Facebook Twitter
జయదేవుని అష్టపదులు

జయదేవుని అష్టపదులు

 

భగవంతుని ఒకో మనిషి ఒకో తీరున కొలుచుకుంటాడు. కొందరు స్వామి నామాన్ని నిత్యం తల్చుకుంటూ కాలం గడిపితే, మరొకొందరు తమ ఇష్టదైవానికి నిత్య కైంకర్యం చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఇంకొందరు స్వామిని ప్రియునిగానూ, తాము ప్రేయసిగానూ భావిస్తూ మధురభక్తిలో మునిగితేలుతూ ఉంటారు. చూసేందుకు ఇవి శృంగారంలా తోచినా... జీవాత్మ పరమాత్మల కలియికే వాటి వెనుక ఉండే ఆంతర్యం అంటారు. హిందూమతంలో అలాంటి మధురభక్తికి ఔన్నత్యాన్ని తీసుకువచ్చినవాడు జయదేవుడు.


జయదేవుడు 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవి. ఈయన ఒడిషాలోని పూరీకి సమీపంలో ఓ చిన్న గ్రామంలో జన్మించినట్లు తెలుస్తోంది. జయదేవుడు చిన్నప్పటి నుంచే కృష్ణభక్తిలో ఓలలాడేవాడు. ఆ భక్తితోనే కృష్ణుడు తప్ప అన్యమెరుగని ‘పద్మావతి’ అనే దేవదాసీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులిరువురూ నిత్యం కృష్ణనామ స్మరణలోనే మునిగితేలేవారు. రాజ ఆస్థానంలో కొలువు చేస్తున్నా, ఎలాంటి హంగూ లేకుండా నిరాడంబరంగా జీవిస్తూ ఉండేవారు.


జయదేవునికి భక్తితో పాటు పాండిత్యమూ అపారంగా ఉండేది. దాంతో గీతతోవిందం, పీయూషలహరి, దశకృతికృతే వంటి కావ్యాలు రాశారు. వాటిలో గీతగోవిందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కావ్యం 12 అధ్యాయాలలో విస్తరించబడింది. ఒకో అధ్యాయంలోనూ 24 ప్రబంధాలు ఉంటాయి. ఒకో ప్రబంధంలోనూ ఎనిమిది ద్విపదలుతో ఒక గీతం కనిపిస్తుంది. అందుకనే వీటినే అష్టపదులని పిలుస్తారు.


జయదేవుని అష్టపదులన్నీ సంస్కృతంలోనే సాగుతాయి. అవి సామాన్యులకి అర్థం కాకపోయినా... ఆ గీతాలలో వినిపించే లయ, కనిపించే శబ్ద సౌందర్యం అత్యద్భుతం. ఈ అష్టపదుల గొప్పదనాన్ని పెంచుతూ చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులోని ఒక అష్టపదిని జయదేవుడు చదివినప్పుడు, ఆయన భార్య చావు నుంచి బయటపడిందని చెప్పుకొంటారు. మరో అష్టపదిలోని కొన్ని వాక్యాలను స్వయంగా ఆ కృష్ణుడే వచ్చి రాశాడనీ అంటారు.


ఈ కథలన్నీ నిజమైనా కాకపోయినా జయదేవుని అష్టపదులకి సాటిరాగల కావ్యాలు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. జయదేవుని అష్టపదులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హిందూ మతాన్ని పునర్వైభవం తీసుకువచ్చేందుకు అప్పుడప్పుడే భక్తి ఉద్యమం మొదలవుతోంది. జయదేవుని కృతులు ఆ భక్తి ఉద్యమానికి ఒక అద్బుతమైన ఆలంబనగా నిలిచాయి. సంగీతం ద్వారా నృత్యం ద్వారా కృష్ణభక్తిని నలుచెరగులా ప్రచారం చేసేందుకు సాయపడ్డాయి. తర్వాత కాలంలో చైతన్య మహాప్రభు వంటివారు కృష్ణభక్తిని ఒక ఉద్యమంలా చేపట్టేందుకు ఒక బాటని ఏర్పరిచాయి. జయదేవుని అష్టపదులతో భక్తి, సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రలేఖనం... వంటి అన్ని రంగాలకీ ఒక ఆలంబన దొరికినట్లయ్యింది.


జయదేవుని అష్టపదులని ఇతర భాషలలోకి అనువదించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. కానీ నిజంగా అందులోని సౌందర్యాన్ని గ్రహించాలంటే అర్థమయినా కాకపోయినా మూలాన్ని చదువుకోవాల్సిందే! సినిమా పాటగా అయినా, సంగీత రూపకంగా అయినా ఏదో ఒక రూపంలో ఆ అష్టపదులను ఆస్వాదించని వారు ఉండరేమో. తెలుగు చిత్రాలలో సైతం సా విరహే తవ దీనా, ప్రయే చారుశీలే, ధీర సమీరే... వంటి అష్టపదులెన్నో తెరకెక్కాయి. ఇక జయదేవుని అష్టపదులలో రూపొందిన ప్రైవేట్‌ ఆల్బమ్స్ సంగతి సరే సరి. నెట్‌లో ఇవి కావల్సినంతసేపు వినవచ్చు. ఓసారి ప్రయత్నించి చూడండి!

 

- నిర్జర.