Facebook Twitter
ఆత్మహత్య చేసుకోమంటూ ఉత్తరం పంపారు

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. ఈ పేరు ఎవ్వరికీ కొత్త కాకపోవచ్చు. అమెరికాలో నల్లవారి పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు లూధర్‌ కింగ్‌. నల్లవారికి బస్సులో సీటు ఇవ్వకపోవడంతో మొదలైన ఉద్యమాన్ని పౌరహక్కుల పోరుగా మార్చినవాడు. ఒకానొక సమయంలో లూథర్‌ కింగ్‌ను అడ్డుకోవడం అక్కడి ప్రభుత్వ తరం కాలేదు. అతన్ని నిర్బంధించే ప్రయత్నం చేసిన ప్రతిసారీ, ఉద్యమం మరింత బలపడసాగింది.


లూథర్‌కింగ్‌కు కమ్యూనిస్టుల సహకారం కూడా ఉందేమో అని అక్కడి ప్రభుత్వం నమ్మింది. ఒకవేళ అదే నిజమైతే అమెరికా సమాజం కుప్పకూలిపోయే అవకాశం ఉందని భయపడింది. ఎలాగొలా ఆయన మీద ఒక కన్ను వేయాలని నిశ్చయించుకుంది. దాంతో అమెరికా గూఢచారి సంస్థ FBI రంగంలోకి దిగింది. లూథర్‌ కింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు... లాంటి సూక్ష్మమైన వివరాలన్నింటినీ సేకరించింది. ఆయన ఫోన్లని ట్యాప్‌ చేసి కింగ్‌ మాట్లాడుతున్న సంభాషణలన్నింటినీ రికార్డు చేసింది. వ్యక్తులను అణచివేసే ధ్యేయంతో సాగిన ఈ తరహా గూఢచర్యానికి ‘COINTELPRO’ అని ఓ ముద్దుపేరు కూడా పెట్టుకుంది.


FBI అనుమానించినట్లుగా లూథర్‌ కింగ్‌కు కమ్యూనిస్టులతో ఎలాంటి సంబంధాలూ లేవని తేలింది. కానీ ఆయన కొందరు స్త్రీలతో సాగించిన ఫోన్ సంభాషణలు శృతిమించాయని చెబుతారు. అసలే లూథర్ కింగ్ స్త్రీలోలుడు అంటూ ఒక ప్రచారం ఉంది. ఈ సంభాషణలు కనుక బయటపడితే లూథర్ కింగ్‌ పరువు మరింత దిగజారిపోవచ్చని FBI మురిసిపోయింది. దాంతో ఆ సంభాషణలు ఉన్న టేప్‌లను ఉపయోగించి లూథర్ కింగ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకుంది.


1964లో FBI లూథర్ కింగ్‌కు ఒక పార్సిల్ పంపింది. అందులో ఆయనను ఇబ్బందిపెట్టే టేప్‌లతో పాటుగా ఒక ఉత్తరాన్ని కూడా జతచేసింది. ఇదంతా FBIనే చేస్తోందని కింగ్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు... ఎవరో ఆకాశరామన్న రాసినట్లు ఉత్తరం రాసింది. ‘నిన్ను గౌరవంగా సంభోదించడానికి కూడా నాకు మనసు రావడం లేదు. నువ్వు మా నీగ్రోల పాలిట శాపానివి. తెల్లవాళ్లకంటే పాపాత్ముడివి. నీకు ఎలాంటి విలువలూ లేవు. నీ పాపం పండింది. అంతం దగ్గరపడింది. నువ్వు సాధించిన నోబెల్‌ బహుమతి సహా ఏ అవార్డూ ఇక నిన్ను రక్షించలేదు. నిజాన్ని దాచడం ఎవ్వరి వల్లా కాదు! కింగ్‌ నీ పని అయిపోయింది. ఇక నీకు ఒక్కటే దారి మిగిలింది. అదేమిటో నీకు తెలుసు. ఆ పని చేయడానికి నీకు 34 రోజుల గడువుని మాత్రమే ఇస్తున్నాను. ఈలోగా నువ్వా పని చేయలేదో... నీ నిజస్వరూపాన్ని దేశం ముందర నిలబెడతాను’ అన్నదే ఆ ఉత్తరంలోని సారాంశం.


గట్టివాడైన లూథర్ కింగ్‌ సహజంగానే తనకు వచ్చిన ఉత్తరాన్ని పట్టించుకోలేదు. అయినా దురదృష్టం ఆయనను వెంటాడింది. 1968లో ఒక ఉన్మాది చేతిలో కింగ్ చనిపోయాడు. కానీ ఆపాటిలే ఆయన మొదలుపెట్టిన పౌరహక్కుల ఉద్యమం కావల్సిన హక్కులను రాబట్టుకొంది. 1975లో FBIకి చెందిన కొన్ని రహస్య పత్రాలు వెలుగుచూసినప్పుడు, ఆనాటి ఉత్తరం నకలు కూడా బయటపడింది. దాంతో మారుపేరుతో FBI రాసిన ఈ ఉత్తరం గురించి ప్రపంచానికి తెలిసివచ్చింది. FBI రికార్డు చేసిన లూథర్ కింగ్ సంభాషణలను మాత్రం బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ రికార్డులను బహిర్గతం చేయవలసిందిగా కొందరు కోర్టు మెట్లని ఆశ్రయించినా ఉపయోగం లేకపోయింది. 2027 వరకూ ఈ రికార్డులు రహస్యంగానే ఉంచాలంటూ కోర్టు పేర్కొంది. లూథర్‌ కింగ్‌ గురించి ఉన్న అపవాదు నిజమా కాదా అన్నది తెలియాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే!


ఇంతకీ ‘నీకు ఒక్కటే దారి మిగిలింది. అదేమిటో నీకు తెలుసు. ఆ పని చేయడానికి నీకు 34 రోజుల గడువుని మాత్రమే ఇస్తున్నాను,’ అన్న బెదిరింపుకి అర్థం ఏమిటి? లూథర్‌ కింగ్‌ని చనిపోమంటూ FBI సూచించిందని చాలామంది వాదన. అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అక్రమసంబంధాలే అతని ఆత్మహత్యకు కారణంగా ప్రచారం చేయాలన్నది FBI వ్యూహమని అంటారు. అయితే FBI ఆ వాదనను వ్యతిరేకిస్తోందనుకోండి. ఏది ఏమైనా ఒక ఉద్యమకారుడిని ఆత్మహత్య చేసుకోమంటూ ప్రోత్సహించిన ఉత్తరంగా ఈ లేఖ మిగిలిపోయింది. లేఖాసాహిత్యంలో ఈ ఉత్తరాన్ని ఓ అరుదైన సందర్భంగా పేర్కొంటూ ఉంటారు.

 

- నిర్జర.