యవతి. ఆమెను మీ కోడలిగా స్వీకరించ వలసిందని ప్రార్ధిస్తున్నాను."
   ద్యుమత్సేనుడు మౌనంగా ఉండిపోయాడు.
   "మహానుభావా!"
   "మహారాజా! నేను కళ్ళు లేనివాడను. రాజ్యం పోగొట్టుకున్నవాడిని. కానల్లో కందమూలాలు తింటూ, కటిక నేల మీద నిద్రిస్తూ బ్రతుకుతున్నవాళ్ళం మేము. సుకుమారి, రాకుమారి అయిన మీ అమ్మాయి ఈ కష్టాలు పడలేదు. ఈ వలయంలోకి మీ అమ్మాయిని ఎందుకు పంపుతారు.. నాకు ఇష్టం లేదు."
   ధర్మవర్తనుడైన ద్యుమత్సేనుని పలుకులకు అశ్వపతి సంతోషించాడు.
   "సుఖం చ దుఃఖం చ భవా భవాత్మకం
   యదా విజానాతి సుతాహ మేవచ.
   స్వామీ! సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ విషయం మాకు, మా అమ్మాయికి కూడా తెలుసు. అన్ని విషయాలను చర్చించుకున్న తరువాతనే, గట్టి నిర్ణయం తీసుకుని మీ వద్దకు వచ్చాము.
   మా ఆశను వమ్ము చేయకండి ద్యుమత్సేనా! నా ఆశయం అర్ధం చేసుకుని నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి. సావిత్రి సత్యవంతునికి అన్ని విధాలా తగిన ఇల్లాలు. మనం ఉభయులం వియ్యమందడానికి తగిన వాళ్ళం."
   అశ్వపతి మాటలకు ద్యుమత్సేనుడు అమిత సంతుష్టుడైనాడు.
   "ఈ సంకల్పం నాకేనాటి నుండో ఉంది. కానీ పరిస్థితుల మారిపోవడంతో మిమ్మల్ని అడగలేకపోయాను. మీకు మీరుగా వచ్చి నా కలల్ని నిజం చేశారు. నేడు ఎంతో సుదినం" ఆనందంగా సావిత్రీ సత్యవంతుల వివాహానికి అంగీకరించాడు ద్యుమత్సేనుడు.
   ఈ సందర్భంలో నేను వ్రాసిన పద్యం వింటారా?" ఎర్రన అడిగాడు శ్రోతలని.
   "ఎందుకు వినం?" అర్ధాంగి అంది కోమలస్వరంతో.
   "మేమడుగుతే నువ్వేమంటావో నని అడగలేదబ్బాయ్.. నీ అంతట నువ్వే వినిపిస్తానంటే అంతకంటేనా?" అమ్మ మాటలకి ఆనందంగా తలూపాడు తనయుడు.
   వ్యాస భారతం వ్రాశాక, పార్వతీ దేవి శ్లోకాన్ని వినిపించమంటే తల ఊపిన వినాయకుడు తలపుకొచ్చాడు పోతమ్మకి. విగ్రహంలో కాదు.. విజ్ఞానంలో..
   "ఈ కన్నియ నా కూతురు
    మాకులమున కెల్ల దెప్ప మనుజోత్తమ! నీ
    వీ కన్నియ గోడలుగా గై
    కొనుము మదీయ వచన గౌరవ బుద్ధిన్."
   అయోమయంగా చూసింది పోతమాంబ..
   "అంతా అర్ధమయింది కానీ ‘కులానికంతటికీ తెప్ప’ అన్నావేంటబ్బాయ్!"
   "అందులో చాలా అర్ధముంది.." అప్పుడే అక్కడకొచ్చిన సూరనార్యుడు అన్నాడు. అతడు అప్పుడప్పుడు కుమారుడి కవిత్వాన్ని చూస్తుంటాడు. అందులో అతని కంద పద్యాలను చదువుతుంటే ఒడలు పులరిస్తుంటుంది ఆ విద్వన్మణికి.
   మామగారి రాక చూసి నిలుచుని ఒక పక్కగా ఒదిగింది ఇంటి కోడలు.
   "అంటే.." పోతమ్మ కుతూహలంగా చూసింది.
   "మా కులానికంతకీ ఈమె తెప్ప అని చెప్పడం చాలా సందర్భోచితమైన మాట. ఏరు దాటించేది తెప్ప. వంశాన్ని తరింప జేసే పడవలాంటిది సావిత్రి అని చెప్పుకున్నాడా తండ్రి. ఎంతో భావంతో, పుట్టినింటికీ, మెట్టినింటికీ.. రెండు వంశాలకీ వన్నె తెస్తుంది అని చెప్పడం." సూరనార్యుడు కూడా ఎర్రన వచనాలని వినడానికి కూర్చున్నాడు.
   కోడలు ఇంటి లోపలికి నడవబోతుంటే వారించారు సూరన, పోతమ్మ.
   పోతమాంబ తన ప్రక్కనే కూర్చుండమని సైగ చేసింది.

