Facebook Twitter
అమ్మకు కనువిప్పు

అమ్మా !  కొట్టవద్దే   తట్టుకోలేక పోతున్నా.  ఆపవే  అమ్మా   రేపటి నుంచి బాగా చదువుతాను.  నువ్వు చెప్పినట్లే వింటాను   నిద్రలోనే  సునీల్ కలవరిస్తుంటే గభాలున లేచి వాడి దగ్గరకు వెళ్ళాడు రాంబాబు.  

 “ఏడవకు నాన్న . ఏం భయం లేదు”   కొడుకు పక్కనే కూర్చుని కూర్చొని తల నిమరాడు రాంబాబు. 

 రాంబాబు ఒక ప్రైవేటు ఉద్యోగి . అతడి భార్య సరోజ.  వారికి ఇద్దరు పిల్లలు.  అబ్బాయి సునీల్ పదో తరగతి చదువుతున్నాడు.  అమ్మాయి ఇందిర ఎనిమిదో తరగతి చదువుతోంది. 
 సమస్య ఏమిటంటే సునీల్ చదువులో వెనుకబడ్డాడు . పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ మార్కులు వస్తున్నాయి.  వాడు ఎంత కష్టపడి చదువుతున్నా గుర్తుండడం లేదని,  పరీక్షలలో రాయలేకపోతున్నానని చెబుతున్నాడు. 

 కొడుకు సునీల్ కి పరీక్షలలో తక్కువ మార్కులు  రావడం సరోజకి అస్సలు నచ్చడం లేదు . ఈ విషయమై విపరీతంగా బాధపడిపోతోంది.  రోజూ  సునీల్ దగ్గరే కూర్చొని చదివించడానికి నానా తండాలు పడుతోంది.  వాడిని చితకబాదుతోంది . అయినా వాడికి చదివేదేమీ  బుర్ర కెక్కడం లేదు. 

 దీంతో సరోజ ప్రతిరోజు సునీల్ ని కొట్టడం,  తిట్టడం చేయకుండా ఉండటం లేదు.  సునీల్ అయితే వాళ్ళమ్మని చూస్తే చాలు ఒణికి పోతున్నాడు. సరోజలో రోజురోజుకు కోపం పెరిగిపోయి కొడుకుని శత్రువులా  చూడడం మొదలుపెట్టింది. 

 అదే స్కూల్లో సునీల్ తో బాటే చదివే పిల్లలు తమ దొడ్లోంచి వెళుతుంటే వారికి సునీల్ కంటే మంచి మార్కులు వచ్చాయని తెలిస్తే ఆ రోజు పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. కొడుకని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టడం మొదలుపెడుతుంది. 

 అందుకే సునీల్ నిద్రలో కూడా తల్లి కొట్టే దెబ్బలు గుర్తొచ్చి భయంతో కలవరిస్తున్నాడు.  రాంబాబుకి కొడుకు పరిస్థితి చూస్తే జాలేసింది. 

 మర్నాడు ఉదయం భార్యతో “ఎందుకు వాడిని గొడ్డును బాదినట్లు బాదుతావు ? వాడు జడుసుకుని నిద్రలో కలవరిస్తున్నాడు.  నువ్వలాగే కొడుతూ పోతుంటే చదువు మాట దేవుడెరుగు..  వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది”  అన్నాడు. 

 సరోజ రాంబాబు మీదకు గయ్ మని లేచింది. “ తమరు అంతంత మాత్రం చదవబట్టే అలాంటి ఉద్యోగం తగలడింది.  వీడిని సరైన దారిలో పెట్టకపోతే పెద్దయితే మీలాగే పనికిమాలిన ఉద్యోగం వస్తుంది” అంటూ నోరు మూయించింది. 

 రాంబాబుని  ఈ విషయాలు కల్లోల పరిచాయి. వాటినే   మనసులో పెట్టుకొని ఆఫీసులో సరిగ్గా పని చేయలేకపోయాడు . అది గమనించిన స్నేహితుడు రమణ విషయం ఏమిటని రాంబాబుని అడిగాడు. 

