Facebook Twitter
చార్వాకుడు

చార్వాకుడు

కురు పాండవ యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తున్నాడని తెలిసి పట్టణమంతా అందంగా అలంకరించారు. రాజవీధిలో ప్రవేశించిన ధర్మరాజు మీద, పరివారం మీద ప్రజలు ముత్యాలూ, అక్షింతలూ, పూలూ చల్లారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మతనయుడు రాజమందిర ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఏనుగు మొగసాలలో రథం దిగాడు. బ్రాహ్మణులకు బంగారం, గోవులు దానం చేసాడు. "ఇతనే మన మహీపతి! కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులకు బుద్ధి చెప్పిన వీరుడితడే - అజాత శత్రువు - ఆడిన మాట తప్పని ధర్మప్రభువు, చల్లని తండ్రి - ఆప్తులను, ఆర్తులను ఆదరించే పుణ్యాత్ముడు" అని జనం వేనోళ్ళ కొనియాడసాగారు. 

ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబ పరుగెత్తుకు వచ్చాడక్కడికి. "ఈ ధర్మరాజేం ప్రభువు? మహా పాపం చేసాడు! తండ్రి, తమ్ముడు, పుత్రుడు, గురువు అనే తారతమ్యం, జంకు లేకుండా బంధుజనులందర్నీ చంపాడు. ఎందుకీ జన్మ! దాయాదులందర్నీ చంపి ఏం భోగాలనుభవిస్తావు?! పాపం మూటగట్టుకున్నావు!" అన్నాడు. 

ఆ మాటలు విని అక్కడున్న బ్రాహ్మణులంతా తెల్లబోయి బాధపడుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. "ఇదేమిటి?" అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ధర్మరాజు కాసేపు సిగ్గుతో తల వంచుకుని తరువాత ఆ బ్రాహ్మణుల వైపు తిరిగి, "మీకు నమస్కరించి వేడుకుంటున్నాను. మహర్షులందరూ అనుమతించి పంపితేనే రాజ్యం చేయడానికి వచ్చాను. మీరు నన్ను ఆదరించవలసిందని కోరుతున్నాను" అన్నాడు చేతులు జోడించి. విప్రులంతా భయపడిపోయారు. "మహారాజా! మేమెవరమూ ఇలా అనలేదు. అసలు ఇతనెవరో కూడా మాకు తెలీదు. ఉత్తమ క్షత్రియ ధర్మంతో నువ్వు గెలుచుకున్న సిరి శాశ్వతమై ఉండుగాక" అని ధర్మరాజును ఓదార్చి, దివ్యదృష్టి సారించారు. ఆ కపట విప్రుని స్వరూపం బోధపడింది. "మహారాజా! వీడు చార్వాకుడనే రాక్షసుడు. దుర్యోధనుడి స్నేహితుడు. అతనికి మేలు చెయ్యాలని వీడు ఈ రూపంలో వచ్చాడు. ఈ కుక్క మొరిగితే పాలసముద్రం వంటి నువ్వు బాధపడట మెందుకు? ధర్మాత్ములైన తమ్ముల సాయంతో సకల మహీవలయాన్నీ పరిపాలించు" అని ఆ రాక్షసుడివైపు చూసి హూంకారం చేశారు వాళ్ళు. 

వాళ్ళ క్రోధాగ్నికి ఆగలేక చార్వాకుడు చచ్చి నేలబడ్డాడు. అజాతశత్రుడు సంతోషించి వాళ్ళను విశేషంగా పూజించాడు. కృష్ణుడు ఇదంతా చూస్తూ- "ధర్మరాజా! వీడు కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే సకల భూతాల వల్ల చావు లేకుండా వరం కావాలని కోరాడు. 'బ్రాహ్మణులకు అపకారం చేసే పనులు మాత్రం చెయ్యకు. అలా ఎప్పుడు చేస్తే అప్పుడే నీకు చావు సంభవిస్తుంది. అంతవరకూ ఎవరివల్లా నీకు చావు లేదని 'బ్రహ్మ వరమిచ్చాడు. అప్పటినుంచీ వీడు లోకాలన్నిటినీ బాధిస్తూనే వున్నాడు. తరువాత దుర్యోధనుడితో స్నేహం చేసి మరింత పెచ్చుమీరాడు. ఆ దురహంకారంతోనే ఇప్పుడు చావును కొని తెచ్చుకున్నాడు. గురువును ఎదిరించడం, గ్రామం పాడు చేయడం, వేదాలూ, ఔషధులూ అమ్ముకోవడం, చెడుస్నేహం చెయ్యడం, రాజధర్మాలూ, అపద్ధర్మాలూ, వర్ణాశ్రమధర్మాలూ పాటించే ఉత్తమ పాలకుణ్ణి తూలనాడడం, ధిక్కరించడం, కూడనిపనులూ చెయ్యరాని పనులూ చేస్తే ఎవరిగతైనా ఇంతే" అని, "ఎవరక్కడ! ఈ కళేబరాన్ని తీసి అవతల పారేయ్యండి" అన్నాడు. 

భటులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయారు. బ్రాహ్మణులు కృష్ణుడికి నమస్కరించారు. తరువాత సభా భవనంలో ఎత్తయిన బంగారు పీఠం వేయించి ధర్మరాజును కూచోబెట్టి సుముహుర్తం సమీపించగానే చక్రధారి వచ్చి "సమస్త పృధ్వికీ అధిపతివై పరిపాలించు" అంటూ శంఖుతీర్థంతో ధర్మరాజుకు అభిషేకం చేశాడు. పంచ మహా వాద్యాలూ మ్రోగాయి.