Facebook Twitter
శంఖారావం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌థ‌

 

 


హమ్మయ్య  ఎన్నాళ్ళకి నాకు ఇష్టమైన బెర్త్ దొరికింది. 
సూట్ కేసు సీటు కిందకి తోసి అవతలి వైపు సీటు కూడా సరిచేసి కాళ్ళు జాపుకుని సెటిల్ అయాను. తరచుగా ప్రయాణాలు చేయవలసిన ఉద్యోగం నాది.  నాకు సాధారణంగా ఆర్ ఏ సి తప్ప కన్ఫర్మ్  బెర్త్ దొరకడం చాలా తక్కువ. కారణం ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే నువ్వు వెంటనే వైజాగ్ బ్రాంచ్ కి వెళ్ళాలి.

“శ్రీకాంత్ అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది.... ఇవాళ రాత్రికే ప్రయాణం అవు”  అంటూ ఉన్న పళంగా వెళ్ళమని ఆజ్ఞలు జారీ చేస్తాడు మా డైరెక్టర్.. ఆయన నోటి నుంచి ఎప్పుడు వస్తుందా ఆజ్ఞ అని ఎదురుచూస్తూ ఉండే నేను ఆయన మాట పూర్తికాకుండానే మరో బ్యాగ్ సర్దుకుని సిద్ధం అవుతాను. 

“ఒక పండగ, పబ్బం, పిల్లల పుట్టినరోజులు, మన పెళ్లి రోజు ఏమి ఉండవు.. ఎప్పుడూ ఈ క్యాంపు లేంటి? మీరే ఉన్నారా ఆఫీసులో ... వేరే వాళ్ళని పంపమని చెప్పచ్చుగా" అంటుంది నా భార్య అసహనంగా. 

"నాకా సెంటిమెంట్స్ ఏమి లేవు.. ఉన్నా అన్నీ కాదని మా డైరెక్టర్ ఆజ్ఞ పాటించడం నా కర్తవ్యం కదా!"  అంటాను నన్ను నేను మోసం చేసుకుంటూ. 

భారతదేశంలో ఉన్న మా బ్రాంచెస్‌కి తరచూ ప్రయాణం చేస్తూ ఉండడమే నా ఉద్యోగం.. నా వృత్తి ధర్మం...అందులో ఉండే లాభాలు బోలెడు.. అవన్నీ ఆవిడకి ఏం తెలుసు? నా చేతినుంచి రూపాయి ఖర్చు లేకుండా అన్ని ఊళ్లు చూడచ్చు... టి.ఏ., డి.ఏ పేరుతో వచ్చే డబ్బు వెనకేసుకోవచ్చు.. అన్నిటికీ మించి బాస్ దగ్గర మంచి పేరు కొట్టేసి అందరికన్నా ముందు ప్రమోషన్ కొట్టచ్చు. 

ఇన్ని లాభాల మధ్య ఉన్న ఇబ్బంది ఒకటే.. ఎప్పుడూ నేను కోరుకున్న బెర్త్ దొరకదు. తత్కాల్ లో రిజర్వ్ చేసుకునే సమయం కూడా ఉండదు కాబట్టి భోగాలు ఆశించకుండా దొరికిన దానితో తృప్తిపడి ఎలాగోలా ప్రయాణం చేయాల్సిందే. అయినా కోరుకుని ఈ పదవిని పొందినప్పుడు భోగాలు దేనికి? నాకు భోగాలకన్నా కావాల్సింది స్వేచ్ఛ‌.. నాకు కావాల్సినట్టు బతకడానికి ఎవరి అడ్డు లేని స్వేచ్ఛ‌.. అందుకే కోరి, కోరి, అడ్డు వచ్చిన వాళ్ళని తోసి, తొక్కి ఈ పదవి దక్కించుకున్నాను. 

ఇది కూడా అలాంటి ప్రయాణమే.. "పండగ ఇంకా రెండు రోజులు.. మీరు ఇప్పుడు క్యాంపు కి వెళ్ళకపోతే నష్టం ఏమిటి? పండగ పూట భార్యా, పిల్లలతో ఉండనీకుండా ఇంకోసారి ఇలాంటి ఆజ్ఞలు జారీ చేయకుండా మీ డైరెక్టర్ కి ఒక స్ట్రాంగ్ క్లాస్ పీకుతాను..” అంటూ రుస,రుసలాడిన నా శ్రీమతి మాటలు నన్ను ఆపలేదు.  ఆవిడ మాటలు ఎప్పటిలాగే పెడచెవిన పెట్టి మా ఆఫీస్ బాయ్ ని టికెట్ కోసం పంపిస్తూ మరీ, మరీ చెప్పాను.. 'సైడ్ లోయేర్ కావాలి... ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ టికెట్ కోసమే ప్రయత్నం చేయి' అని.. నా అదృష్టం బాగుంది నేను కోరుకున్నదే దొరికింది. 