 ఇంట్లో కొడుకు  చదువు విషయం,  తన భార్య  వాడిని  దండిస్తున్న విషయం   పూసగుచ్చినట్టు  చెప్పాడు రాంబాబు .

అంతా విన్న రమణ కాసేపు ఆలోచన చేశాడు. “మీ ఆవిడకు ఎవరంటే గురి ఉందో వారి చేత ఆమె చేస్తున్న పని తప్పు అని చెప్పించు. తప్పకుండా దారిలోకి వస్తుంది. మీ కొడుక్కి దెబ్బలు తప్పుతాయి” అని   సలహా ఇచ్చాడు . 

  రాంబాబుకి వెంటనే  ఒక విషయం గుర్తొచ్చింది. సరోజ ప్రతి గురువారం షిరిడి సాయి మందిరానికి వెళ్లి బోధనలు వింటుందని, అక్కడి  గురువు గారు చెప్పే మంచి మాటలు ఆసక్తిగా విని వాటిని ఆచరణలో పెడుతుందని.   అంతే!  రాంబాబు  ఆ సాయంత్రమే షిరిడి  మందిరానికి వెళ్లి  గురువు గారిని కలుసుకున్నాడు.  తానెందుకు వచ్చాడో చెప్పాడు. ఆ సమస్యను పరిష్కరించమన్నాడు.  

“ నాయనా ! నీ భార్య  వచ్చినప్పుడు మాట్లాడతాను.  ఆందోళన పడవద్దు”  అని చెప్పి దీవించి పంపించాడు గురువుగారు. 
 గురువారం రానే  వచ్చింది . సరోజ షిరిడి సాయి మందిరానికి వెళ్ళింది . సాయి దర్శనం చేసుకున్న తరువాత  గురువుగారితో “మా అబ్బాయి బాగా చదవడం లేదు . వాడు చెడిపోతాడని భయంగా ఉంది”  అని తన బాధను ఆయనతో పంచుకుంది.  గురువు గారికి  వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు,  పని  మరీ సులువైంది. 

 “అమ్మా! చదువుల విషయంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.  పిల్లల చదువుల విషయంలో వారు తీసుకునే  శ్రద్ధ ఒక్కోసారి అనర్ధాలకు   దారి తీస్తోంది.  ఒకే వయసు ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు.  తాము ఆశించిన ఫలితాలు పిల్లల నుంచి పొందాలనుకోవడం అత్యాశ అవుతుంది.  పిల్లలను భయపెట్టడం , కొట్టడం, ఒత్తిడి  తీసుకురావడం వల్ల వారు బాగా చదువుతారని,  మంచి మార్కులు సాధించగలరని అనుకోవడం పొరపాటు.  వారి తెలివితేటలకు తగ్గట్టే మార్కులు వస్తాయి.  వారికి గుర్తింపును,  ప్రోత్సాహాన్ని ఇవ్వాలే తప్ప దండించడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలపై అతిగా ఒత్తిడి తెస్తే వారికి చదువుపై అయిష్టత ఏర్పడే అవకాశం ఉంది.  వారికి జీవితంపై విరక్తి కూడా కలగవచ్చు.  జీవించడానికి చదువు అవసరమే.  కానీ చదివే జీవితం కాదు.  చదువు లేని వారు,  చదువులో వెనుకబడిన వారు ఎందరో జీవితంలో విజయాలు సాధించారు . ముందుగా నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి . అంతకంటే  ముందు మీ అబ్బాయిని ప్రేమగా చూడడం అలవాటు చేసుకో. ఫలితం సంగతి దేవుడెరుగు  నీ కొడుకు బెంగతో అనారోగ్యం పాలవకుండా కాపాడుకో”  అని బోధించారు.   గురువు గారి మాటలతో సరోజకు కనువిప్పు కలిగింది.  సునీల్  విషయంలోతానింతవరకు ప్రవర్తించిన తీరుకు సిగ్గు పడింది. “ అయ్యో పాపం పసివాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో. వాడిని సముదాయించాలి”  అనుకుని ఇంటికి బయల్దేరింది.  ఆ రోజు నుండి సునీల్ పట్ల ఆమె తీరే మారిపోయింది.