Facebook Twitter
ఎవరి ఆవు..

ఎవరి ఆవు?

 


చంద్రపురం న్యాయాధికారి శాంతన్న చాలా మంచివాడు, తెలివి తేటలు గలవాడున్నూ. 'ఆయనైతే నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడు' అని ఆచుట్టు ప్రక్కల ఊళ్ళలో అందరూ చెప్పుకునేవాళ్ళు.

ఒకసారి భటులు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక ఆవును ఆయన దగ్గరకు పట్టుకు వచ్చారు. "వీళ్ళు ఇద్దరూ ఈ ఆవు కోసం తగవులాడుతున్నారు ప్రభూ! ఈ మూగ ఆవుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేను; కానీ దానికి మాటలు రావు, వీళ్ళు కొట్లాట ఆపరు! తమరు ఏదో ఒకలాగా వీరి తగాదాను పరిష్కరించాలి" అని విన్నవించుకున్నారు. "ఈ ఆవు నాదేనండయ్యా. తమరు గమనించండి" అన్నాడు సుబ్బయ్య గట్టిగా. "కాదు ప్రభూ! ఇది నాది. పేదవాడిని దయచూడండి. వీడిని నమ్మకండి" అన్నాడు లింగయ్య, మరింత గట్టిగా. శాంతన్న ఒక్క క్షణం ఆలోచించాడు.

 

"సరే, సుబ్బయ్యా! నువ్వు ఇక్కడ ఉండు. లింగయ్యా, కొంత సేపు బయట కూర్చో" అన్నాడు. లింగయ్య మళ్ళీ ఒకసారి "ఆవు నాదేనండయ్యా!" అని చెప్పి బయటికి నడిచాడు. "సుబ్బయ్యా! నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు" అన్నాడు శాంతన్న. "అయ్యా! నా ఆవుకి ఒకసారి వెనుక కాలులో ఎడమవైపున ఇనుప చువ్వ గుచ్చుకుని, పెద్ద గాయం అయ్యింది. గాయమైతే తగ్గింది గానీ మచ్చ అట్లాగే నిల్చిపోయింది" చెప్పాడు సుబ్బయ్య. శాంతన్న ఆదేశం మేరకు భటులు ఆవు కాలుని పరిశీలించారు. నిజంగానే ఎడమ కాలుకు గాయపు మచ్చ ఒకటి ఉంది.

"సరిగా ఆనవాలు పట్టావు కాబట్టి, ఆవు నీకే చెందచ్చు. ఐతే ఇదే మాట లింగయ్యను కూడా అడుగుదాం, ముందు" అంటూ లింగయ్యను లోనికి పిలిచాడు శాంతన్న. "లింగయ్యా! నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు!" ఆదేశించాడు. "నా ఆవు తోకమీద వరసగా మూడు అడ్డు గీతలు ఉంటాయి ప్రభూ!" అన్నాడు లింగయ్య. భటులు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోకమీద మూడు అడ్డుగీతలు ఉన్నాయని చెప్పారు. "ఓహో! అయితే ఆవుని ఇద్దరూ బాగానే పరిశీలించి ఉన్నారే!” నవ్వాడు శాంతన్న. "సరే! అయితే సుబ్బయ్యా, ఈ ఆవుని ఇవాల్టికి నువ్వు తీసుకెళ్ళు. మీ ఇంట్లో ఒక రోజు ఉంచుకొని, రేపు ఉదయం మాకు తెచ్చి ఇవ్వు. రేపు లింగయ్య తీసుకెళ్తాడు దీన్ని! ఆలోగా మేం ఆలోచించి, ఇది అసలు ఎవరిదో మర్నాడు తేలుస్తాం" అని చెప్పి ఆ రోజుకు సభను ముగించాడు శాంతన్న. సుబ్బయ్య ఆవుని తోలుకొని వెళ్ళి, మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చాడు. ఆ వెంటనే లింగయ్య ఆవుని తోలుకెళ్ళాడు. తర్వాతి రోజున సభ ప్రారంభం కాగానే శాంతన్న తీర్పు ఇచ్చేసాడు: "ఆవు సుబ్బయ్యదే" అని!

 

దాంతో సుబ్బయ్య ముఖం సంతోషంతో విప్పారింది. కానీ లింగయ్య మటుకు ఒప్పుకోలేదు: "అయ్యా! మీరేదో పొరపడి-నట్లున్నారు!‌ మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో తెలియకుండా ఉంది" అన్నాడు బాధగా. శాంతన్న నవ్వి, "చూడు సుబ్బయ్యా! ఆవు మీ ఇద్దరి దగ్గరా చెరొక రోజూ ఉన్నది కదా; నీ దగ్గర వున్న రోజున అది ఉత్సాహంగా లేదు; సుబ్బయ్య దగ్గర ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉంది. అదీ గాక, నువ్వు ఆవును పట్టుకెళ్ళాక, దాని అవసరాలకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసావు: దాన్ని కట్టేసేందుకు గాటం కొత్తగా వేసావు; పలుపు కొత్తది కొన్నావు; నీళ్ళు పెట్టేందుకు మీ ఇంటిలోని బొక్కెనను కూడా కొత్తగానే తీసుకెళ్ళావు. సుబ్బయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి. 

 

ఆవు నీదే అయినప్పుడు, దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కద, ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది?" అన్నాడు. లింగయ్య ముఖం చిన్నబోయింది. అయినా అతను అంగీకరించక, "అయ్యా! తమరు పునరాలోచించాలి. పోయిన లక్ష్మి తిరిగి వస్తున్నదన్న ఉత్సాహంకొద్దీ వస్తువులు కొత్తగా అమర్చాను తప్పిస్తే, ఆవు మటుకు నాదే" అనేసాడు! శాంతన్న ఏదో నిశ్చయించినట్లు, "సరే! నా తీర్పు సరైనదేనని నేను నిరూపిస్తాను. మీరిద్దరూ తలా ఇంత ఎండు గడ్డి చేత పట్టుకొని అటొకరూ, ఇటొకరూ నిలబడండి. కావాలంటే మీ ఆవుని మీరు పేరు పెట్టి పిలవండి" అని ఆదేశించి, ఆవుని వదల-మన్నాడు. ఆవు ఒకసారి ఇరు వైపులకూ చూసి, మెల్లగా సుబ్బయ్య దగ్గరికి చేరుకున్నది!

లింగయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. తన మోసాన్ని అంగీకరించక తప్పలేదతనికి. "'ఈ ఆవు నీది కాదు; సుబ్బయ్యది' అని తేలిపోయింది. ఇతరుల సొమ్మును ఆశించటమే కాక, న్యాయస్థానపు తీర్పు సరైనదైనా, దానిపై అవిశ్వాసం ప్రకటించినందుకుగాను నీకు వంద బంగారు నాణాలు శిక్ష విధిస్తున్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ మొత్తాన్ని చెల్లించలేకపోతే ఏడాదిపాటు కారాగారంలో ఉండాలి" అని తీర్పు చెప్పాడు శాంతన్న. సభికులంతా హర్షధ్వానాలు చేసారు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో