Facebook Twitter
జ్ఞాన జ్యోతి!

జ్ఞాన జ్యోతి!

మదిన వెలుగులుబూయగ 
జ్ఞానదివ్వెలెలుగగ 
తమస్సునుద్రోలునట్లుగ 
మధుర వేణుగానంజేయి మాధవా!

ద్వాపరమున అవతరించి 
పలు దుర్గుణముల
తిమిరాంధకాసురుల జంపితీవు 
ఫల్గుణ సారథీ నీవు!

మనస్సున మైలనెరుగక 
సద్గుణములనొదలి అజ్ఞానులమై
దురహంకారులమై మెలుగుతూ
నరకాసురలయితిమిపుడు!

పాత్రన బొట్టుజమురు నీరంతా గప్పినటు 
నిశిపొరగప్పు మనస్సులనా సాంతం
జ్ఞానజ్యోతులు దగిలి తామసం దొలుగునటు
ఇపుడీ తేజోమయ వేణువూదు మురళీలోలా!

మా హృదయక్షీరమును జిలికి
నిశాంధగరళమును జంపి
అమృతజ్యోతులెలిగించ
మురళిని మ్రోగించవయ్యా నల్లనయ్యా!

నీరాధ నీప్రకృతిని పంచభూతాలను
ప్రాణమున్న ప్రతిజీవినీ ప్రేమించ
పరవశమ్ముగా పలికించుము
శ్రీకృష్ణా పిల్లనగ్రోవినీ కృష్ణాష్టమిన!


-- రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!