ఆ చల్లని సముద్రగర్భం
ఈ కవిత శీర్షిక వినగానే, ఈమధ్యకాలంలో ప్రతి వేదిక మీదా వినిపిస్తున్న గేయం గుర్తుకువస్తుంది. మహాకవి దాశరథి కృష్ణమాచార్య కలం నుంచి వెలువడిన కవిత ఇది. 1949లో ప్రచురించిన ‘అగ్నిధార’ కవితాసంపుటిలోది. నిజానికి ఈ కవిత పేరు ‘?’. ఇందులో కనిపించే ప్రశ్నలకి ప్రతిరూపంగా కేవలం ప్రశ్నార్థకాన్నే శీర్షికగా ఎంచుకున్నారు దాశరథి.
దాశరథి ఇతర కవితల్లోలాగానే ధనవంతుల గురించీ, రాచరికపు క్రూరత్వం గురించీ, పేదవాడి అసహాయత గురించీ, కులమతాల పట్టింపుల గురించీ ఎండగట్టడం కనిపిస్తుంది. శ్రీశ్రీకవితలకు సాటిరాగల దూకుడు, లయబద్ధత ఈ కవిత సొంతం. అందుకనే రోజులు గడుస్తున్న కొద్దీ... ఈ కవిత గేయంగా మారింది. ప్రతి వేదిక మీదా వినిపించడం మొదలైంది. తెలంగాణ పోరాటం దగ్గర నుంచీ పిల్లల పాటల పోటీల వరకు అన్నిచోట్లా ఈ కవిత గేయమై నినదిస్తోంది. ఈ క్రమంలో గాయకులు దాశరథి మూలకవితలో చిన్నచిన్న మార్పులు కూడా చేస్తున్నారు. అయితే దాశరథి రాసిన అసలు కవిత మాత్రం ఇది…
ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భానువు లెందరో?
భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళా లెన్నో?
ఈ మానవరూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో?
ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠా లెన్నో?
శ్రమజీవుల పచ్చి నెత్తురులు
త్రాగని ధనవంతు లెందరో?
అన్నార్తులు అనాధలుండని
ఆ నవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటక మంటూ
కనుపించని కాలాలెప్పుడో?
అణగారిన అగ్ని పర్వతం
కని పెంచిన "లావా" యెంతో?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో?
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవిగుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో?
కులమతముల సుడిగుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్లకో?
