Facebook Twitter
నటరాజుకు నతులు

నటరాజుకు నతులు

 

     తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని నటరాజ మూర్తి అని అయ్య పలు సభల్లో చెప్పేవారు. ప్రకృతిలోని ఆకాశ తత్వానికి ప్రతీకగా కొలువైన చిదంబరేశ్వరుని నాట్యానికి కూడా జగత్తు యావత్తూ ముగ్ధమౌతూనే  ఉంది. చిదంబరేశ్వరుని  తాండవ  విశేషాల గురించీ,  శివతత్వాన్ని గురించీ, కొంతైనా   తెలుసుకోవాలన్న తపన అప్పటినుంచీ ఇప్పటిదాకా నన్ను వదలని అన్వేషణే !!

 

   చిత్ అంటే చైతన్యము. అంబరము అంటే ఆకాశము. చైతన్యాకాశంలోనికి ఆత్మ చేరుకోవటమనే అంతిమ ప్రయాణానికి సూచనగా యీ క్షేత్రం వెలసిందంటారు.     

      శివుని నాట్యాలు మూడు విధాలు. పరమ శివుని ప్రదోషకాల నాట్యంలో సరస్వతి వీణావాదనం చేస్తుంది. ఇంద్రుడు వేణువునందుకుంటాడు. బ్రహ్మ తాళం వేస్తాడు. లక్ష్మి గానం చేస్తుంది. విష్ణువు వాద్యం  మృదంగం. మృడానీపతి నాట్య హేలను చూసేందుకు, గంధర్వ, యక్ష, పతగ, ఉరగ, సిద్ధ, సాధ్య, విద్యాధర, అమర, అప్సరసలందరూ యీ అపురూప దృశ్యాన్ని సంబరంగా వీక్షించి తరించేందుకై కైలాసానికి తరలి వెళ్తారు.  అసలీ ప్రదోషమంటే యేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం, ఇది  ఒక కాల విశేషo.  యీ సమయంలో దోషనివారణ అవుతుంది కాబట్టే యీ సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ వేళలో చంద్రుని కదలికల వల్ల యేర్పడేదే ప్రదోష ముహూర్తం. అంటే  సూర్యాస్తమయ వేళ యేర్పడే  తిధుల సంధి కాలంలో ప్రదోషమేర్పడుతుంది. సూర్యుడు అస్తమించటానికి ముందు మూడు ఘడియలు (ఒక ఘడియ అంటే మన పరిగణనలో, 24 నిముషాలు), తరువాత  మూడు ఘడియల కాలం,  అంటే మొత్తం ఆరు ఘడియల కాలం. ప్రత్యేకించి, ద్వాదశి వెళ్ళి త్రయోదశి  నాడు యేర్పడే ప్రదోషవేళ  మహా ప్రదోషం. దీనికి చాలా ప్రభావముంటుందట ! (జ్యోతిష్యం ప్రకారం,  కాల, దోష దంపతుల తనయుడు ప్రదోషుడు. నిషిత, వ్యుస్థ అతని సోదరులు.ఈ మూడు పేర్ల అర్థం, మొదలు, మధ్య చివర - అని..! ద్వాదశి వెళ్ళి త్రయోదశి ప్రవేశించే ఘడియలనే ప్రదోష కాలం అంటారు.)    సూర్యాస్తమయ వేళ, అర్ధనారీశ్వరునిగా, పరవశత్వంలో హిమాలయ సానువులపై, కాశీ మొదలైన దివ్య క్షేత్రాలలోనూ, శివ తాండవ హేలవతారునిగా నృత్యం చేయటముంది. . నిరాకార పరమాత్మ, ఆనందం కోసం  రూపాన్ని ధరించి, ఆనందతాండవం చేస్తాడని నృత్తరత్నావళి అంటున్నది.

