Facebook Twitter
ఒంటి కన్ను రాక్షసుడి కథ

ఒంటి కన్ను రాక్షసుడి కథ

 

అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకొక అందమైన చెల్లెలు ఉండేది. ఆ ఇద్దరు అన్నదమ్ముల పేర్లు రిషి, సాయి. వాళ్ళ చెల్లెలి పేరు వసుంధర. వసుందర అన్నం, ముద్దపప్పు చాలా బాగా చేస్తుంది. అదే ఊరికి అవతల ఒక అడవి ఉండేది. ఆ అడవి చాలా దట్టంగా, బలే అందంగా ఉండేది. అయినా అటువైపుకు అసలు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు. ఎందుకంటే ఆ అడవిలో అనేక కౄరమృగాలు ఉండేవి.

వాటన్నిటికంటే ఎక్కువ, అక్కడ ఒక గుహలో ఒంటి కన్ను రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడు చాలా భయంకరుడు. వాడి చేతికి చిక్కినవాళ్ళెవ్వరూ ఇంత వరకూ తిరిగి రాలేదు. అయితే ఎందుకనో, వాడు మటుకు అడవిని దాటి ఊళ్ళోకి వచ్చేవాడు కాదు. అందుకని ఊళ్ళోవాళ్ళంతా బ్రతికిపోతున్నారుగానీ, లేకపోతే ఒక్కరు కూడా మిగిలే వాళ్ళు కాదు

ఒకసారి వసుంధరకు ముద్దపప్పు చేయాలనిపించింది. మంచి ముద్దపప్పు తయారవ్వాలంటే సన్నటి పుల్లల సెగ మీద పప్పుని రెండు గంటలపాటు ఉడకబెట్టాలి. "చాలా పుల్లలు ఏరుకు రండిరా, అన్నయ్యలూ" అని చెప్పింది అన్నలకు. అన్నలిద్దరూ పుల్లలకోసం ఊరంతా వెతికారుగానీ, ఏమన్ని దొరకలేదు. వాళ్ళు తమకు దొరికిన కొన్ని పుల్లల్నీ తీసుకొచ్చి "ఇదిగో, వీటితో సర్దుకో- ఇంక పుల్లలు దొరకవు" అని చెప్పేసారు.

 

వసుంధరకు కోపం వచ్చేసింది. "పుల్లలు కూడా దొరక్కపోతే ఇదేం ఊరు?" అని అరిచి, చకచకా బయటికి పోయి చూసింది. నిజంగానే ఎక్కడా పుల్లలు లేవు! అట్లా సగం అవసరంతోటీ, సగం కోపంతోటీ విసవిసా నడుచుకుంటూ అడవిలోకి అడుగు పెట్టేసింది. అసలు ఆ అడవిలోకి ఎవ్వరూ మనుషులు పోరు కదా, అందుకని అక్కడంతా చాలా పుల్లలే ఉన్నాయి. సంతోషంగా వాటిని ఏరుకుంటూ ఉండిపోయింది వసుంధర. అకస్మాత్తుగా అక్కడంతా చీకటి ఐపోయింది.

ఏంటా అని చూస్తే రాక్షసుడు! వాడు వసుంధరను ఒక్క చేత్తోటే ఒడిసి పట్టుకొని తన గుహవైపుకు నడవసాగాడు! వసుంధర ఎంత పెనుగులాడితే మటుకు, ఏం ప్రయోజనం?! వాడికున్న బలం ముందు తన శక్తి ఎందుకూ పనికిరాలేదు! "చెల్లి ఇంకా తిరిగి రాలేదేమి?" అని అన్నలిద్దరూ ఊరంతా వెతికారు. చివరికి తన కాలి గుర్తుల ఆధారంగా తను అడవిలోకి వెళ్ళిందని గుర్తించారు. ఆవేశంకొద్దీ ధనస్సు, బాణాలు పట్టుకొని, వాళ్ళు కూడా అడవిలోకి దూరారు.

ఇంకేముంది? రాక్షసుడు వాళ్ళిద్దరినీ కూడా పట్టుకునేసాడు! పెద్దగా నవ్వుకుంటూ వాళ్ళను కూడా తీసుకెళ్ళి గుహలో పడేసాడు.అటుపైన గుహకు ఒక పెద్ద బండరాయిని అడ్డం పెట్టి, ఉషారుగా ఈల వేసుకుంటూ అడవిలోకి బయలుదేరి పోయాడు! చూస్తే అక్కడ గుహలోనే ఉంది వసుంధర! గుహలోనే ఒక మూలకి పొయ్యి వెలుగుతున్నది. పొయ్యిమీద కుతకుతా ఉడుకుతున్నది, ముద్దపప్పు! అన్నలిద్దరినీ చూసి ఆ పాప చాలా సంతోషపడింది. "మీరొచ్చేసారుగా, ఇంకేమీ పర్లేదు. ఇదిగో, ముందు ముద్దపప్పు తినండి" అన్నది సంతోషంగా.

 

"ఏమీ ఎట్లా పర్లేదు? అయినా నీ ముద్దపప్పే మనల్ని ఇంత కష్టాల్లోకి తీసుకొచ్చింది. ఇంతవరకూ వచ్చి కూడా నువ్వు నీ ముద్దపప్పుని వదల్లేదు!" అన్నాడు చిన్నన్న కోపంగా. "అట్లా కోపం చేసుకోకురా అన్నయ్యా! ఉదయం అనగా నన్ను ఇక్కడికి తెచ్చి పడేసాడా, చూస్తే ఇక్కడ చాలా కందిపప్పు కనబడింది. వెంటనే నేను ముద్దపప్పు చేసాను. రాక్షసుడు ఇవాళ్ల మధ్యాహ్నం ఆ ముద్దపప్పుతోటే భోజనం చేసాడు. వాడికి అదేదో చాలా నచ్చినట్లుంది- ఇంకా చేసిపెట్టమని మరిన్ని కందిపప్పులూ, కట్టెపుల్లలూ తెచ్చిపడేసాడు! నిజానికి ఇవాళ్ల రోజంతా ఆ పప్పేదో చేసి పెడుతున్నాను కాబట్టే, నన్ను తినెయ్యలేదు వాడు- లేకపోతే ఈ పాటికి నేను వాడి కడుపులో జీర్ణంకూడా అయిపోయి ఉండేదాన్ని! ఇట్లా రాక్షసుడి వంటదాన్ని ఐపోయాను నేను!" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నది వసుంధర.

"లేదులే! అంత కష్టం ఏమీ లేదు. మేం వచ్చేసాంగా? రాక్షసుడిని చంపేసి, నిన్ను కాపాడతాం" అన్నారు అన్నలిద్దరూ. అంతలోనే రాక్షసుడు గుహ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చేసాడు. అన్నలిద్దరూ ముద్దపప్పు తింటుండటం చూసి ఆశ్చర్యపోతూ నోరు తెరిచాడు. వాడిని చూడగానే అన్నలిద్దరూ చటుక్కున లేచి నిలబడి, గురిచూసి చెరొక బాణమూ వేసారు వాడి ముఖం మీదికి. తమ్ముడు విసిరిన బాణం వాడి నోట్లో గుచ్చుకున్నది. అన్న వేసిన బాణం‌ పోయి వాడి కన్నులో గుచ్చుకున్నది!

ఆ రాక్షసుడి ప్రాణం వాడి కన్నులోనే కదా, ఉన్నది?! అందుకని వాడు కాస్తా టపాలున క్రిందపడి, చచ్చిపోయాడు! వసుంధర, అన్నలు అంతా క్షేమంగా వాళ్ళ ఇల్లు చేరుకున్నారు. అంత పెద్ద రాక్షసుడిని ఈ పిల్లలు ఇద్దరూ చంపేసారని తెలిసి ఊళ్ళోవాళ్లంతా ఎంత ఆశ్చర్యపోయారో చెప్పలేము!

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో