Facebook Twitter
రాతి పులుసు

రాతి పులుసు

 


రష్యన్ సైనికులు ముగ్గురు, ఎక్కడో కొండల్లో ఉన్న సైనిక శిబిరంలో‌ తమ పనులు ముగించుకుని, సెలవుల మీద ఊరికి బయలుదేరారు. అందులో ఒకరు సార్జంట్, మరో ఇద్దరు పీటా, షాషాలు. అట్లా నడిచీ నడిచీ చివరికి అడవిలోంచి బయటపడి, వాళ్ళు ఓ గ్రామంలోకి ప్రవేశించారు. "అబ్బ!‌ మనుషులు ఉండే తావుకు వచ్చాం! ఇంక మనకు చక్కని కాయగూరల భోజనం దొరుకుతుంది! ఊళ్లలో ప్రజలు చాలా మంచివాళ్ళు. మనల్ని చూడగానే వాళ్ళు మనకు స్వాగతం పలికి, వేడి వేడి భోజనం, కడుపు నిండా పెడతారు" అన్నాడు సార్జంట్. నెలలుగా సరైన భోజనం లేక తపించి పోతున్నారు పీటా, షాషాలు. నిజంగానే వాళ్ళ దగ్గర తినేందుకు ఏమీ లేవు. అడవుల్లో కనబడ్డ ఏ జంతువునో‌ పట్టుకొనేందుకు ఒక పెద్ద సంచి, దాన్ని ఉడకవేసుకొని తినేందుకు ఒక పెద్ద గిన్నె తప్ప ఇంక వాళ్ల దగ్గర వేరే ఏమీ లేవు. సార్జంట్ మాటలతో వాళ్ళకు ఆశ పుట్టింది. క్షణాల్లో‌ ఆ ఆశ కాస్తా ఆకలిగా పరిణమించింది.


అయితే వీళ్ళు వెళ్ళే సరికి ఊరివాళ్ళెవ్వరూ బయట రోడ్ల మీద లేరు. వీళ్లని చూసిన వాళ్ళు కూడా కొందరు చటుక్కున కిటికీలు మూసుకున్నారు. అలా వాళ్ళు అనుకున్న స్వాగత సత్కారాలలాంటివేవీ వాళ్ళకు దొరకలేదు. "ఏమీ పర్లేదు. చలి బాగా ఉంది కదా! అందుకని తలుపులు మూసుకున్నారు గ్రామస్థులు. మన రాకను ఎవ్వరూ గమనించి ఉండరు కూడా. వాళ్ళు గనక మనల్ని చూసి ఉంటే ఈ పాటికి మనం వేడి వేడి సూప్ త్రాగుతూ చలి మంట ముందు కూర్చొని ఉండేవాళ్లం!" అంటూ‌ ఒక ఇంటి తలుపు తట్టాడు సార్జంట్. "ఎవరూ?!" అని ఒక స్త్రీ లోపలినుంచి అడిగింది. "అమ్మా! మేము ముగ్గురం సైనికులం. చాలా దూరం నుంచి నడచి వస్తున్నాం. మాకు తినేందుకు కొంచెం ఏమన్నా దొరుకుతుందా?"‌ అడిగాడు సార్జంట్. "అయ్యో, తిండి లేదు. ఈ సారి మా పంట పొలం అస్సలు పండలేదు" అంది ఆ గొంతు. ఇంటి తలుపు కొంచెం కూడా తెరుచుకోలేదు.

 

ఇంకొక తలుపు, మరొక ఇంటి తలుపు తట్టినా తిండి లేదనే‌ చెప్పారు తప్ప, ఎవ్వరూ వాళ్లని లోనికి ఆహ్వానించలేదు, కనీసం కొంచెం వేడి టీనీళ్ళు కూడా పోస్తామనలేదు. "వీళ్లంతా ఎవరో తీవ్రవాదుల తాలూకు అయి ఉంటారు. లేదా సైనికులంటే ప్రేమ లేని సాధారణ ప్రజలైనా అయి ఉంటారు. వీళ్లతో పెట్టుకుంటే మనం ఆకలితో మాడిపోతాం" అన్నాడు షాషా. "కాదు. వీళ్లంతా స్వార్థ పరులు. పేదరికం వీళ్లకు స్వార్థాన్ని నేర్పించింది" అన్నాడు పీటా. "నిజమే అనిపిస్తున్నది. వీళ్ళకి గుణపాఠం చెబుతాను చూడండి.. మన కడుపు నిండాలంటే ఇది తప్పదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఏం జరుగుతుందో చూడండి" అని వాళ్లతో గుసగుసగా ఏదో చెప్పాడు. ఆ తర్వాత అతను ఓ ఇంటి ముందు నిలబడి, లోపలి వాళ్ళకు వినపడేటట్టు గట్టిగా "షాషా, పీటా! మీరు వెళ్ళి మాంచి రాళ్ళు తీసుకురండి.. మనం రాతిపులుసు చేద్దాం!"‌అన్నాడు.