 

ఈ నృత్యాన్ని వీక్షించేందుకు, దేవతాసమూహమంతా, కైలాసానికి  చేరుకుంటారు,   కాబట్టి ఆ సమయంలో శివార్చన చేస్తే, అందరు దేవతలనూ అర్చించిన పుణ్యం దక్కుతుంది. రెండుచేతులతో నాట్యమాడుతున్న శివునికి ప్రధాన దేవతలందరూ వాద్య, గాన  సహకారమందించే శిల్పాలు లభ్యాలు. శివుని పాదాల కింద అసురుడు మాత్రం కనిపించడు.   ఈ సమయంలో పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిస్తూ,   ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపు పార్వతి,  రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనంఅర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.కోర్కెలను నియంత్రించగల్గటం  ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించగల్గటం రెండవది. ఈ ప్రదోష కాలంలో  స్కాంద పురాణంలోని  శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించటం వల్ల సకల పాపాలూ హరిస్తాయన్నది తరతరాల విశ్వాసం.

 

ఏనార్చయంతి గిరిశం సమయే ప్రదోషే, ఏనార్చితం శివమపి ప్రణమంతి చాన్యే,

ఏతత్కథాం శృతిపుటైర్నపిబంతి మూఢా:  తే జన్మజన్మ సు భవంతి నరా: దరిద్రా:

ఏవై ప్రదోష సమయే  పరమేశ్వరస్య కుర్వంత్యనన్య మనసోంఘ్రి సరోజ పూజాం,

నిత్యం ప్రవృద్ధ ధన ధాన్య కళత్ర పుత్ర, సౌభాగ్యసంపదధికాస్థ ఇహైవలోకే: (2)

కైలాసశైల భువనే త్రిజగజ్జనిత్రీ గౌరీం నివేశ్య కనకాంచిత రత్న పీఠే

నృత్యం విధాతుమభివాంచతి శూలపాణౌ దేవాం ప్రదోష సమయేన భజంతి సర్వె. (3)

వాగ్దేవీ ధృత వల్లకీ శతమఖో వేణుం దధత్ పద్మజం,

స్తాలోన్నిద్రకరా రమా భగవతీ గేయ ప్రయోగాన్వితా

విష్ణో: సాంద్ర మృదంగ వాదన పటు: దేవా: సమంతా స్థితా:

సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీపతిం..(4)  
 
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య  విద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ    

యేన్యే త్రిలోక  నిలయా: సహ భూత వర్గా: ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థా: (5)

అత: ప్రదోషే శివ ఏక యేవ  పూజ్యో ధనాన్యే హరి పద్మజాధ్యా:

తస్మిన్ మహేశే  విధినేజ్యమానే విధినోజ్యమానే  సర్వే ప్రసీదంతి సురాధినాధ. (6) 

 

       నీలకంఠ దీక్షితులవారు (17 వ శతాబ్ది కి చెందిన నీలకంఠ దీక్షితులు, అప్పయ్య దీక్షితుల వంశానికి చెందినవారు, మదురై తిరుమల నాయకుల ఆస్థానంలో కొలువు.  కామాక్షీ దేవి  ఉపాసకులు. వారు చేసిన ఎన్నో రచనల్లో  యీ రచనసుప్రసిద్ధం.) తన 'ఆనంద సాగరస్తవం'లో శివలీలను వర్ణిస్తూ, ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసే ఈ శ్లోకం లో అంటారు.....

                         “శ్లో!! సాధారణే స్మరజయే  నిటిలాక్షి సాధ్య   
                               భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్

                               వామాంఘ్రి  మాత్ర కలితే జనని త్వదీయే
                               కా వా  ప్రసక్తి రపి   కాలజయే పురారే!!

 

        ఈ శ్లోకార్థమిలా ఉంది.   ' అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు  మాత్రమే  చెందుతుంది. తల్లీ ! యెందుకో  నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం ఇవ్వబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా?  కానీ యిక్కడ పరమేశ్వరునకే ఇవ్వబడింది.  అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగాయముణ్ణి తన వామపాదంతో అణచాడు.   వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”

 

     ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని  యీ రూపంలో స్మరించినప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.

 

   ఇక రెండవది తాండవము. భైరవ లేదా వీరభద్రుని రూపంలో శివుడు,  శ్మశాన  భూమిలో తన దేవేరితో కలిసి,  యీ నాట్యంలో పదితలలతో  భయద గంభీరంగా నర్తిస్తాడు.ఎల్లోరా, ఎలిఫెంటా, భువనేశ్వర్ శిల్పాల్లో యీ నాట్య భంగిమలున్నాయి.  శైవ, శాక్త సంప్రదాయాల్లో యీ నాట్యవిస్తృత వర్ణన వున్నది.  శైవ, శాక్త సంప్రదాయాల్లో యీ నాట్య విస్తృత వర్ణన వున్నది.

 

    ఇక చివరిది నాదాంత నాట్యం.చిదంబర సువర్ణ సభలో (విశ్వానికి కేంద్ర స్థానంగా అభివర్ణితమిది) శాస్త్రీయ రూపమైన లింగాకారంలో కాక, మానవాకారంలో సర్వాలంకార భూషితుడైన  నటరాజు, నృత్యానికి భాష్యకారునిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రాచుర్యంలో వున్న స్థల పురాణం కూడాఆసక్తిమంతం.ఈ ప్రాంతంలోని చెలమ చేరుకుని వున్న  తిల్లై వనాలలో (ఇప్పటి పరిభాషలో, చిక్కగా అలముకుని ఉన్న మాన్ గ్రూవ్ అడవులనవచ్చు)మంత్రశాస్త్రాన్ని  మీమాంసా శాస్త్రాన్ని ఆపోసన పట్టిన ఋషులంతా బృందాలుగా ఉండేవాళ్ళు.  భగవంతుని క్రతువులు, మంత్రాలతోనియంత్రించగలమనే అంతులేని అహంకారమున్న వారిని పరీక్షించే లీలా వినోదం కోసం సాధారణ యాచకునిగా శివుడు, ముగ్ధ మనోహర మోహినీరూపంలో విష్ణువు వెంటరాగా ఆ అడవుల్లో సంచరించటం మొదలెట్టాడు. అతని నాట్య చాతుర్యానికి తమ పత్నులు సంభ్రమానికి లోనవటంచూసిన  ఋషులు, కోపోద్రిక్తులై, ఆ మాయా యాచకునిపైకి ఒక భయంకరమైన పులిని తామే సృష్టించి పంపగా, శివుడు దాన్ని తన చిటికెన వ్రేలితో సం హరించి,దాని చర్మాన్ని ధరించాడు. ఋషుల ఆవేశం కట్టలు తెంచుకుంది.

 

ఒక విషం కక్కే మహా నాగమును సృష్టించి అతనిపైకి పంపగా,దాని కోరలను పీకివేసి, శివుడు మెడలో భూషణంగా ధరించాడు. ఋషులీసారి త్మ శక్తి యుక్తులంతా ధారపోసి, గర్వాన్నీ, అహాన్నీ నింపి, ముయూలకుడన్నే మరుగుజ్జు రాక్షసుణ్ణి సృష్టించి శివునిపైకి పంపగా, అతని వెన్నుపూసపై  తన పదాన్ని మోపి, కదలకుండా అణచివేసి, ఆమహాశివుడు, తన తాండవాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఋషులకు అవగతమైంది, యీ యాచకుడు, సాధారణ యాచకుడు కాదనీ, సర్వ జగత్తునూ తన కను సన్నలలో నడిపించి నర్తింపజేసే పరమ శివుడన్న వాస్తవం. ఇతనిముందు యెంతటి  మంత్ర శాస్త్రమైనా , తంత్రవిద్యలైనా  ప్రభావ రహితాలన్న రహస్యం తేటతల్లమవగా, పాదాక్రాంతమయ్యారందరూ. 

 

      ఈ పౌరాణిక గాధ ఆధారంగా, వెలసిన తాండవ శివుని భంగిమ వర్ణనాతీతం. తల చుట్టూ విస్తరించిన జటలు,  బుసలు కొట్టే నాగ సమూహాలకూ, ఉవ్వెత్తున యెగసిపడుతున్న గంగా తరంగాలకూ ప్రతీకలు. అర్ధ చంద్రుడూ ఆ జటల్లో తొంగి చూస్తుంటాడు. కసింద పత్రముల (ఆంగ్లంలోకాసియా) దండ తల చుట్టూ ప్రకాశవంతమౌతుండగా, కుడి చెవిలో పురుషుల ఆభరణమూ ఎడమ చెవిలో స్త్రీల ఆభూషణమూ ధరించి, కంఠాభరణాలూ, భుజానికి వంకీలూ, నడుముకు వడ్డాణమూ, పదాలకు గజ్జెలూ, వ్రేళ్ళకు మెట్టెలూ ధరించి, నడుము చుట్టూ బిగుతైన దట్టీ, ఉత్తరీయమూధరించిన మూర్తి. నాలుగు చేతుల్లోని పై కుడి చేత (జీవి పుట్టుకను సూచించే) డమరుకమూ , క్రింది  చేతిలో అభయ ముద్ర, యెడమ వైపున్న చేతుల్లోని పై  చేతిలో (దుష్ట శక్తుల వినాశనానికి సూచనగా) ప్రజ్వరిల్లుతున్న అగ్ని,మరో చేయి పాదాల కింద అణచివేయబడిన అహంకారఆసురీవృత్తిని సంకేతంగా చూపిస్తూ అలరారుతుంటుంది.

