Facebook Twitter
కలవారి కోడలు కలికి కామాక్షి

కలవారి కోడలు కలికి కామాక్షి

 


జానపద గేయాలకి ఫలానా రచయిత అంటూ ఉండడు. రుషుల జన్మ, నదుల జన్మలాగానే వాటి ఆవిర్భావం కూడా ఊహకందకుండా జరుగుతుంది. కానీ ఆ గేయాలను పరిశీలిస్తే ఒకనాటి ప్రజల జీవితం ఎలా ఉండేదో తెలిసిపోతుంది. ఆచారవ్యవహారాల దగ్గర నుంచీ ఆలోచనావిధానం వరకూ ఒక తరానికి చిహ్నంగా నిలిచిపోతుంది. అలాంటి ఒక పాటే ‘కలవారి కోడలు’.


ఒకనాటి ఉమ్మడి కుటుంబ జీవనశైలిని గుర్తుచేస్తుందీ పాట. ఇంట్లోకి అడుగుపెట్టిన అన్నగారిని చూసి కోడలికి తన పుట్టిళ్లు గుర్తుకువస్తుంది. ఆ గుర్తుతో చెమ్మగిల్లిన ఆమె కళ్లని చూసిన అన్నగారు, ఆమెని తనతో కొన్నాళ్లు పుట్టింటికి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. కానీ అందుకు ఆమె అత్తమామల అనుమతి కావాలయ్యే! ఇక్కడ కోడలు అనుమతి పొందే క్రమంలో, ఎవరి తీరు ఏ రకంగా ఉందో గమనించవచ్చు.


అత్తగారు దర్జాగా పెద్ద కుర్చీ మీద కూర్చుని ఉన్నారు; మామ పట్టెమంచం మీద సేదతీరుతున్నాడు; బావగారు భాగవత కథాకాలక్షేపం చేస్తున్నాడు; తోటికోడలు వంట చేస్తోంది; భర్త రచ్చబండ మీద హడావుడి చేస్తున్నాడు. పైపైకి బంధాలను, సంప్రదాయాలను గుర్తుచేస్తున్నట్లు కనిపించినా... అత్తమామలు దర్జాగా కాలం వెళ్లదీస్తూ, కొడుకులు కాలక్షేపం చేస్తూ ఉంటే ఆడవారు కష్టపడే విధానాన్ని కూడా దెప్పిపొడుస్తున్నట్లు తోస్తుంది. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ... ఈ మూడు ప్రాంతాలలోనూ చిన్నపాటి బేధాలతో ఈ గేయం ఇప్పటికీ ప్రచారంలో ఉంది.

 

కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలో పోసి
అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న
కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె
ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టమ్ము
తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు
ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము
మీ అత్తమామలకు చెప్పిరావమ్మ
కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా
మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


నేనెరుగ నేనెరుగ మీ మామ నడుగు
పట్టెమంచము మీద పడుకున్న మామ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార?
నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు
భారతము చదివేటి బావ పెదబావ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


నేనెరుగ నేనెరుగ నీ అక్క నడుగు
వంట చేసే తల్లి ఓ అక్కగారు
మా అన్నలొచ్చారు మమ్మంపుతార?
నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు
రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగీ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార?
పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర
పోయిరా సుఖముగా పుట్టినింటికిని

 

-నిర్జర