Facebook Twitter
తులసి

తులసి

 


                                

రాత్రి తొమ్మిది గంటల సమయంలో వంటగది శుభ్రం చేసేసి, తల్లి గదిలోకి వెళ్ళింది తులసి. మంచం మీద కూర్చుని బట్టలు మడతపెడుతున్న సాగరి వెనుకగా కూర్చుని, ఆమె భుజాలని సున్నితంగా నొక్కసాగింది. "అమ్మా, రేపొద్దున్నే చపాతీలకి పిండి కలపాలా? పాలకూర, బంగాళదుంపలు తరగాలా? ఇప్పుడే చేసేస్తే పని అయిపోతుందిగా," అని అడిగింది. 


సాగరి తలూపింది. "నీకు అలసటగా అనిపిస్తే, పొద్దన్న మరింతసేపు నిద్రపో. నాతో పాటు లేవద్దు. చపాతీలు, కూర నేను చేసేస్తాలే. మీ నాన్నలా నీక్కూడా మరునాటి పనుల గురించి ముందురోజు నుండే ఆలోచన," అంది కూతురి  నుదిటి ముద్దు పెడుతూ.


అమ్మ భుజంపై తల ఆనించి, "అమ్మా... త్వరలో నీ పుట్టిన రోజు వస్తోంది కదా. ఏదైనా నగ కొనుక్కోమ్మా. బావుంటుంది.  బైబిల్ స్కూల్ డిబేట్లలో గెలిచుకున్న నగదుతో, నీకు, నాన్నకి  ఏదైనా  చేయాలని  ఉందమ్మా,”  అంటూ బ్రతిమాలింది. "అలా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది,”...అంది తులసి.


సాగరి నవ్వేసి, కూతురి వైపు తిరిగింది. "మంచి ఆలోచనే బంగారం. నీ వయసులో అమ్మానాన్నల గురించి ఇంతలా ఎవరు ఆలోచిస్తారు? మీ తమ్ముడు సాయి చూడు... సైకిల్  కొనమని ఒకటే సతాయింపు...మన మల్లికకి ఖరీదైన బొమ్మరిల్లు కావాలట. ఒకటే గొడవ... నిజానికి నీకే ఏదైనా కొనిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ఆ డబ్బు నీ శ్రమకి, నైపుణ్యానికి వచ్చిన బహుమతి తల్లీ..." చెప్పింది సాగరి. 


అమ్మ ప్రేమకి తులసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కూతురి బుగ్గల మీద కారిన కన్నీరుని తుడిచింది సాగరి.  పక్కన చేరిన నాలుగేళ్ళ చిన్నచెల్లెలు మానసతో కాసేపు ఆడుకుని, అక్కడే అమ్మ మంచం మీద నిద్రపోయింది తులసి.అలిసి నిద్రపోతున్న కూతురి ముఖంలో, తన అమ్మమ్మ పోలికలు కనబడ్డాయి సాగరికి.  అమ్మమ్మ పేరే పెట్టినందుకు, అదే సున్నితమైన వ్యక్తిత్వం, మంచితనం  పుణికిపుచ్చుకుంది తులసి అనుకుంది.    


పెంచి పెద్దచేసిన అమ్మమ్మ తాతయ్యలు గుర్తుకి రాగానే సాగరి మనసులో దిగులు కదలాడింది.. పదిహేనేళ్ళ క్రితం, తోటి ఉపాధ్యాయుడైన డేవిడ్ తో తన ప్రేమని, వివాహాన్ని వ్యతిరేకించారని, వారికి దూరమయిన వైనం గుర్తుచేసుకుంది. తను శ్రద్దగా పెంచుతున్న తులసి మొక్కని మాత్రం తీసుకుని, డేవిడ్ చేయందుకుని గడప దాటిన ఆ నాటి సంఘటన, సాగరి కళ్ళ ముందు కదిలింది. 


ఆమె పెళ్ళాడిన డేవిడ్ విషయానికొస్తే, కుటుంబ నియంత్రణకి వ్యతిరేకి అతను.  బిడ్డలని దేవుని వరాలుగా భావించాలన్నది అతని వైఖరి.  కొన్ని పటిష్టమైన అభిప్రాయాలున్న డేవిడ్ ని ఎందులోనూ ఎదిరించి ఎరుగని సాగరికి, అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలు కూడా ఉన్నాయి.  పిల్లల నామకరణం నుండి, ఆహారవ్యవహారాల వరకు అన్నీ ఆమె ఇష్టానుసారమే.  వారి మధ్యనున్న పరస్పర ప్రేమానురాగాలు, సర్డుకుపోవడాలే వారి కాపురానికి పునాదులుగా సాగిపోతుంది.. 


పద్నాలుగేళ్ళ తులసి,  పదేళ్ళ కవలలు మల్లిక, సాయి, ఆ తరువాత ఆరేళ్ళకి పుట్టిన మానస వారి సంతానం. కవలలు పుట్టినప్పటి నుండీ మాత్రం ఆరోగ్యం సరిలేక టీచర్ ఉద్యోగం మానేసి, ఇంటనే ట్యూషన్లు చెబుతుంది సాగరి.  అయినా, పెరుగుతున్న ఖర్చులు, పిల్లల అవసరాలతో, సంసారం గడవడం కాస్త ఇబ్బందిగానే ఉంది ఆ దంపతులకి...


“డేవిడ్, నీ కాఫీ తాగడం అయ్యాక, బజారుకి వెళ్లి గోధుమ రవ్వ, జీడిపప్పుతో పాటు ఓ చాక్లెట్ కేక్ కూడా తెస్తావా? ఇవాళ లంచ్ కి శాలిని, జోసెఫ్ వస్తారుగా... బైబిల్ స్కూల్ డిబేట్లు గెలిచినందుకు తులసి చేత కేక్ కోయిద్దామని.  ఇక శాలినికి కేసరి ఇష్టం కదా.  తన కోసం కేసరి చెయ్యాలి,” అంటూ అతనికి కాఫీ కప్పు అందించింది సాగరి..


డేవిడ్ వెళ్ళే స్థానిక బాప్టిస్ట్ చర్చ్ కి.... సాగరి కూడా పిల్లల్ని తీసుకుని బైబిల్ క్లాసులకి వెళుతుంది.  ఆ చర్చ్ ముఖ్య నిర్వాహకులు శాలిని, జోసెఫ్ దంపతులతో  మంచి స్నేహం  ఏర్పడింది వారికి.


 “మరో పది నిముషాల్లో వెళతాను గాని, శాలిని అంటే గుర్తొచ్చింది.  చర్చ్ నుండి నిన్ననే లెటర్ వచ్చింది... ఆమె సిఫారసు పై, మన పిల్లల స్కూల్ రిపోర్ట్ కార్డ్స్, నడవడి, స్కూల్లో వారి కార్యకలాపాలు పరిశీలించి, వచ్చే యేడు కూడా ‘స్కాలర్షిప్ ట్రస్ట్’ నుండి వారి చదువుకి ఆర్ధిక సహాయం అందిస్తామని కమిటీ తెలియజేసింది.  


అంటే ఇకముందు కూడా పిల్లలు ముగ్గురూ చర్చ్ స్కూల్లోనే చదువుతారు...ఈ విషయమై, శాలిని, జోసెఫ్ ల   సహాయసహకారాలు వెల కట్టలేనివి. దానికితోడు మన తులసి అంటే ఆవిడకి ఎనలేని అభిమానం కూడా.... కాబట్టి, శాలినికి ఎంతో ఇష్టమైన నీ వెజ్జీ కట్లెట్స్, మిరపకాయ బజ్జీ కూడా చేయి. నేనూ సాయం చేస్తాను,” అన్నాడు కాఫీ తాగుతూ డేవిడ్.... 


“నిజమే, బైబిల్ స్కూల్ డిబేట్లకి, ఈ యేడు నగదు బహుమతులు స్తాపించిందే శాలిని జోసెఫ్ లు.   సంతానం లేని కారణమో ఏమో గాని మన పిల్లల పైన ప్రత్యేక మమకారం వాళ్లకి.  ఇక తులసిని ‘బంగారం’ అని పిలుస్తుంది శాలిని,” నవ్వుతూ డేవిడ్ నుండి ఖాళి కాఫీ కప్పు అందుకుంది సాగరి.


“అయితే, మిగతా ముగ్గురం వెండి, ఇత్తడి, ఇనుమా? మేమూ మీ పిల్లలమే కాదా?” ఫిర్యాదు దోరిణిలో అడిగాడు టి.వి చూస్తూ అమ్మానాన్నల మాటలు వింటున్న సాయి.
“అక్కలా తెలివితేటలు, మంచితనం, మన్నన చూపగానే, మిమ్మల్ని కూడా ‘మేలిమి బంగారాలే’ అంటామురా బడుద్దాయ్,” సాయి తల మీద తట్టి, అక్కడి నుండి కదిలాడు డేవిడ్.
     
చేతిలో పూల గుచ్చాలతో ఇంట్లో అడుగు పెట్టిన శాలిని, జోసెఫ్ లని సాదరంగా ఆహ్వానించారు సాగరి, డేవిడ్.  మధ్య  హాల్లోని  సోఫాల్లో ఆశీనులయ్యాక, తులసిని పిలిచి, పూల గుచ్చం అందించి అభినందించాడు జోసెఫ్.


"మన తులసిలో  దాగున్న ఈ ప్రావీణ్యం ఇలా బయటపడుతుందని ఊహించలేదు. పది బైబిల్ స్కూళ్ళు పాల్గొన్న స్టేట్ డిబేట్లలో అందరి దృష్టిని ఆకర్షించి, నాలుగు వారాల పాటు తన వాగ్ధాటికి గుర్తింపు పొంది, మొదటి స్థానంలో నిలవడం సామాన్య విషయం కాదు," అంది ఆప్యాయంగా తులసి వంక చూస్తూ శాలిని. 


"మేము ఈ రోజు ఇక్కడికి మరో ప్రత్యేక ప్రతిపాదనతో వచ్చాము. మన చర్చ్ సంస్థ నిర్వహించే అమృతవాణి రేడియో కార్యక్రమంలో ‘బాలల బైబిల్ స్టడీ’ భాగానికి, తులసిని వక్తగా ఆహ్వానిస్తూ  ఈ ఉత్తరువు తెచ్చాము,”  అంటూ డేవిడ్ చేతికి కవర్ అందించాడు జోసెఫ్...


“తులసి చదువుకి ఎటువంటి ఆటంకం ఉండదు.. వచ్చేవారం నుండి శనాదివారాలు మాత్రమె రెండేసి గంటలు పనిచేస్తే చాలు.  పారితోషికం కూడా మనకి నచ్చేలా ఉంటుందని హామీ ఇస్తున్నా,” అంటూ పక్కనే కూర్చున్న తులసి భుజం చుట్టూ చేయి వేసింది శాలిని. “చర్చ్ వారు పద్దతిగా మూడునెలలకి ఓమారు నీ జీతం అందజేస్తారు,” వివరించింది ఆ అమ్మాయికి.


డేవిడ్ దంపతులు ఉప్పొంగిపోయారు. కూతురికి  చర్చ్ నుంచి అధికారిక ఆహ్వానం అందడం వాళ్ళకి ఎంతో సంతోషం కలిగించింది.  “తులసికి చేయూతనిస్తూ ఇలా మాకు సహకారాన్ని అందిస్తున్న మీకు కృతజ్ఞతలు,” చేతులు జోడిస్తూ సాగరి.  

 
“అదేమీ లేదమ్మా, తులసిలా  ప్రతిభ  కనబరిచే యువతకి  సహకారం అందించడానికే మా సంస్థ పనిచేస్తుంది.  అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ అమ్మాయి కూడా వృద్దిలోకి రావాలనే మా అభిలాష....,” అన్నాడు జవాబుగా జోసెఫ్...


“సరేగాని, తులసి, ఇరవైవేల రూపాయల బహుమతి నగదుతో ఏం చేయాలని నీ ఆలోచన,” అడిగింది శాలిని...
 “నాకు సైకిల్, మల్లికకి బొమ్మరిల్లు కావాలని, అమ్మకి చెప్పేసాముగా ఆంటీ,” అన్నాడు అప్పుడే హాల్లోకి వస్తూ, ఆ మాట విన్న సాయి,.
“ఔను, మా యువరాజు గారి కోరిక అది... మేము తప్పక తీర్చాలి,” నవ్వుతూ డేవిడ్...
“లేవండి మరి, తులసి చేత కేక్ కోయించి, భోజనం చేద్దాము,” అంటూ అక్కడి నుండి కదిలింది సాగరి. 
          
స్కూలు  విరామ  సమయంలో తులసిని స్టాఫ్ రూమ్‌ కి రమ్మని కబురుపెట్టారు లెక్కల టీచరు వాణి మేనన్. తులసి వెళ్ళేప్పటికి, స్టాఫ్ రూమ్ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారావిడ. తులసి రాగానే, చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళారామె. 
"ఏం లేదు తులసి... నువ్వు లెక్కలు బాగా చేస్తావు కదా. స్కూల్ టైం అయిపోయాక, కాసేపు చిన్న తరగతుల పిల్లలకి లెక్కలు చెబుతావా? మన క్లాస్ రూమ్‍లోనే.. నీకు పారితోషికం కూడా ఇప్పిస్తాను. ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది. ఆలోచించి నీ నిర్ణయం నాకు చెప్పు.." అన్నారు.టీచర్ అడగడం వల్లనే గణితంలో వెనుకబడిన పిల్లలకి  సహాయం చేస్తానని వాళ్ళమ్మని బతిమాలి ఒప్పించింది తులసి. పాఠాలు చెప్పినందుకు డబ్బిస్తారని మాత్రం అమ్మానాన్నలకి చెప్పలేదు. జీతం అందుకున్నాక వారిని ఆశ్చర్యపరచాలని అనుకుంది. 
ఇంటిపనిలో తన తోడ్పాటుకి ఎటువంటి లోపం లేకుండానే, సమర్ధవంతంగా బయట పనులు కూడా చక్కబెట్ట సాగింది ఆ అమ్మాయి.  
                             
ఇటు ‘అమృతవాణి’ రేడియోకి వక్తగా,  అటు స్కూల్లో లెక్కల ట్యూటరుగా ఉత్సాహంగా సాగిపోతుంది తులసి రోజూవారీ జీవనం.  ‘అమృతవాణి’ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఇంచుమించు స్కూల్లో వారందరూ  వింటారు.  


అప్పుడే నెలరోజులుగా సాగుతున్న కార్యక్రమాలతో, మంచి వక్తగా గుర్తింపు పొందింది తులసి. ఇక చేతికి అందబోయే జీతంతో అమ్మావాళ్ళకి, ఇంటికి ఉపయోగపడే కొనుగోళ్ళు చేసి, వాళ్ళని ఆశ్చర్య పరచాలన్న ఆలోచనలో ఉంది ఆ అమ్మాయి.. 
                
సాయంత్రమైంది.  రాత్రి భోజనాల కోసమని వంట చేస్తోంది సాగరి.  పిల్లలు స్కూలు నుంచి వచ్చిన హడావిడితో పాటు హాల్లో ఎన్నడూ లేనంత గొడవగా ఉండడంతో,  మధ్య గదిలోకి వచ్చింది.  