   "అశ్వపతి మద్ర దేశాధిపతి..
   అంతఃపురాలూ, చీని చీనాంబరాలూ.. పంచ భక్ష పరమన్నాలూ, హంస తూలికా తల్పాలూ!
   ద్యుమత్సేనుడు రాజ్య భ్రష్ఠుడు.
   కానల్లో కుటీరాలూ, నార చీరలూ.. కందమూలాలూ, కటిక నేల పడకలూ..
   దీనావస్థలో నున్న ద్యుమత్సేనుడిని తన రాజ్యానికి పిలిపించుకుని, అశ్వపతి పెండ్లి మాటలు మాట్లాడవచ్చు. కానీ అతడు నిరాడంబరుడు, సంప్రదాయాలు తెలిసినవాడు, మర్యాదలు పాటించేవాడూ, వినమ్రుడూ.. అందువలననే అడవికి వెళ్ళి వివాహ ప్రస్థావన తెచ్చాడు.
   పైగా పాద చారియై వెళ్ళాడని వ్యాస మునీంద్రులు వ్రాశారు.
   తన కుమార్తె వరించిన వరుడిని.. అంతస్థులు తేడాఉన్ననూ అంగీకరించాడు. మహరాజైననూ ఒక మామూలు తండ్రివలే మగపెళ్ళివారింటికి వెళ్ళాడు. తన వైభవాన్ని ప్రదర్శించలేదు.
   ఆడంబరాలకు పోకుండా బిడ్డల మనోభీష్టాలనేవిధంగా నెర వేర్చాలో చూపించి ఆదర్శ జనకుడయ్యాడు.
   తన ఏకైక పుత్రికను అడవుల్లోనికి కాపురానికి పంపడానికి నిశ్చయించుకున్నాడు.
   సావిత్రీ సత్యవంతుల వివాహం ఇరుపక్షాల పెద్దల సమక్షంలో.. జరిగిపోయింది. ఆశ్రమాలలోనున్న మునులు, ముని పత్నులు వచ్చి ఆశీర్వదించారు.
   రూపవతి, శీలవతి, సుగుణాలరాశి అయిన సావిత్రి ధర్మపత్ని అయినందుకు సత్యవంతుడు అమందానంద భరితుడయ్యాడు. కోరిన వరుడ్ని పెండ్లి యాడినందుకు సావిత్రికి పరమానందమయింది.

   తండ్రి తనని అత్తమామలకి అప్పగించి వెళ్ళిన తరువాత, సావిత్రి ఆభరణాలను త్యజించింది. నారచీరలను ధరించింది.
   కోమల స్వరంతో సంయమనం పాటిస్తూ పలుకులు.. అత్తమామల సేవ.. వ్రత నియమాలను పాటించడం.. సావిత్రి తపో జీవనానికి అలవాటుపడి పలువురు మన్ననలందుకుంటోంది.
   తాను రాజకుమారినని మరచిపోయింది.
   వివాహమయి సంవత్సరం కావస్తోంది. సావిత్రి రోజులు లెక్కపెట్టుకుంటోంది. నారద మహర్షి మాటలు మరచిపోలేదు.. వీలైతే కాలాన్ని ఆపెయ్యాలని ఉంది. ఇంక నాలుగు రోజులే ఉంది.
   సావిత్రి ఉపవాస దీక్ష ప్రారంభించింది.రేయింబవళ్ళు కూర్చునే ఉంది ధ్యానంలో.
   కోడలి కఠోర నియమాలను విని అత్తమామలు కలత చెందారు.
   "అమ్మా! నిద్రాహారాలు లేకుండా మూడు రోజుల నుంచీ కాచుకుని ఉన్నావు. నాకు ఎంతో బాధ కలుగుతోంది. భరించలేకపోతున్నాము మేము." ద్యుమత్సేనుడు వ్యాకులతతో అన్నాడు.
   అయినా సావిత్రిని నివారించలేకపోయాడు.
   అంతటి ధృఢ నిశ్చయంతో వ్రత దీక్ష కొనసాగిస్తోంది.
   ఆరోజే నారద మునీంద్రులు హెచ్చరించిన దినము.. సత్యవంతుని మరణమాసన్నమయింది.
   సావిత్రి సర్వాహ్నికాలను ముగించుకుని అత్తమామలకు సేవ చేసింది. విప్రులకు నమస్కరించింది. అందరూ పదికాలాలు సకల సౌభాగ్యవతిగా వెలుగొందమని దీవించారు.
   అప్పుడే గొడ్డలి భుజాన వేసుకుని సత్యవంతుడు అడవికి బయలుదేరుతున్నాడు. సావిత్రి భర్త వద్దకు వెళ్ళింది.                     

 

 

 

 

 

.....మంథా భానుమతి