Facebook Twitter
ఇంకా ఊబిలోనే...!

ఇంకా ఊబిలోనే...!

 

 

అతడు
ఇంకా ఊబిలోనే ఉండిపోయిండు
ఏ ఆపన్నహస్తం అందించినా
నిస్సహాయత నీడలోనే
తలదాచుకుంటున్నడు

అతడు
తనదైన లోకంలోనే విహరిస్తున్నడు
బయటి ప్రపంచాన్ని చూడలేక
తనదైన అస్తిత్వమాయాజాలంలో పడి 
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నడు

అతడు
మనోక్లేశంతో మధనపడుతున్నడు
అక్కున చేర్చుకునే ఆసరా లేదని
బొమ్మను అడ్డుపెట్టుకుని
బొరుసుతో ఆటలాడుకుంటున్నడు

అతడు
ఇంకా మగత నిద్రలోనే ఉంటూ
మందబుద్ధితో పైశాచికలాడుతున్నడు
కొత్త ప్రపంచం ఆహ్వానిస్తున్నా
తనదైన లోకాన్నే కలగంటున్నడు

నిజమే...
అతడి స్వప్నం ఫలించాలని ఉన్నా
బంధనాలేవో బందీని చేస్తున్నవి
లోకాన్ని జయించాలని తపనపడుతున్నా
ఒంటరి దుఃఖమేదో నిలువెల్లా దహిస్తున్నది

అవును....అతడు
ఒంటరి ప్రపంచపు నావికుడు
ఏకాంతాన్ని కోల్పోతున్న నిస్సహాయుడు
ఫలించని రంగుల రాజ్యాన్ని 
కలలుగంటున్న కలలబేహారుడు

అవును...
అతడింకా ఊబిలోనే ఉండిపోయిండు
ఆసరాలేక దిక్కుమొక్కూ చూస్తున్నడు.

 

 

 

 

 - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్