హాల్లోని సోఫాలో కూచునున్న మల్లిక ముఖం కోపంగా ఉంది. అమ్మని చూడగానే, అసహనంగా బిగ్గరగా మాట్లాడసాగింది. "అమ్మా... స్కూల్లో అందరూ అక్క రేడియో ప్రోగ్రాములు, ట్యూషన్ల గురించే మాట్లాడుతున్నారు. ఇకనుండి నేనూ చర్చ్ ప్రోగ్రాములలో పాల్గొంటాను. లేదంటే అసలు నీ మాట వినను," అని గట్టిగా అరుస్తూ పుస్తకాల సంచీని ఓ మూలకి విసిరేసింది. 


"మల్లికా, ఊరికే ఉండు. మన అక్క ఒక వాగుడుకాయ. ఎప్పుడు చూసినా పాడుతూనో, వాగుతూనో ఉంటుంది. పెద్ద తలనొప్పిగా తయారయింది. నువ్వు కూడా అక్కలాగే అవ్వాలనుకుంటున్నావా? వేరే పనేం లేదా," అన్నాడు బూట్లు విప్పుతూ సాయి.  అప్పుడే  లోపలికి వస్తూ ఆ మాటలు విన్న తులసి చిన్నబుచ్చుకుంది.  మల్లిక మాత్రం చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వింది. 


ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ కలవరపాటుకి గురయింది.. ఎలా కట్టడి చేయాలో తోచలేదామెకి. "నోరు మూసుకోండి. తిన్నగా మాట్లాడ్డం నేర్చుకోండి. అక్కని మెచ్చుకోవలసింది పోయి, ఇలా హేళన చేస్తారా? అయినా, మల్లికా... సరయిన పని ఏదన్నా చేస్తానంటే నిన్ను వద్దనేదెవరు? ఏదైనా సులువుగా లభించదు. సాధన చేయాలి. అర్థమైందా..." అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది..


“... సైకిల్ కోసం ఇంకొన్నాళ్ళు ఆగాలి అంటారు,  చేతిలో ఉన్న డబ్బు చాలదు అంటారు. స్కూలుకి ఇక నడవడం నాకు కష్టమే.   వెంటనే సైకిల్ కొనాల్సిందే మమ్మీ,” విసురుగా సాయి...


కోపాన్ని అణుచుకుని, "సరే, ఆ ప్రస్తావన ఇప్పుడు అనవసరం. ఇక వెళ్ళి స్నానాలు చేసి రండి..." అని చెబుతూ వంటింట్లోకి నడిచింది సాగరి.


తెల్లవారింది. తులసి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంది. పెరటి తోటలోకి వెళ్ళి పూజ కోసం పూలు కోసింది.  వాళ్ళమ్మ ప్రేమగా శ్రద్దగా పెంచే తులసివనం లోని తులసి మొక్కలికి నీళ్ళు పోసింది.  దేవుడి గదిని శుభ్రం చేసి, రోజూ చదివే లలితాసహస్ర నామాలు చదువుకుంది. ప్రార్థన పూర్తయ్యాక వంటింట్లోకి వెళ్ళి ఇడ్లీ, పచ్చడి తయారు చేయడానికి ఏర్పాట్లు చేయసాగింది.


అందరూ లేచాక, వంటింట్లో అమ్మకి సాయం చేసి ఉత్సాహంగా స్కూలుకి సాగిపోయింది.

చేతిలో 1500 రూపాయలతో, స్కూల్ అవగానే, ఉత్సాహంగా ఇంటికి బయల్దేరింది తులసి. ఆమె నెల రోజుల పాటు ట్యూషన్ చెప్పినందుకు వచ్చిన డబ్బది. 


ఓ పెద్ద బట్టల కొట్టు... ఆర్.ఎస్. గార్మెంట్స్ లోకి అడుగుపెట్టింది. అమ్మ కోసం పొడవాటి కాటన్ హౌస్‌కోట్ కొంది. డేవిడ్ రోజూ అన్నం తీసుకువెళ్ళే ప్లాస్టిక్ డబ్బా స్థానంలో, ఇంకో షాపులో నాన్న కోసం స్టీల్ లంచ్ బాక్స్ కొంది.  ఇంటికి వెడుతూ దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర ఆగి తమ్ముడు, చెల్లెళ్ళ కోసం జిలేబి కొన్నది.  అందరికీ అన్నీ తీసుకున్నానన్న ఆనందంతో ఇంటి దారి పట్టింది.

ఉత్సాహంగా ఇంట్లో అడుగు పెట్టింది  తులసి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటగది, పూజ గది, పిల్లల గదులు అన్నీ దాటుకుని వాళ్ళమ్మ గదికి వెళ్ళింది. అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిందరవందరగా ఉన్న గదిని కంగారుగా వెతుకున్న సాగరి, సాయి, మల్లిక, కాస్త దూరంలో వాళ్ళని చూస్తూ కూర్చునున్న మానస కనబడ్డారు. 
"అమ్మా, ఏమైంది? ఏం పోయింది?" అని అడిగింది తులసి. అందరూ ఒక్కసారిగా తులసి కేసి, ఆమె చేతిలోని షాపింగ్ బాగ్స్ కేసి చూసారు. 


వాళ్ళెవరూ ఏమీ మాట్లాడక ముందే బయటి నుంచి డేవిడ్ గొంతు వినబడింది. "ఏమర్రా... ఎక్కడున్నారు? సాగరి... మల్లికా... ఒక్కరూ కనబడరే.." అంటూ గదిలోకి అడుగుపెట్టాడు డేవిడ్.  గది పరిస్థితి చూసి, అడుగు వెనక్కి వేసాడు. అక్కడి గందరగోళం చూసి తొట్రుపాటుకి గురయ్యాడు. "ఏమైంది సాగరి? ఏమిటిదంతా?" అడిగాడు విసుగ్గా. 


సాగరి అప్పటికే బెంబేలెత్తిపోయి ఉంది. వణికిపోతూ.. "ఏవండి.. ఇరవై వేల రూపాయలు ఉంచిన కవర్ కనిపించడం లేదండి.. దేవుడి దగ్గర నుంచి తెచ్చి, అప్పుడే బీరవాలో నా బట్టల కింద ఓ మూలకి నేనే పెట్టాను.." అంటూ మళ్ళీ వెతకసాగింది. ఆమె గొంతులో వణుకు చూసి డేవిడ్, తులసి ఇద్దరూ కంగారుపడ్డారు. 
ఇంతలో సాయి వచ్చి తులసి పక్కన నిలుచున్నాడు.


"అక్కా, నువ్వు బయల్దేరే ముందు అమ్మని డబ్బు అడిగావా? లేక బీరువా నుండి తీసావా? నీ చేతిలో ఉన్న సంచులేంటి?" అని అడిగాడు. "లేదంటే, ఆ కవర్‌ని మరెక్కడో పెట్టి అమ్మ మర్చిపోయిందంటావా?" మళ్ళీ సాయి.. అవే ప్రశ్నలని తిప్పి తిప్పి అడుగుతూ తులసి చేతిలోని సంచులని లాక్కోడానికి ప్రయత్నించాడు. 


"అన్నా.. నువ్వు చెప్పిందే నిజం. నీకూ, నాకూ ఏదైనా కొనడం అక్కకి ఇష్టముండదు. అన్నీ తనకే కావాలనుకుంటుంది. అందుకే డబ్బంతా తీసుకుని తనకి కావల్సినవి కొనుక్కున్నట్లుంది...." అంటూ మల్లిక వచ్చి తులసి చేతుల్లోని సంచీలను లాక్కుంది. సాయి, మల్లిక కలసి సంచీలలోని వస్తువులను మంచం మీద పోసారు. 
ఓ కవర్ తోపాటు కొంత డబ్బు, చిల్లర మంచం మీద పడ్డాయి. 


అందరి చూపులూ డబ్బు మీద నుంచి తులసి వైపు మళ్ళాయి. వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు... ఉన్నట్టుండి తులసికి దుఃఖం ముంచుకొచ్చింది. మోకాళ్ళ మీద కూర్చుని ఏడవసాగింది. 


మరో వైపు సాగరి... తాను మోసపోయినట్లు భావించింది. కోపంతో ఊగిపోయింది. తులసి రెక్క పట్టుకుని తన వైపుకి లాక్కుంది. "నీకేమయినా దెయ్యం పట్టిందా? నీ డబ్బు నువ్వే దొంగతనం చేస్తావా? ఎందుకిలా చేసావు తులసి? నువ్వెంతో మంచిదానివని అనుకున్నాను. నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను... ఇలా చేసావేమే.." అని అరుస్తూ, చాచి చెంప దెబ్బ కొట్టింది.


డేవిడ్ తక్షణమే జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసాడు. సాగరి నేల మీద కూలబడి భోరుమని ఏడవసాగింది. 
సాయిని, మల్లికని వాళ్ళ గదికి వెళ్ళమని ఆదేశించాడు డేవిడ్. వాళ్ళు ఆక్కడినుండి కదిలాక, లోపల్నించి గది తలుపులు గడియ పెట్టాడు.

మర్నాడు, ప్రతీ ఆదివారం లానే, ఉదయం ఆరుగంటలకే నిద్ర లేచారు సాయి, మల్లిక. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో స్వేచ్ఛగా తిరగడానికి కూడా భయపడ్డారిద్దరూ.  చర్చ్ కి పెందరాలే వెళ్ళాలి కాబట్టి, ధైర్యం చేసి వంటింట్లోకి నడిచారు. అమ్మ, అక్క హాయిగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ రొట్టెలు తయారు చేస్తున్నారు. రాత్రి అసలేమీ జరగనట్టుగా, ప్రశాంతంగా ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత సాయికి, మల్లికకి తాము చేసిన చపాతీలు, కోడిగుడ్డు కర్రీ కూడా వడ్డించారు. 

చర్చ్‌లో సేవ పూర్తయ్యాక, డేవిడ్, జోసెఫ్ ల కుటుంబాలు... అలవాటుగా తాము వెళ్ళే టిఫిన్ సెంటర్ కి వెళ్ళారు.  టిఫిన్ తినేసి పిల్లలు బైబిల్ స్కూల్‌కి,  మానసని తీసుకుని మగవాళ్ళిద్దరు చర్చ్ పార్క్‌లో వాహ్యాళికి వెళ్ళారు. సాగరి, శాలిని మాత్రమే ఉన్నారక్కడ. 
తను కూర్చున్న స్థానం నుండి లేచి వెళ్ళి సాగరి పక్కన కుర్చీలో కూర్చుంది శాలిని. ఆమె కేసి చూస్తూ "ఏమైంది సాగరి? దిగులుగా కనబడతున్నావు! వర్షించే మేఘాల్లా ఉన్నాయి నీ కళ్ళు. ఏం జరిగింది? " అని ఆప్యాయంగా అడిగింది.  


ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది సాగరికి. ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించింది శాలిని. ఏదో దారుణమైన సంఘటనే జరిగి ఉంటుందని ఊహించింది కూడా.. 
కాసేపటి సంబాళించుకుని, వణుకుతున్న గొంతుతో జరిగినదంతా వివరించింది సాగరి. చేయని తప్పుకి తాను తులసిని  శిక్షించిన వైనం చెప్పుకొచ్చింది. 


