Facebook Twitter
ఇంపు కోసం

నాకో గుప్పెడు గాలి కావాలి...

పైరగాలి మరిచిన
పల్లెల మీదకు విసరడానికి !!

ఊరికో గంపెడు
కోయిలలు కావాలి...

టీవీల రోదన లో 
వసంతాలు మర్చిన
మర మనుషులకు
సీమతమ్మ చెట్ల మీద వాల్చి
కుహు కుహూల
గీతం వినిపించటానికి !!

బీటలు పట్టని
వీధి అడుగులు కావాలి..

ఎదురు చూపులతో
అలసి సొలసిన వార్ధక్యానికి
పలకరింపులతో 
సింహాసనం వెయ్యాటానికి !!

ఓ చెంబుడు అమృతం కావాలి..

కాలుష్యం అయిన సింధువు లను
తేట చేయడానికి..

చిటికెడు చిలక పలుకులు
అరువు కావాలి..

అమ్మ ఒడి ఉయలలు లేక
ఆటపాటలు అన్ని ఇరుకు గదుల
పాలయియిన నేటి బాల్యాన్ని
కేరింతలతో జత చేయడానికి

ఇంద్రధనస్సు దొంగిలించాలి..

పొట్టకూటి కోసం 
ఉరుకుల పరుగుల
జీవనంతో అలసిన
నగరానికి చినుకుల
పులకరింతల రంగులు
హృదిన నింపడానికి!!

అందుకే నాకెప్పుడు
అంతులేని ఆనందాలు కావాలి..

జనంతో మనం కావాటానికి !!

కవిత రాయల