Facebook Twitter
ఓ బొజ్జ గణపయ్యా...!

ఓ బొజ్జ గణపయ్యా...!


ఓ బొజ్జగణపయ్య మా తప్పులుగాయవయ్య

అలవిగాని హామీలు గుప్పించి గద్దెనెక్కాము

అంతుబట్టదెట్టో తప్పించుకు తిరుగుమార్గము

అప్పుబట్టైనా పూజకు పసిడి ఉండ్రాళ్ళు పెట్టెదము!

దండునెట్టా అణచిపెట్టాలో దండమెడతాజెప్పు

గండమును దాటించి అండగా నువ్వుండు

మందుబాబుల సెక్యూరిటీబాండుల తాకట్టులెట్టైనా

గండు గండుగా లడ్డూలు బాండీలకొద్ది పెట్టెదము!

గడప గడపాకాడ చిటపటాలె టపటపాలె

గడివుదీరేదాక ప్రజల గమ్మునుంచే త్రోవజూపు

గంటగంటకో కుల కార్పొరేషన్మీద లోనుబట్టైనా

గంపలకొద్దీ పత్రి కొండెత్తు కాదు నింగెత్తు పెట్టెదము!

తప్పులెన్నోజేసి అప్పుదెచ్చుకు మ్రింగాలి

తప్పులుగాచు పైవాడి కరుణ కరగనివ్వకప్పుడే

తప్పుత్రోవన కాకిలెక్కలుజూపి ఋణంబట్టైనా

తప్పులెంచకు వడపప్పు బొబ్బట్లు బోలెడు పెట్టెదము!

కాసుల కేసులగొస కంటికునుకుకు కినుకయ్యేను

కాస్తయినా నిఘానేత్రాల చల్లనిదృష్టి కురచవ్వనీయకు

కాష్టందాక రాష్ట్రంలో సమస్తం బ్యాంకులకు కొదవలెట్టైనా

కాంతులీడు మల్లెమందారలు కోట్లపుట్టెడ్లు పెట్టెదము!

--రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!