"సాయి మాటలకి నేనెలా లొంగిపోయానో నాకే అర్థం కాలేదు. డబ్బు పోయిందనే సరికి కంగారుపడి వాడి మాటలు నమ్మేసాను. ఇంకా దారుణం ఏంటంటే.. అమాయకురాలైన  తులసిని... పాపం... గట్టిగా కొట్టాను. బాగా తిట్టాను.." అంటూ కన్నీరు కార్చింది సాగరి. 
ఇదంతా వింటున్న శాలిని విస్తుపోయింది. చివరికి సమస్య ఎలా పరిష్కారమైందో ఆమెకి అర్థం కాలేదు. 


"డేవిడ్ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేం చేసేదాన్నో.  తులసిని తిట్టకుండా, కొట్టకుండా తెలివిగా ప్రవర్తించారు డేవిడ్. నా నుంచి దూరంగా తీసుకెళ్ళి దాన్ని ఓదార్చారు. తర్వాత మంచం మీద ఉన్న కవర్‌ని తీసి చూసారు. దాని మీద స్కూల్ ముద్ర ఉంది. అందులో ఉన్న డబ్బు లెక్కపెట్టారు. తులసి భుజం మీద చెయ్యేసి, ఆ డబ్బు గురించి అడిగారు." నిట్టూర్చింది సాగరి. 


నీళ్ళు నిండిన కళ్ళతో శాలిని వంక ఓ మారు నిశితంగా చూసిందామె. "అప్పుడు నోరు విప్పింది తులసి.. ట్యూషన్ చెప్పినందుకు తనకి స్కూల్లో 1500 రూపాయలు ఇచ్చారని, మాకు ముందే నిజం చెప్పనందుకు క్షమించమనీ, అడిగింది ఆ చిట్టితల్లి. అలా తను  సంపాదించిన డబ్బుతో మాకోసం కానుకలు తెస్తే.. నేనేమో దాన్ని శిక్షించాను," అంటూ వాపోయింది సాగరి.


సాగరి చెబుతున్నది వినడం మినహా చేష్టలుడిగి మౌనంగా ఉండిపోయింది శాలిని.
“తప్పిదం తెలుసుకుని క్రుంగిపోతున్న నన్ను తల్లిలా దగ్గరికి తీసుకుని ఓదార్చింది నా తులసి. పిల్ల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. కనీసం ఇప్పటి నుంచైనా దానికి ఓ మంచి అమ్మని అవుతాను..." సాగరి బుగ్గల మీద నుంచి కన్నీళ్ళు కిందకి జారాయి. 


తులసి మానసిక పరిస్థితి ఎలా ఉండిఉంటుందో అని ఆలోచించింది శాలిని...
“ఇకపోతే  ఆ  ఇరవైవేల  రూపాయల  కవర్, ఆఖరికి, నా  పరుపు గలేబు లోపల దొరికింది. ఈ పిచ్చి పని చేసింది మాత్రం  సాయి, మల్లికేనని మా అనుమానం.  సందేహమే లేదు. తులసిని ఎలాగైనా తేలిక పరిచి శిక్ష పడేలా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం.." బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంది సాగరి. 


తనకి కూడా  అదే  నిజమనిపిస్తుందని ఒప్పుకుంది శాలిని.  “ఏమైనా నీ కూతురు మేలిమి బంగారం అని  తెలుసుకో సాగరి. నీ తులసివనంలో తులసి మొక్కంత స్వచ్చమైనదని నమ్మకముంచు. ప్రతికూల పరిస్థితులలో వికసించే పుష్పమే అరుదైనది, అందమైనదీ అని ఎక్కడో చదివిన గుర్తు... మన తులసి అటువంటిదే," అంది శాలిని.
ఇంతలో దూరంగా మానస గొంతు వినబడింది. మగవాళ్ళిద్దరూ మానస తో వాళ్ళ  వైపే వస్తూ కనబడ్డారు.                                                         

రచన : కోసూరి ఉమాభారతి