Facebook Twitter
దేశంలోనే తొలి ఆత్మకథ - అమార్ జీవన్

 

దేశంలోనే తొలి ఆత్మకథ - అమార్ జీవన్

 

 

200 సంవత్సరాల క్రితం మాట ఇది! అప్పట్లో చదువు చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండే ఒక విలాసం. ఇక ఆడవాళ్లు చదువుకోవడం అన్న మాటే లేదు! ఒకవేళ స్త్రీలు చదువుకోవాలన్నా నలుగురిలో కాకుండా దొంగచాటుగా చదువుకోవాల్సిన పరిస్థితి. చదవడమే ఇంత కనాకష్టంగా ఉంటే ఇక పుస్తకాలు రాయడం గురించి ఊహించుకోగలమా! కానీ ఒక బెంగాలీ మగువ తనంతట తానుగా చదువుకోవడమే కాదు... దేశంలోనే తొలి ఆత్మకథని రాసుకుంది. ఆమే రాససుందరీ దేవి!

రాససుందరీ దేవి బెంగాల్లోని ఓ మారుమూల గ్రామంలో 1810లో జన్మించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో బంధువుల చేతుల్లో పెరిగారు. అప్పట్లో బాల్యవివాహాలు ఎంత సహజమో ప్రత్యేకించి గుర్తుచేసుకోవాల్సిన పనిలేదు. పైగా తండ్రి లేని పిల్ల కావడంతో, ఎంత త్వరగా ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టాలా అన్న ఆసక్తి ఎలాగూ ఉంటుంది. దాంతో రాససుందరీ దేవికి 12వ ఏటనే వివాహం చేసి పంపేశారు.

రాససుందరీ దేవి భర్త గొప్ప ధనవంతుడు. నౌకర్లతోనూ, బంధువులతోనూ ఆయన ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. కానీ అలా ఇల్లు కళకళలాడేందుకు రాససుందరీ దేవి నిత్యం ఏదో ఒక చాకిరీ చేయక తప్పేది కాదు! దానికి తోడు ఒకరి తర్వాత ఒకరుగా జన్మించిన 12 మంది పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవాలయ్యే! దాంతో రాససుందరీ దేవి విపరీతంగా అలసిపోయేది. పని ఒత్తిడిలో ఒకోసారి తిండి తినేందుకు కూడా కుదిరేది కాదు. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనంగా ఏవన్నా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే అవకాశం వస్తే బాగుండు అనుకునేది. కానీ ఎలా!

రాససుందరీ దేవి చిన్నప్పుడు తన సోదరులతో కలసి వీధి అరుగు మీద కొంత విద్యను నేర్చుకుంది. కానీ అది చాలా కొద్దికాలం మాత్రమే! అవి నేర్చుకుని కూడా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. దాంతో ఎలాగైనా తిరిగి అక్షరాల మీద పట్టు సాధించాలనుకున్నది. తన పెద్దకుమారుడు అవతల పడేసిన కొన్ని చూచిరాత పుస్తకాలు (cursive writing) కనిపించాయి. వాటిలోని అక్షరాలను పోల్చుకుంటూ, తన చిన్నతనంలో నేర్చుకున్న విద్యను గుర్తుచేసుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు భర్త నిత్యం చదువుకునే ‘చైతన్య భాగవతం’ అనే గ్రంథంలో ఒక పేజీని దొంగతనంగా చించి.... అందులోని వాక్యాలను చదివే అభ్యాసం మొదలుపెట్టింది.

మొత్తానికి ఎలాగొలా పుస్తకాలు చదివే స్థాయికి, అక్షరాలను స్వయంగా రాసే స్థాయికి చేరుకున్నారు రాససుందరీ దేవి. అంతేకాదు! తన జీవితాన్ని స్వయంగా లిఖించే ప్రయత్నం చేశారు. అలా తన 66వ ఏట ‘అమార్ జీవన్’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఆరకంగా భారతదేశ భాషలలో తొలి ఆత్మకథగా అమార్ జీవన్ నిలిచింది. ఒకవేళ ఈ విషయం మీద ఎటువంటి సంశయమైనా ఉంటే... దేశంలో తొలి మహిళా ఆత్మకథగా మాత్రం అమార్ జీవన్ పుస్తకానికి ఢోకా లేదు!

అమార్ జీవన్లో అద్భుతమైన రచనా శైలి లేకపోవచ్చు. అప్పటి సమస్యల మీద తీవ్రమైన విమర్శలు కనిపించకపోవచ్చు. కానీ తన భావాలను స్పష్టంగా, సూటిగా, సరళంగా చెప్పిన తీరు ఆశ్చర్యం కలిగించకమానదు. తన బాల్యవివాహం గురించీ, ఆ సందర్భంగా తన తల్లి నుంచి తనను దూరం చేయడం గురించీ రాస్తూ- ‘బలిపీఠం మీదకు తీసుకువెళ్లే మేకపిల్లకి ఉండే నిస్సహాయ పరిస్థితే నాది కూడా. అవే ఆర్తనాదాలు, అదే ఆవేదన!’ అంటూ చెప్పుకొస్తారు. పెళ్లి తర్వాత తన ఉనికి గురించి రాస్తూ- ‘జనం తమ వినోదం కోసం పక్షులని పంజరాలలో బంధిస్తారు. నేను కూడా అలాంటి పక్షినే. జీవితాంతం వరకూ ఎలాంటి స్వేచ్ఛా లేకుండా పంజరంలో ఉండి తీరాల్సిన పక్షిని!’ అని తన బాధను వెలిబుచ్చుతారు. ఇలాంటి వాక్యాలు అమర్ జీవన్ అంతటా కనిపిస్తాయి.
అమర్ జీవన్ కేవలం ఒక ఆత్మకథే కాదు. తన జీవితంలోని నిస్సహాయత గురించి ఒక మహిళ నినదించిన గొంతుక. అందుకనే రససుందరీ దేవిని దేశంలోనే తొలి ఫెమినిస్ట్ రచయిత్రులలో ఒకరిగా భావిస్తూ ఉంటారు. రాససుందరీ దేవి ప్రభావం తర్వాత తరం మీద గాఢంగానే ఉంది. 20వ శతాబ్దంలో బెంగాల్ సాహిత్యం ఉవ్వెత్తున ఎగసిపడేందుకు రాససుందరీ దేవిని కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

గమనిక: తెలుగునాట వెన్నెలకంటి సుబ్బారావు అనే ఆయన రాసిన ఆత్మకథని 1873లోనే ప్రచురించారు. అయితే ఇది ఆంగ్లంలో ఉంది!

- నిర్జర.