సైడ్ లోయర్ బెర్త్ అంటే ఇష్టం ఉండడానికి ఒక కారణం ఉంది.  నిశ్చింతగా కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు. పడుకోవచ్చు. మధ్య, మధ్య లేచి కూర్చుని కిటికీలోంచి  జారిపోతున్న దృశ్యాలు చూడచ్చు. లేదంటే తలగడాలు నడుం వెనక పెట్టుకుని దర్జాగా కూర్చుని పుస్తకం చదువుకోవచ్చు. అన్ని విధాలా నాకు  స్వేచ్చని, స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ఆ సీటు దొరకడం అంటే మామూలు విషయం కాదు.. ఆర్ ఏ సి లో టికెట్ తీసుకుంటే, కన్ఫర్మ్ చేసినప్పుడు ఆ సీటు ఇస్తాడు టి సి. అది కూడా అదృష్టం బాగుంటేనే.. కానీ మా వాడు ఏం చేసాడో, ఎలా పట్టాడో నాకు కోరుకున్న  సీట్ దొరికింది.  ఇవాళ నా అదృష్టం పండినట్టే.. ఓ విశాలమైన సామ్రాజ్యాన్ని గెలిచి సింహాసనం అధిష్టించినట్టు ఉంది.  బ్యాగ్ లో నుంచి చిప్స్ పాకెట్ తీసి పారవశ్యంతో తినసాగాను. ఇంకా బండి కదలలేదు. వాచీ చూసుకున్నాను... ఇంకో పది నిమిషాలుంది కదలడానికి. 

చాలా మంది ఎక్కుతున్నారు.. వాళ్ళ వెనక సెండాఫ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కి పరామర్శలు చేస్తూ అడ్డంగా నిలబడ్డారు.  వాళ్ళని దాటుకుంటూ సూట్ కేసులు లాక్కుంటూ వస్తున్న వాళ్ళు  “ బాబూ కొంచెం తప్పుకోండి “ అంటూ మర్యాదగా కొందరు,  “ ఏందయ్యా...ఇట్లా అడ్డం నిలబడితే ఎక్కేవాళ్ళు ఎట్లా ఎక్కుతారు”  అంటూ దబాయించే వాళ్ళు  కొందరు వాళ్ళని అదిలిస్తుంటే, "సరేలే....జాగ్రత్త... నేను దిగుతున్నాను" అంటూ ఒక్కొక్కరే వారి, బంధువులు, స్నేహితుల దగ్గర సెలవు తీసుకుని దిగుతున్నారు. మొత్తానికి చాలా గొడవ, గొడవగా ఉంది కంపార్ట్ మెంట్ .. “ ఎలా ఉంటే నాకేం నేను హాయిగా, సుఖంగా ఉన్నాను”  అనుకుంటూ సన్నగా హమ్ చేస్తూ చిప్స్ తినసాగాను.

నాకు డబ్బు ఖర్చు పెట్టడం కన్నా, దాచుకోడం ఇష్టం... కానీ మా ఆవిడకి డబ్బు కనిపిస్తే ఖర్చు పెట్టిందాకా నిద్రపట్టదు. 'చిన్నదానికి పుట్టిన రోజుకి జూకాలు చేయించాలి... పెద్దది పెద్ద మనిషి అయే వయసు వచ్చింది... నెక్లస్ చేయించాలి.. మా తమ్ముడి పెళ్లి.. కనీసం పదివేలన్నా వాడికి చదివించాలి.. నా సూత్రం గొలుసు పెరిగింది.. మార్చాలి... దీపావళికి నాకు పట్టుచీర కావాలి... మిక్సీ పాడైంది మార్చాలి.. కొత్త సోఫా కొనాలి'... ఇలా అనేక వంకలతో ప్రతి నెలా అదనపు ఖర్చులు పెట్టిస్తూ వేయి రూపాయలు కూడా బ్యాంక్ లో ఉండనివ్వదు. అందుకే ఆవిడకి కనిపించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాను... అయినా ఖర్చులు తప్పవు. అది వేరే విషయం... చిప్స్ తినడం అయింది.. బిస్కట్ పాకెట్ తీయబోతూ టైం చూసాను. ఇంకా నాలుగు నిమిషాలుంది ట్రైన్ కదలడానికి.

ప్రయాణీకులు ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. నా పక్కన ఉన్న త్రీ టైర్ బర్త్ లో ఒకమ్మాయి విండో సీటులో  కాలు ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద పెట్టుకుని కూర్చుని  మొబైల్ లో వీడియో చూస్తోంది.. ఒక నలభై ఏళ్ల వ్యక్తీ హడావుడిగా వచ్చి ఆ అమ్మాయిని తెచ్చిపెట్టుకున్న సహనంతో కాలు తీయమని చెప్పి మరోవైపు విండో సీటు దగ్గర స్థిరపడ్డాడు. వాళ్ళు కాక మరో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒక డెబ్భై ఏళ్ల వృద్ధుడు, ఒక కుర్రాడు. ఆ కుర్రాడు గబుక్కున అప్పర్ బెర్త్ ఎక్కి పడుకుని మొబైల్ ఆన్ చేసాడు. 

అప్పుడు ఎక్కారు వృద్ధ దంపతులు. ఆయాసపడుతూ వచ్చి చేతుల్లో ఉన్న ఎయిర్ బ్యాగులు కింద పెట్టి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని అటు, ఇటూ చూస్తూ వాళ్ళ బెర్త్ ల కోసం వెతుక్కుంటూ..  వాళ్ళ బెర్త్ నెంబర్  చూసుకుని ఇదే మనది అని ఒకరికి ఒకరు చెప్పుకుని చేతుల్లో ఉన్న బ్యాగులు సీటు కిందకి తోసి అయిష్టంగా కూర్చుని అటూ, ఇటూ చూడసాగారు కూర్చున్నారు. వాళ్ళతో పాటు ఇంకో వ్యక్తీ వచ్చి నా దగ్గరకు వచ్చి "అప్పర్ బెర్త్ నాది సార్ కాలు తీస్తారా" అన్నాడు. చచ్చినట్టు జాపుకున్న కాలు కొంచెం ముడుచుకుని అతనికి కూర్చోడానికి ఎంతో ఉదారంగా చోటిస్తున్నట్టు ఫీలయాను.  నా సుఖంలో కొంత అంతరాయం కలిగినందుకు మనసులోనే ఆ వ్యక్తిని తిట్టుకోకపోతే ఎలా? 

ట్రైన్ కదిలింది. ఆయాసం తీర్చుకున్న వృద్ధ  జంటలో ఆయన ఒక్కసారి అందరినీ కలయచూసాడు.  ఆయనకి డైబ్భై ఏళ్ళు ఉంటాయి. ఆవిడకి అరవై దాటాయి.. అందరి వైపు చూసి ఆయన నిట్టూర్చడం స్పష్టంగా కనిపించింది. నెమ్మదిగా రైలు వేగం పుంజుకుంది.  ఆ భార్యాభార్తలు ఒక విధమైన టెన్షన్తో చూస్తున్నారు అందరినీ. తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ  ఏవో సైగలు చేసుకున్నారు.. ఆవిడ ఏదో  గొణిగింది. 

ఆయన నెమ్మదిగా మర్యాదగా విండో దగ్గర కూర్చున్న యువతిని చూస్తూ అడిగాడు  "నీదే బెర్త్ అమ్మా...". ఆ అమ్మాయి ఐ ఫోన్ లోంచి తలెత్తకుండా "లోయర్" అని  చెప్పింది. ఆయన భార్యవైపు చూసాడు. ఆవిడ అడగండి అన్నట్టు తలాడిస్తూ సైగ చేసింది. ఆయన మొహమాటంగా అడిగాడు ఆ అమ్మాయిని ... "నీకు అభ్యంతరం లేకపోతే పై బెర్త్ మీదకి వెళ్తావా.. ఆంటి పైకి ఎక్కలేదు.."

వాళ్ళిద్దరి హావభావాలు చూస్తుంటే నాకు అర్థం అయిపొయింది ఇలాంటిదే ఏదో ఉంటుందని.. ఆ అమ్మాయి ఏమంటుందో అని ఆసక్తిగా చూసాను. 
ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా అంది  “మా ఆయన  లోయర్ బెర్త్ కోసం నెల రోజుల ముందు బుక్ చేసారు.”   ఆ మాటల్లో ఇవ్వను అని వినిపించిన శబ్దానికి ఆయన మౌనంగా ఉండిపోయాడు. 

ఆవిడ కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. ఆయన ఓదారుస్తున్నట్టు ఆవిడ చేయి మీద చేయి వేసాడు. ఆవిడ మళ్ళి ఏదో గొణిగింది ... ఆయన తలూపుతూ  దాదాపు తన వయసే ఉన్న  ఇంకో వ్యక్తిని  చూసాడు. “నాకు డెబ్భై  ఏళ్ళు పైకి ఎక్కలేనండి.” అన్నాడాయన నిస్సహాయంగా. 
ఆయన “ఫర్వాలేదండి” అన్నాడు. 

ఇప్పుడు ఇంకో వైపు విండో సీటు వ్యక్తి వంతు అనిపించింది నాకు.. అన్నట్టే అయింది.. అతను కొంచెం అసహనంగా చూసి “ దొరక్క, దొరక్క దొరికింది నాకు లోయర్ బెర్త్... సారీ సార్" అన్నాడు. 

ఆయన తీవ్రమైన ఆశాభంగం తో ఆవిడ వైపు చూసాడు. “ టికెట్ ఇచ్చే వాళ్లకి ఆ మాత్రం బుద్ధి, జ్ఞానం ఉండదా.. మనం వయసు కూడా రాస్తాము కదా కాగితంలో ఎలా ఇస్తాడు అప్పర్ బెర్త్” అంది ఆవిడ గట్టిగా..

“మనం ఆలస్యంగా టికెట్ బుక్ చేసుకున్నాం తప్పు మనది... వాళ్ళు ఏం చేస్తారు” అన్నాడు ఆయన నా వైపు చూసి. 

నా గుండె దడ, దడ లాడింది.. నెక్స్ట్ బకరా నేనే అనుకుంటూ పని ఉన్నట్టు మొహం తిప్పుకుని మొబైల్ లోకి చూడసాగాను.  'ఇప్పుడు వీళ్ళు కచ్చితంగా నన్ను అడుగుతారు.. నాకు తెలుసు.. ఎందుకంటే వాళ్లిద్దరి  తరవాత నాదే లోయర్ బెర్త్.. అయ్యో.. దొరక్క, దొరక్క దొరికిన స్వర్గం.. వాళ్ళ కోసం త్యాగం చేసేంత ఉదార హృదయం నాకు లేదు.. త్యాగం పేరుతో  నా ఎంజాయ్‌మెంట్ ఎలా వదులుకోను! ఊహు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు'.. గట్టిగా నిర్ణయించుకున్నా.  

ఆ అమ్మాయి వాళ్ళాయన మీద నెపం నెట్టింది. మధ్య వయసు వ్యక్తీ నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పాడు. నేను రెండూ చేయలేను.. నేను ఎవరిమీద నెపం  నెట్టాలి! అబద్ధం చెప్పాలి.. అదేం పెద్ద విషయం కాదు నాకు.. కాకపొతే గోడ కట్టినట్టు ఉండాలి కదా!  ఆలోచిస్తుంటే వచ్చింది ఒక ఐడియా.. వావ్ అని  నన్ను నేనే అభినందించుకుంటూ అలా మొబైల్ లోకే చూస్తూ కూర్చున్నా.. పాపం నా వాలకం గమనించాడేమో ఆయన తటపటాయించాడు. కానీ అవసరం ఆయన మొహమాటాన్ని, ఇబ్బందినీ పక్కకి తోసేసింది.. 

సీటు అంచు దగ్గరకు జరిగి కొంచెం నా వైపు ఒంగి  సంకోచంతో పిలిచాడు  “బాబూ! ”  

కెమెరా ఆన్ అయింది.. నేను యాక్షన్ మొదలుపెట్టాలి..  ముడుచుకున్న కాలు అతి బలవంతంగా కొంచెం కదిల్చి, బాధ కళ్ళల్లో ప్రదర్శిస్తూ మొబైల్ లో నుంచి తలెత్తి  “చెప్పండి” అన్నాను.

ఆయన నా వైపు ఆందోళనగా చూస్తూ “అయ్యో ఏమైంది బాబూ అలా ఉన్నారేం ” అన్నాడు.

నేను బాధ పళ్ళ బిగువున నొక్కి పట్టి అన్నాను.. “నిన్న ఆఫీస్ కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయిందండీ. పెద్దగా దెబ్బలు తగల్లేదు కానీ, కాలే కొంచెం వాచింది .. అందుకే" అబద్ధం గోడ కట్టినట్టు ఉండాలి కదా.. అని నా ప్రతిభ చూపించాను. 

“అయ్యో పాపం ఇలాంటి స్థితిలో ప్రయాణం వాయిదా వేసుకోకపోయావా మరి ” పెద్దవాడిగా సలహా ఇచ్చాడు.

“ఆఫీస్ పనండి తప్పదు ...” అన్నాను నిజాయితీకి నేనే ప్రతినిధిని అనే భావం వ్యక్త పరుస్తూ. 

“అయ్యో! అలాగా... సరేలే సరిగా కూర్చో... ఇబ్బంది పడకు" అంటూ సరిగా సర్దుకుని కూర్చున్నాడు. 

ఆవిడ ఏదో అన్నట్టు పెదాలు కదిలాయి.. “ పాపం ఈ కాలం పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఉద్యోగాలు అలాంటివి..” సానుభూతిగా అన్నాడు.  ఆవిడ కూడా సానుభూతిగా నా వైపు చూసింది. 

ప్రయాణం సాగుతోంది. రైలు వేగంగా సాగిపోతోంది.. మైదానాలు, పెద్ద పెద్ద చెట్లు, మధ్య, మధ్య కాలవలు.. అన్నీ కదిలిపోతున్నాయి కాలం లాగా. సంధ్య  వెలుగులో  రైలు  ఎక్కాను... చీకటి పడింది. ప్రయాణీకులు అందరూ వెంట తెచ్చుకున్న ఆహరం పొట్లాలు విప్పారు.. నా ఎదురుగా ఉన్న అతను నా ఓవర్ యాక్షన్ చూడలేకనేమో తన బెర్త్ ఎక్కేసాడు. హమ్మయ్య హాయిగా కాలు జాపుకున్నాను. 

అందరూ పాకెట్లు విప్పి భోజనాలు కానిచ్చారు.  ఆవిడ మూడు పేపర్ ప్లేట్స్ తీసి ఒక దాన్లో నాలుగు పూరీలు, కూరా వేసి ఆయనకీ ఇచ్చింది.. ఆయన ఆ ప్లేట్ నా వైపు జాపి "తిను బాబూ" అన్నాడు.. నా గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది.. 

“వద్దండి నేను ఆల్రెడీ ఆర్డర్ చేసాను వస్తుంది” అన్నాను మరో అబద్దం చెబుతూ. 

“పర్లేదు తిను” అన్నాడు మళ్లీ ఆయన. 

అప్పుడే నా పాలిట ఆపద్బాంధవుడిలా వచ్చాడు బాయ్ ... "డిన్నర్ సార్ ... డిన్నర్”  అంటూ.

దగ్గరకు పిలిచి నెమ్మదిగా చెప్పాను  బ్రెడ్ ఆమ్లెట్ తీసుకురమ్మని.

ఆయన ఆ ప్లేట్ లో పూరీ తినడం మొదలు పెట్టాడు.. ఆవిడ కూడా మరో ప్లేట్ లో పెట్టుకుని తినసాగింది. లోయర్ బెర్త్ శాల్తీలు ఇద్దరూ గబ, గబా తినేసి పక్కన కూర్చున్న వాళ్ళంతా వారి, వారి మిడిల్, అప్పర్ బెర్త్ లకు ఎప్పుడు వెళ్తారా అన్నట్టు చూడసాగారు. వాళ్ళిద్దరూ తినడం  పూర్తీ చేసి చేతులు కడుక్కుని వచ్చారు. ఆవిడ అన్నీ సర్దేసి బ్యాగ్ సీటు కిందకి తోసింది.

ఆయన పక్కన కూర్చున్న పెద్దాయనతో కబుర్లు మొదలు పెట్టాడు.. “ఎక్కడికి వెళ్తున్నారు?”

“ మా అబ్బాయి వైజాగ్ లో ఉంటాడు.. నేను హైదరాబాద్ లో అమ్మాయి దగ్గర ఉంటాను...అబ్బాయి  ఉగాదికి రమ్మని ఫోన్ల మీద ఫోన్ లు.. అమ్మాయికి, అల్లుడికి సెలవు దొరకలేదు.. ఒక్కడినే బయలుదేరాను. మీరు?” అడిగాడు ఆయన. 

“ హైదరాబాద్ లో మేమిద్దరమే ఉంటామండి.. మాకు మగపిల్లలు లేరు.. ఒక్కతే అమ్మాయి.. వాళ్ళాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లో పెద్ద ఉద్యోగం.. ఎప్పటి నుంచో రమ్మని పోరు ఇద్దరూ.. సరే పండగ వస్తోంది కదా అని బయలుదేరాము.. టికెట్ తెచ్చేవాళ్ళు సమయానికి ఎవరూ దొరకలేదు.. నేనే తిప్పలు పడి వెళ్లి రిజర్వ్ చేయించాను. అప్పటికే ఖాళీలు లేవని ఒకటి మిడిల్, ఒకటి అప్పర్ ఇచ్చాడు..”  అంటూ మిడిల్ బెర్త్ వైపు చూసాడు. 

“నాకూ అంతే మిడిల్  బెర్త్ ఇచ్చాడు.. ఏం చేస్తాం ... కాస్త వాకింగ్ అదీ చేస్తాను కాబట్టి కానీ లేకపోతే నాదీ మీ పరిస్థితే. ఓ పని చేయండి.. నేను మీ బెర్త్ తీసుకుంటాను.. మీరు మిడిల్ బెర్త్ తీసుకోండి”  అన్నాడు. 

“ అయ్యో మీకూ ఇబ్బందేగా .. పర్లేదండి.. ఎక్కుతాను” అన్నాడు ఆయన.

“నాకేం ఇబ్బంది లేదు.. పాపం మీరు పైకి ఎక్కలేరు అక్కడ పడుకోండి."

వాళ్ళిద్దరూ సమవయస్కులు కాబట్టి ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకుంటున్నారు... నాకేంటి.. బహుశా మిగతా వాళ్ళు కూడా నాలాగే అనుకుంటున్నారు కాబోలు ఏమి మాట్లాడడం లేదు. 

ఆవిడకి నిద్ర వస్తున్నట్టుంది. ఆవలిస్తూ ఆయన వైపు చూసింది. “ పడుకుంటావా! ఎక్కు... సాయం చేస్తాను” అన్నాడు ఆయన. ఆవిడ మళ్ళి ఒక్కసారి లోయర్ బెర్త్ ల వైపు ఆశగా చూస్తూ బలవంతంగా మిడిల్ బెర్త్ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆయన ఆవిడకి సాయం చేసి అత కష్టం మీద ఎక్కించాడు.

లోయర్ బెర్త్ వాళ్ళ మొహాల్లో అసహనం గుర్తించారేమో పెద్ద మనుషులు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకుని వాళ్ళ బెర్త్ ల మీదకు వెళ్ళిపోయారు. లోయర్ బెర్త్ శాల్తీలు హమ్మయ్య అనుకుంటూ దుప్పట్లు పరిచారు.  

ఆ ముగ్గురినీ చూస్తుంటే నాకు కొంచెం జాలి అనిపించినా ఆ జాలిని నిర్దయగా  పక్కకి నెట్టేసి నా లోయర్ బెర్త్ కి ప్రమాదం తప్పిందని ఆనందిస్తూ హాయిగా బ్రెడ్ ఆమ్లెట్ తినేసి పడుకున్నాను. అందరూ బెర్త్ లలో స్థిర పడ్డాక లైట్స్ ఆఫ్ చేసారు. 

తెల్లవారింది.
రైలు లాస్ట్ స్టేషన్ విశాఖపట్నంలో ఆగింది. అందరూ వారి, వారి లగేజ్ తీసుకుని దిగి వెళ్లిపోయిందాకా పెద్ద వాళ్ళు ముగ్గురూ ఎదురుచూస్తూ కూర్చున్నారు. 

నేను లేచి కూర్చున్నాను.  వాళ్ళ ముందు నుంచి దిగానంటే నా అబద్ధం బయట పడుతుంది.. అందుకే నేనూ అలాగే కూర్చున్నాను. అందరూ దిగిపోయారు.. పెద్దవాళ్ళు ముగ్గురూ బ్యాగులు పట్టుకుని లేచారు. నేను కూడా ఒంగి సీటు కింద బ్యాగు తీసుకోబోయాను. దెబ్బ తగలని కాలు నటించలేక కొంచెం తిరగబడింది.. పడబోయాను.  పెద్దాయన గబుక్కున నన్ను ఆపి ఒంగి తను నా బ్యాగ్ తీసిచ్చాడు. “జాగ్రత్త బాబూ.. నెమ్మదిగా దిగు.. సాయం చేయమంటావా ”  అన్నాడు.  

చెళ్ళున కొట్టినట్టు అనిపించింది... అపరాధభావనతో   “థాంక్ యూ అండి ఒద్దు.. నేను దిగుతాను.”  అన్నాను.

ఆయన చిరునవ్వు నవ్వి “రావే" అంటూ ఆవిడ చేయి పట్టుకుని ఎంట్రన్స్ వైపు వెళ్ళిపోయాడు. రెండో పెద్దాయన ముందుకు నడుస్తూనే ఒకసారి తలతిప్పి నా వైపు చూసి ముందుకు సాగిపోయాడు. ఆ చూపులో నాకేవో అర్థాలు కనిపించి కొంచెం ఉలిక్కిపడ్డాను.  అది కూడా కొన్ని క్షణాలే.. నా భార్య దగ్గర రక,రకాల నటనలు ప్రదర్శించే నాకు ఇదో లెక్కా! 

