Facebook Twitter
తెలుగు గొప్పదనానికి 9 సాక్ష్యాలు..

తెలుగు గొప్పదనానికి 9 సాక్ష్యాలు..

 


 


01 - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలని ద్రవిడ భాషలంటారు కదా! వీటన్నింటిలోనూ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే! దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య మూడో స్థానం. ఇక ప్రపంచవ్యాప్తంగా పదిహేనవ స్థానం.
 
02 - తెలుగు అన్న పేరు ఎలా వచ్చిందో చెప్పడం కష్టం. కానీ దీని వెనుక రెండు వాదనలు మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. కాళేశ్వరం, శ్రీశైలం, భీమేశ్వరం అనే మూడు లింగాల మధ్య ఉన్న ప్రదేశంలో వినిపించే భాష కాబట్టి, త్రిలింగ అన్న పేరు తెలుగుగా మారింది అన్నది మొదటి వాదన. తెన్‌ అంటే ద్రవిదభాషలో దక్షిణం అని అర్థం. మనం దక్షిణాన నివసిస్తాం కాబట్టి తెనుగువారం అయి ఉంటామన్నది రెండో వాదన. తేనెలూరే భాష కాబట్టి తెనుగు అయ్యిందన్నది సాహిత్య అభిమానుల నమ్మకం.
 
౦౩ - తెలుగు భాష ఒకటి కాదు రెండు కాదు... దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఉందని అంటున్నారు. అయితే అప్పటికి అది ఇంకా అభివృద్ధి దశలో ఉండి ఉండవచ్చు. కానీ 2500 సంవత్సరాల నాటికి దాన్ని ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుని ఉంటారు. అప్పటి నాణేల మీదా, కావ్యాలలోనూ తెలుగు పదాలు కనిపించడమే దీనికి ఉదాహరణ. 2,200 సంవత్సరాలకు పూర్వం హలుడు ప్రాకృత భాషలో రాసిన గాథసప్తశతిలో సైతం తెలుగు పదాలు విస్తృతంగా కనిపిస్తాయి.
 
04 - మహాభారతంలోనూ, రుగ్వేదంలోనూ ఆంధ్రుల ప్రసక్తి ఉన్న విషయం తెలిసిందే! భారతానికి ముందు రామాయణంలో సైతం తెలుగు ఉండే ఉంటుందని ఓ ఆలోచన. శ్రీరాముడు సీతమ్మను వెతుక్కుంటూ మన మార్గం గుండానే పయనించాడని అంటారు. ఆ సమయంలో జటాయువు పడిపోయిన చోటుని చేరుకున్నాడు. అక్కడ సీతమ్మ కోసం పోరాడి నేలకొరిగిన జటాయువుని చూసి ఆయన ‘లే పక్షి’ అన్నాడనీ... అదే తర్వాత కాలంలో లేపాక్షి అయ్యిందని ఓ నమ్మకం.
 
05 - తెలుగులోని ప్రతి పదమూ అచ్చుతో అంతమవుతుంది. అలా అచ్చుతో అంతమవుతుంది కాబట్టి దీన్ని అజంత భాష అంటాము. చాలా కొద్ది భాషలు మాత్రమే ఇలా అచ్చుతో అంతమవుతాయి. వాటిలో ఇటాలియన్ ఒకటి. అందుకే ఇటలీ యాత్రికుడు నికొలో మన భాషను ‘ఇటాలియన్ ఆఫ్‌ ద ఈస్ట్‌’గా అభివర్ణించాడు.
 
06 - మన దేశంలో తెలుగువారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక ఈమధ్య కాలంలో అమెరికాకి తెలుగువారి వలసలు ఎక్కువగా సాగాయన్న విషయమూ తెలిసిందే! కానీ మలేసియా, ఫిజి, మారిషస్, సౌదీ అరేబియా, మయమ్నార్‌ వంటి దేశాల్లోనూ తెలుగువారి సంఖ్య గణనీయంగానే ఉంది. వీరే కాకుండా శ్రీలంక వంటి కొన్ని ప్రదేశాలలోని ఆదిమజాతివారు తెలుగు మాట్లాడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
 
07 - తెలుగు, సంస్కృతం అంత ప్రాచీనం కాకపోవచ్చు. అక్కడ ఉద్భవించినంత సాహిత్యం ఇక్కడ పుట్టి ఉండకపోవచ్చు. కానీ తెలుగు కావ్యాలు సంస్కృతానికి ఏమాత్రం తీసిపోవు. మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి… ఎటు చదివినా ఒకేలా తలపించే కావ్యాలు; ఒకే కావ్యంతో రెండు రకాల అర్థాలను స్ఫురింపచేసే ద్వర్థి కావ్యాలు; ఒకే ఒక్క అక్షరంతో మొత్తం పద్యమే రాసేయడం… తెలుగుకి ప్రత్యేకం. ఇక తెలుగులో ఉన్నన్ని జాతీయాలు, సామెతలు మరే భాషలోనూ ఉండవని కూడా అంటారు.
 
08 - ఇక ప్రపంచలో సంస్కృతం, తెలుగు రెండే రెండు భాషలలో కనిపించే అవధాన ప్రక్రియ గురించి చెప్పుకోకుండా తెలుగు చరిత్ర సంపూర్ణం కాదు. ఒకప్పుడు సంస్కృతంలో కనిపించి అదృశ్యం అయిపోయిన ఈ ప్రక్రియను తెలుగు కవులు ఇంకా నిలబెట్టుకు రావడం గొప్ప విశేషం. తిరుపతి వేంకట కవుల దగ్గర నుంచి గరికపాటి నరసింహారావు వరకు అవధాన ప్రక్రియను సజీవంగా ఉంచుతూనే వస్తున్నారు. ఎనిమిది మంది దగ్గర నుంచీ వేయి మంది వరకు పృచ్ఛకుల సమస్యాలను పూరిస్తూ సాగించే ఈ అవధాన ప్రక్రియ నిషిద్ధాక్షరి, దత్తపదీయం, ఘంటానాదం వంటి సమస్యలతో మరింత జటిలంగా మారుతుంది.  ఆ సాహితీ యుద్ధంలో విజేతగా నిలిచే అవధాని తెలుగు భాష కీర్తి పతాకను మరింతగా రెపరెపలాడిస్తాడు.
 
09 - ఇదీ మన తెలుగు గురించి కొన్ని విశేషాలు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగు అని పొగిడినా, దేశభాషలందు తెలుగులెస్స అని రాయుడు కొలిచినా… తెలుగులోని ఈ ప్రత్యేకతలకు ముగ్థులయ్యే కదా! అలాంటి తెలుగుని సామాన్య ప్రజానీకానికి చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు, సురవరం ప్రతిపరెడ్డివంటివారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. గ్రంథాలలో ఉండే భాషని కాదని, అందరూ మాట్లాడుకునే వ్యవహారిక తెలుగుని ప్రచారం చేయడంలో వారు సఫలం అయ్యారు కాబట్టే… తెలుగు ఇప్పటికీ ఉజ్వలంగా వెలుగుతోంది.
 


- నిర్జర.