నిజాంను ఎదుర్కొన్న కవిత – పదే పదే అనేస్తా!
ఇదే మాట ఇదే మాట
పదే పదే అనేస్తాను.
ఖదం తొక్కి పదం పాడి
ఇదేమాట అనేస్తాను.
ఎదల్లోన, రొదల్లోన
సొదల్లోన, గదుల్లోన
ఇదే మాట ఇదేమాట
పదే పదే అనేస్తాను.
జగత్తంత రగుల్కొన్న
కృథాజ్వాల వృథాపోదు.
అడుగడుగున యెడదనెత్రు
గడగడ మని త్రాగినావు.
పడతుల మానాలు దోచి
గుడగుడ మని 'హుక్క' త్రాగి
జడియక కూర్చుండినావు
మడికట్టుక నిలిచినావు.
దగాకోరు బటాచోరు
రజాకారు పోషకుడవు.
పూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి
ఇళ్ళన్నీ కొల్లగొట్టి
తల్లి పిల్ల కడుపుగొట్టి
నిక్కిన దుర్మార్గమంత
నీ బాధ్యత నీ బాధ్యత.
'కోటిన్నర' నోటివెంట
పాటలుగా మాటలుగా
దిగిపొమ్మని దిగిపొమ్మని
ఇదేమాట అనేస్తాను.
వద్దంటే గద్దె యెక్కు
పెద్దరికం చేస్తావా!
మూడుకోట్ల చేతులు నీ
మేడను పడతోస్తాయి
మెడనే విడతీస్తాయి.
నీకు నిలుచు హక్కు లేదు
నీ కింకా దిక్కు లేదు.
చరిత్ర బొంగరం తిరిగి
కిరీటాలు నేల కొరిగి
ధరాధిపులు నశిస్తుంటే
బరాయెనాం నవాబా!
పరాక్రమం చూపేవా?
'దిగి పొ'మ్మని జగత్తంత
నగారాలు కొడుతున్నది.
"దిగిపోవోయ్ తెగిపోవోయ్
తెగిపోవోయ్ దిగిపోవోయ్"
ఇదే మాట ఇదే మాట
పదే పదే అనేస్తాను.
- దాశరథి కృష్ణమాచార్య.
(నిజాం అరాచకాలను నిలదీస్తూ, విప్లవాన్ని నినదిస్తూ దాశరథి కృష్ణమాచార్యా రాసిన ‘అగ్నిధార’ సంకలనంలోనిదీ కవిత. అప్పటికీ ఇప్పటికీ పాలకుల అరాచకాన్ని ఎదిరించేందుకు తోడుగా నిలిచే విప్లవ గీతమిది!)
- నిర్జర