ఆఖరుగా నేను  ఊపిరి పీల్చుకుని బ్యాగు  పట్టుకుని నిటారుగా నిల్చుని దర్జాగా  రైలు దిగాను. ఒకసారి చుట్టూ చూసి, చక చకా ప్లాట్ ఫారమ్మీద నడవసాగాను. 

"నెమ్మదిగా నడువు... అల్లుడు వచ్చే ఉంటాడు.. సామాను అలా పక్కన పెట్టి ఫోన్ చేద్దాం" ఆయన స్వరం..
ఆయాసపడుతూ ఆవిడ  “రండి ఇలా ఆగుదాం" అంటూ ప్లాట్ ఫాం వైపు నడిచింది. ఉలిక్కిపడ్డాను.. ఇంత జనంలో గుర్తు పట్టరులే అనుకుంటూ కొంచెం వేగం పెంచాను నడకలో. 

ఆవిడ స్వరం వినిపించింది.. “ ఆ నడిచి వెళ్తున్నది ఆ కుర్రాడే కదండీ.. కాలికి దెబ్బ తగిలిందన్నాడుగా.. బానే నడుస్తున్నాడే..” 

“పడుకుని లేచాడుగా సర్దుకుందేమో ... ఆ, ఆ జాగ్రత్త నెమ్మదిగా నడువు.. ఆ బ్యాగ్ కూడా ఇలా ఇవ్వు నువ్వు మోయలేవు.”

“ఆ.. మీరు మోస్తారు .... పెద్ద బలవంతులుకదూ! పదండి  ఇంటికెళ్ళి రెండు మాత్రలు మింగితే అన్నీ తగ్గుతాయి” 

భార్యాభర్తల అనుబంధానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి?  డెబ్భై ఏళ్ల వయసులో కూడా భార్య నిస్సహాయతని భర్త, భర్త నిస్సహాయతని భార్య గమనించుకుంటూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, సహాయం చేసుకుంటూ, ఒకరి కష్టాన్ని మరొకరు స్వీకరిస్తూ బరువులు మోస్తూ, బాధలు పడుతూ సాగించిన సుదీర్ఘమైన జీవితం ... 

నా చెవుల్లో పదిహేనేళ్ళ క్రితం నా చేత పెళ్లి పీటల మీద పురోహితుడు చెప్పించిన ధర్మేచ, మోక్షేచ, అర్ధేచ నాతి చరామి మంత్రాలు ఎకోలో వినిపించసాగాయి.. నా స్వార్ధం,  ఎవరెలా పోయినా నేను బాగుంటే చాలు అనుకునే అమానవీయత నా ముందు వికృతమైన రూపాలతో నిలబడ్డాయి. 

పుట్టిన దగ్గర నుంచి నా జీవితంలో అబద్ధం చెప్పడం ఒక హాబీ అయింది. అమ్మకి, నాన్నకి చెప్పిన అబద్ధాలు ఒకటా! రెండా! పాలు పారబోసి తమ్ముడు పారబోసాడని అబద్ధం చెప్పాను. నాన్న జేబులో పదిరూపాయలు తీయడం తమ్ముడు చూసాడని నాన్నకి వాడే తీసాడని చెప్పాను. ఆ రోజు నాన్న వాడిని కొడుతుంటే నిస్సహాయంగా వాడు చూసిన చూపు నాకు గుర్తు ఉండి ఉంటే! గుర్తు లేదు కాబట్టే.. ప్రతి వాళ్లకి, ప్రతి నిమిషం అబద్ధం చెబుతూ బతికాను. అబద్ధం నా జీవితంలో ఒక భాగం అయిపొయింది. 

ఆఫీస్ లో నా బాస్ కీ అబద్ధం చెప్పాను. నేను తప్ప మరొకరు తరచూ కాంప్ కి వెళ్ళే అర్హత లేనివాళ్ళు అని ఆయనలో నా పట్ల ఒక గొప్ప అభిప్రాయం కలిగించాను. దాని వల్ల కలిగే లాభాలు ఏమున్నా అవి నాకు మాత్రమే దక్కాలన్న స్వార్ధం.. వృత్తిలో ఇవన్నీ సర్వసాధారణం కావచ్చు. కానీ తాళి కట్టిన భార్యని మోసం చేసాను. 

భార్యంటే అర్థం తెలుసా నాకు.. ఎన్నో సార్లు, ఎన్నో విషయాల్లో తనకి అబద్ధం చెప్పాను. మోసం చేసాను.. ఎప్పుడూ తను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం తప్ప ఆమెని సంతోషపెట్టే పని ఎప్పుడూ చేయలేదు.  ఆరోజు పెళ్లి పీటల మీద పురోహితుడు మంత్రాలు చెప్పిస్తుంటే  చెప్పిస్తుంటే వాటి అర్థం తెలియకపోయినా చాలా యాంత్రికంగా, మొక్కుబడిగా  చెప్పాను.. అరుంధతి నక్షత్రం అదిగో చూడు అంటే కనిపించకపోయినా "చూసాను" అని అబద్ధం చెప్పాను. మొదటి రాత్రి ఆమె చేతిలో పాయసం గ్లాసు అందుకుని మొత్తం తాగేసి, “అదేంటండి చెరిసగం తాగమన్నారు అత్తయ్యగారు.. మీరు మొత్తం తాగారేంటి” అని ఆమె బిక్కమొహం వేసి అడిగితే “ అవునా! నాకు తెలియదు.. మొత్తం నాకే అనుకున్నాను” అని సునాయాసంగా అబద్ధం చెప్పాను. అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపొయింది. అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం కదా!

ఇంత మందిని మోసం చేసిన నాకు  ఆ దంపతులను మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదు కదా..! అందుకే ఆ దంపతులను కూడా మోసం చేసాను. నేను మోసం చేశానని వాళ్లకి తెలియదా! తెలుసు.. కానీ, ఆ మాట అనకపోవడం వాళ్ళ సంస్కారం. 

నా పాదాల నుంచి మొదలైన సిగ్గు, పశ్చాత్తాపం, అపరాధభావన తలదాకా విద్యుత్ పాకినట్టు పాకాయి. అబద్దాలతో, మోసాలతో నేను అపురూపంగా, పదిలంగా  కాపాడుకున్న నా స్వేఛ్చ నన్ను చూసి వికటంగా నవ్వింది. ఉన్నట్టుండి నా కాళ్ళల్లో శక్తి సన్నగిల్లినట్టు అయి నడకలో తడబాటు వచ్చింది..

“ రెండు రోజుల్లో పండగ వస్తోంటే ఈ ఆఫీస్ క్యాంపు ఏంటండి... పైగా ఉగాది కూడానూ.. ఉగాది నాడు ఏం చేస్తే అదే ఏడాదంతా చేస్తాముట.. మీరు ఆరోజు మాతో లేకుండా పొతే ఈ ఏడాది అంతా ఏ పండక్కి ఉండరేమో అని భయం వేస్తోంది.. పండగ అయాక వెళ్ళచ్చుగా ” నా భార్య ఆవేదనతో అన్న మాటలు చెళ్ళున కొడుతున్నాయి... 

“నాకు తెలుసు.. మీరు ఎప్పుడూ అబద్దాలతో ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ బతుకుతున్నారు.. అయినా నేనెప్పుడూ మిమ్మల్ని ఏమి అనలేదు.. ఏదో ఒకనాడు మీరు మారతారని ఆశ పడ్డాను. కానీ పాపం వృద్ధ దంపతులను, కేవలం ఒక బెర్త్ కోసం మోసం చేస్తారా! ఎంత తప్పో ఇప్పుడన్నా తెలుసుకోండి.. లేకుంటే ఎప్పటికీ తెలుసుకోరు.. 'సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్' అని మానవత్వపు విలువలు నేర్పి వెళ్ళిన గురజాడ గారిని ఓ సారి తలచుకోండి.. లేకుంటే ఏదో ఒకనాటికి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు.." 

చెవుల్లో మారుమోగుతున్న ఆ స్వరం ఎవరిదో కాదు.. సాక్షాత్తూ నా అర్ధాంగిది.. ఎక్కడినుంచో కోయిల కూసినట్టు, వేయి వీణలు ఒకేసారి మోగినట్టు వినిపిస్తున్న ఆ స్వరం కచ్చితంగా ఆమెదే.  మొదటిసారిగా ఆమె మాటలు నాకు మంత్రాల్లా, శంఖారావంలా  వినిపించాయి... కాదని ఇంక నన్ను నేను మోసం చేసుకోలేను కదా! 

నా కళ్ళు నడవలేక, నడుస్తూ, మధ్య, మధ్యలో ఆగుతూ చేతుల్లో ఉన్న బరువుని లాగుతూ వెళ్తున్న ఆ జంట వైపు తిరిగాయి.. అప్రయత్నంగా నా కాళ్ళు పరుగు అందుకున్నాయి. తమ చేతుల్లోంచి ఎవరో బ్యాగులు లాక్కొంటుంటే భయంగా వెనక్కి తిరిగి చూసిన ఆ దంపతుల మొహాల్లో విస్మయం ... నా  మొహంలో బహుశా  దరహాసం.

- అత్త‌లూరి విజ‌య‌ల‌క్ష్మి