"వావ్! సరే! సరే! మాకు రాతి పులుసంటే చాలా ఇష్టం!" అరిచారు పీటా, షాషాలు. ఆ వెంటనే ఇద్దరూ గట్టి గట్టి అడుగులు వేసుకుంటూ, ఉత్సాహంగా మాట్లాడు-కుంటూ అవతల ఉన్న బయలులోకి వెళ్ళి, కొద్ది సేపట్లోనే మూడు చెట్టు కొమ్మల్ని కొట్టుకొచ్చారు. సార్జంట్ వాటిని ఊరి మధ్యలో త్రిభుజాకారంగా నిలబెట్టి, తాము తెచ్చుకున్న గిన్నెను దానికి కట్టాడు. ఆలోగా వాళ్ళిద్దరూ అటు ప్రక్కగా పారుతున్న మంచినీటి కాలువ నుండి నీళ్ళు, కొన్ని చిన్న రాళ్ళు తీసుకువచ్చి, వాటిని ఆ గిన్నెలో ఒక్కటొక్కటిగా వేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. "చూసావా! ఇదే, నాకు నచ్చేది, రాతి పులుసులో!" అరిచారు అందరూ.


దాంతో ఆ ఎదురుగుండా ఇంట్లో ఉన్న 'డిమిట్రి' ఆనే వడ్రంగికి వీళ్లు తయారు చేయబోతున్న రాతిపులుసు మీద ఆసక్తి పెరిగిపోయింది. "ఏమిటి, చేస్తున్నారు?" తలుపు తీసుకుని బయటికి వచ్చి అడిగాడు వాళ్లని. "మంచి రాతిపులుసు.. నీకు ఏ రకం ఇష్టమో చెప్పు" అడిగాడు సార్జంట్. "రాతి పులుసా? మేము ఎప్పుడూ‌ వినలేదే దాని గురించి?!" ఆశ్చర్యపోయాడు డిమిట్రీ. "వినలేదా? ఊరుకోండి! రాతి పులుసంటే తెలీని సైనికుడే ఉండడు. అంత రుచికరమైన వంటకం మీకు తెలీకపోవటమేమిటి?" అన్నాడు సార్జంట్, డిమిట్రీకి తన ప్రక్కన కూర్చునేందుకు చోటు చూపిస్తూ. ఆలోగా పీటా, షాషాలు ఇద్దరూ గిన్నెలో నీళ్ళు పోసి, దాని కింద మంట పెట్టారు. "రండి, రుచికరమైన రాతిపులుసు రుచి చూడండి మాతో పాటు" అని డిమిట్రీకి, అక్కడే తమ ఇళ్ళ ముందు నిలబడి 'వీళ్ళు ఏం తయారు చేస్తారు' అని ఆసక్తిగా చూస్తున్న మరో ఇద్దరు గ్రామస్థులకీ చెప్పాడు సార్జంట్. అంతలో ఉడుకుతున్న నీళ్లలోంచి ఒక చిన్న రాయిని తీసి నోటిలో వేసుకుని, "అబ్బా ఈ విధమైన రాళ్ళు చాలా‌ రుచికరంగా ఉంటాయి!" అని చెప్పాడు షాషా.

 

"ఓ మంచి గరిటె తీసుకురా, పులుసును బాగా‌ కలపాలి. కలిపితే వచ్చే పులుసు రుచి భలే ఉంటుంది" తన ప్రక్కనే కూర్చున్న డిమిట్రీకి చెప్పాడు సార్జంట్. డిమిట్రీ చటుక్కున లేచి ఇంట్లోకి వెళ్ళి గరిటె తెచ్చి ఇచ్చాడు. వీళ్ళ హడావుడి విని, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా వచ్చి చుట్టూ కూర్చున్నారు. అందరూ రాతిపులుసును గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. "మంచి వాసన వస్తోందా?" అడిగాడు సార్జంట్. గిన్నెకు దగ్గరగా మొహం పెట్టి "చాలా మంచి వాసన వస్తోంది"‌ చెప్పాడు షాషా. "ఒక ఉల్లిపాయ వేస్తే రాతిలోని మరింత రుచిని, వాసనను ఉల్లి బయటకు తెస్తుంది." నవ్వుతూ చెప్పాడు సార్జంట్. "మా ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి ఆగండి" అంటూ పరుగెత్తుకెళ్ళి రెండు పెద్ద ఉల్లిపాయలు తెచ్చి ఇచ్చింది ఓల్గా అనే ఆవిడ.