 

మూర్తి వెనుకనున్న కాంతి వలయం(తిరువాశి)  విశ్వానికి సూచన. విశ్లేషణకు అందని మరెన్నో అంతరార్థాలున్న యీ మూర్తి,  (బ్రహ్మ, విష్ణు,  రుద్ర, మహేశ్వర, సదాశివుల కర్తవ్యాలను సూచిస్తూ) పంచకృత్యాలైన సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహాలను సూచిస్తున్నది. సృష్టి స్థితి లయకారుడై, ఆదిమధ్యాంత రహితుడై, విశ్వాంతరాళాలంతటా నిండి సర్వ వ్యాప్తునిగా సకల జీవుల యోగక్షేమాలనూ మూడు కన్నులతోనూ కనిపెడుతూ, అత్యంత రహస్యాత్మక రూపంతో పరమేశ్వరునిగా అలరారుతున్న ఆ మహాకాలుడు,  మనసారా ఒక్కసారి పిలిస్తే, తనపరతత్వ రూపాన్నిసైతం మరచి, మరు నిముషంలో ప్రత్యక్షమయ్యే పరమ కరుణాళువుగా వినుతి కెక్కిన,  భక్తవశంకరుడు.  ఆతనిదయా పారీణతను వేనోళ్ళ కొనియాడిన భక్తకవులెందరో ఉన్నారు. సుందరర్, తిరునీలా కంఠరర్, అప్పర్, కన్నప్ప మొదలైన తమిళ నాయనార్లు, పాల్కురికి సోమనాధుడు, అక్కమహాదేవి, బసవేశ్వరుడు వంటి కన్నడ కవులు,శ్రీనాధుడు, ధూర్జటి వంటి తెలుగు కవులందరి రచనల్లోనూ, శివ భక్తి పరవళ్ళు తొక్కింది. వారందరి మనోమందిరాల్లో వెలసిన ఆ భర్గుని భవ్య రూపాన్ని వర్ణించాలంటే మరెన్నో గ్రంధాలను వ్రాయవలసి వస్తుంది. . 

      చిదంబరంలో వెలసిన నటరాజ మూర్తి  నాట్యాన్ని మనోనేత్రంతో వీక్షించి పరవశమంది,  సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులవారు,   తమ  కేదార  రాగ కీర్తనలో, చిదంబరేశ్వరుని ,భాను కోటి కోటి సదృశునిగా, భుక్తి ముక్తి ప్రద దహరాకాశ (హృదయకమలంలో ఉన్న చిదాకాశం) భూషితునిగా, దీనజన సం రక్షణచణునిగా, నవనీత హృదయ సదయునిగా  అభివర్ణించారు.  అట్టి నటేశ్వరునికి చేమోడ్పు.  . 

కనుబొమల కదలికల కార్ముకమ్ములు జెదుర 
వెనుదిరుగు మేఘముల వ్రేలిముద్రలు గుదుర
అధరముల కదలికల యరుణోదయము విరియ
మదన మథనమ్ములో మార్మికతలే గురియ
కర పల్లవములందు కారుణ్యమే మురియ
విరియబూసిన యటుల విరజాజి తా గురియ
నటనలను దిలకించు నగజ నవ్వులు జింద 
బుటుకు బుటుకని జటల 'బుణ్య' భంగిమలంద 
ఆడెలే బరమాత్మ పాడులే బ్రతియాత్మ
ఆడెలే బరమాత్మ పాడులే బ్రతియాత్మ  


రచన డా. పుట్టపర్తి నాగపద్మిని