Facebook Twitter
కవంటే ?

కవంటే ? 

 

వాడంతే
ప్రతి దాన్ని భూతద్దంలోనూ
ప్రతి భావాన్ని ఒకద్దంలోనూ
మరిన్నిటిని సరికొత్త అర్ధాలలోను
వెతుకుతాడు
తన్మయత్వాన్ని 
నువ్వు చదివే కళ్లలో
వెతుకుతుంటాడు


అన్యాయాన్ని ఎదురిస్తాడు
అందాన్ని ఆరాధిస్తాడు
ఆక్రందనకు మరిన్ని గళాల్నిస్తాడు
ఆవేదనను ఖడ్గాలుగా మార్చేస్తాడు
వాడితో వాడు
వాదించుకుంటాడు
చర్చిస్తాడు
విమర్శించుకుంటాడు


ఓటమో , గెలుపో తెలియక
తన వేలి తలతో గీసుకున్న
కొన్ని రాతలను మీ ముందుంచుతాడు
వాడికీ ఉంటాయ్
సంతోషాలు
ఇష్టాలు,కష్టాలు
నష్టాలు,అరిష్టాలు
లెక్కేముంది వాడికి


సంతోషంలో కూడా బాధను
బాధలోనూ సంతోషాన్ని
నిజంలోని అబద్దాన్ని
అబద్దమనిపించే నిజాల్ని
ఏరతాడు!


చిన్న పిల్లాడు తీరంలో వెతికే గవ్వల్లా
తొలిపొద్దు కూసే గువ్వలా..!
వాడికీ ఏడుపొస్తది
కాకపోతే కన్నీటిని అక్షరాలుగా రాలుస్తాడు
కాగితపు చెంపలపై!
నవ్వుతాడు


మీరు చదివినప్పుడు మీ పెదాలపై
భావుకతలా!
వాడే కవి.....!!!
నిశ్శబ్దపు సడులను వినే చెవి
రాత్రి కూడా మేల్కొనే రవి!!!!
నీ వాడే కవి!!
వాడు మాత్రమే "కవి"..!!!!!

 

-రఘు ఆళ్ల