"చాలు! ఇవి చాలు! ఇక రాళ్ళలోని వాసన మొత్తం తగులుతుంది ముక్కుకు!" అన్నాడు సార్జంట్, గట్టిగా వాసన పీలుస్తూ. అతన్ని చూసి అందరూ ముక్కులు గట్టిగా పీల్చారు. పాషా కూడా గట్టిగా వాసన పీల్చి. "బాగుంది బాగుంది" అని సర్టిఫై చేసాడు. ఒక నిముషం తర్వాత "క్యారెట్ వేస్తే మంచి ఆరోగ్యం, పులుసుకు మంచి రంగు వస్తుంది కూడా" అన్నాడు కూడా. "దానిదేం భాగ్యం. నా దగ్గర క్యారెట్లు ఉన్నాయి ఆగండి-" అంటూ ఆన్నా అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి క్యారెట్లు తెచ్చింది. "చాలు! చాలు! ఇక రాతి పులుసుకు చక్కటి రంగు వస్తుంది. చూసారా! అప్పుడే కొద్దిగా రంగు మారింది?!" అంటూ గిన్నెలోని నీళ్లను గరిటతో ఎత్తి పోసాడు సార్జంట్. "ఒకటో, రెండో ఆలుగడ్డలు తగిలితే పులుసుకు నిండుదనం వస్తుంది" చెప్పాడు పీటా, సమయం చూసుకొని.

 

"మా ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయండి" అంటూ మార్యా అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆలుగడ్డలు తెచ్చింది. "మీరు కూడా ఇక్కడే ఉండి రాతి పులుసు రుచి చూడాలి"‌ అని మార్యాతో అన్నాడు పీటా. అవి కొంచెం ఉడికాక "అయ్యో!‌ ఆలుగడ్డలు రాతిలోని సువాసనను అడ్డుకుంటాయి కదా! ఇప్పుడు కొన్ని మాంసపు ముక్కలు వేస్తే చాలు- రాతిపులుసు మహా రుచిగా వస్తుంది" అన్నాడు సార్జంట్. "మా ఇంట్లో కొన్ని మాంసపు ముక్కలు ఉన్నాయిలే, తెస్తాను ఆగు" అని మాంసపు ముక్కలు తెచ్చాడు డిమిట్రి. అప్పటికే అక్కడికి చేరిన మరికొంతమంది గ్రామస్థులు రాతి పులుసునీ, డిమిట్రి సహాయాన్నీ పొగిడారు. రాళ్ళతో పాటు ఉల్లిపాయలు, క్యారెట్, ఆలుగడ్డలు, మాంసపు ముక్కలు ఉడికి నిజంగానే అక్కడంతా మంచి వాసన రాసాగింది.


"మీ గ్రామంలో పులుసు తయారు చేయడానికి పనికొచ్చే రుచికరమైన రాళ్ళు ఉన్నాయి. మీ అదృష్టం, వాటితోటి మీరంతా అప్పుడప్పుడూ రాతిపులుసు చేసుకోవచ్చు- ప్రస్తుతం ఈ పులుసు త్రాగడానికి పాత్రలు తెచ్చుకోండి" అని చెప్పారు సార్జంట్, షాషా. "మేమింత వరకూ ఇంత రుచికరమైన పులుసు ఎప్పుడూ తాగలేదు" అంటూ డిమిట్రీ, ఓల్గా, ఆన్నా లతో పాటు మరో నలుగురు గ్రామస్థులు పులుసు ఇష్టంగా తాగారు. వాళ్లకంటే ఇష్టంగాను, ఆకలిగాను త్రాగారు ముగ్గురు సైనికులూనూ! అట్లా కడుపు నిండాక, రాతిపులుసుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సైనికులు ముగ్గురూ ఇంటి బాట పట్టారు.


- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో