జయహో ఆకాశవాణి !!
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆకాశవాణి, ప్రతిష్టాత్మకంగా 1956 నుంచీ భారతీయ భాషా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నది.సంస్కృతంతో పాటూ, దక్షిణా భారత దేశ భాషలైన తెలుగు, మళయాళం , కన్నడ, మరాఠీ, కొంకిణీ భాషలతో పాటూ, ఉత్తర భారత దేశ భాషలైన అసమియా, ఒడియా,కష్మీరీ, గుజరాతీ, డోగ్రీ, నేపాలీ, పంజాబీ, బంగ్లా, బోడో, మణిపురీ, మైథిలీ, సింధీ, సంథాలీ, ఉర్దూ, హిందీ మొదలైన 22 భాషల భాషల మూల కవులతో పాటూ, ఆయా కవుల కవితల హిందీ అనువాదాలనూ (మొత్తం 44 మంది కవులు) ఒకే వేదికపై నిర్వహించటం యీ కార్యక్రమ ప్రత్యేకత.
తెలుగులో సుప్రసిద్ధ కవులైన విశ్వనాధ, శ్రీశ్రీ, పుట్టపర్తి, దాశరథి, సినారే, కృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఇటీవలి కాలంలో సుధామ, కవి యాకూబ్ వంటి లబ్ధ ప్రతిష్టులెందరో పై ప్రతిష్టాత్మక కవిసమ్మేళనంలో జాతీయ స్థాయిలో తెలుగు కవులుగుగా తళుక్కున మెరిసిన వారే. మూల కవులను ఎన్నుకోవటమెంత ప్రణాలికా బద్ధమో, ప్రతిష్టాత్మకమో, అనువాద కవుల ఎంపిక కూడా అంతే ప్రణాలికా బద్ధమూ, ప్రతిష్టాత్మకమూ కూడా. కాగా,ఈ సంవత్సరం, ఆకాశవాణి జాతీయ తెలుగు కవిగా సుప్రసిద్ధ కవి డా. బీ.ఆర్.వీ. ప్రసాద మూర్తి (తల్లి ప్రేమ) జాతీయ స్థాయి అనువాదకురాలిగా డా. పుట్టపర్తి నాగపద్మిని (మైథిలీ నుంచీ హిందీ లోకి కవితానువాదం) యీ కార్యక్రమంలో పాల్గొనే గుర్తింపును ఆకాశవాణి ద్వారా అందుకున్నారు.
పైగా యీ సంవత్సరం, యీ ప్రతిష్టాత్మక కార్యక్రమ నిరంతరాయ నిర్వహణకై, లండన్ కు చెందిన వర్ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపును పొందటం మరో విశేషం. ప్రతి సంవత్సరమూ, జనవరి 25 వ తేదీన రాత్రి ప్రసారమయ్యే యీ కార్యక్రమం రికార్డింగ్ యీ నెల (జనవరి) 16 వతేదీ, మధ్యప్రదేశ్ రాజధాని ఇందోర్ లోని ఇంపెరియల్ హాల్, బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్ (నక్షత్ర) లో ఘనంగా నిర్వహించబడింది. జనవరి 15 వతేదీ డ్రెస్ రిహార్సల్స్ జరిగినప్పుడు స్థానిక మీడియా విలేఖరుల కి ఆకాశవాణీ ఏ.డీ.జీ.శ్రీ రాజశేఖర్ వ్యాస్ గారు మూల కవులనూ, అనువాద కవులనూ అకాశవాణి కేంద్ర స్థాయి నుండీ జాతీయ స్థాయి వరకూ, జల్లెడ పట్టి, లబ్ధ ప్రతిష్టులైన కవుల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని యెంతో చక్కగా వివరించారు.
ఆ తరువాత, తెలుగు, వుర్దూ, కొంత మంది ఇతర భాషాకవులతో పత్రికా విలేఖరుల పరిచయాలూ, మరుసటి రోజే వాటిని హిందీ స్థానిక పత్రికల్లో వ్యాస్ గారి ప్రసంగ వివరాతోపాటూ,ప్రచురించటం మరో విశేషం. ఇక 16 వతేదీ, ఇంపెరియల్ హాల్, బ్రిలియెంట్ కన్వెన్షన్ సెంటర్ (నక్షత్ర) లో స్థానిక కవితా ప్రేమికుల సమక్షంలో జరిగిన ఆకాశవాణీ సర్వ భాషా కవిసమ్మేళనంలో ముందుగా మూల భాషల కవితా పఠనం, వెంటనే వాటి హిందీ అనువాదాలూ క్రమంగా ఆయా కవులు పఠిస్తున్నప్పుడు, హిందీ అనువాదాలకన్నింటికీ ముఖ్యంగా అమ్మా, నాన్నా, మహిళామానసం, వృద్ధాప్యం వంటి మానవీయ బంధలూ, అనుబంధాలకు సంబంధించిన కవితలకు విపరీతమైన కరతాళ ధ్వనులతో స్పందన రావటం చూస్తే, యీ వేగనాగరికతలో అందరూ కోల్పోతున్న యీ సున్నితాంశాలవైపు దృష్టి మరలటం మంచి పరిణామంగా భావించవచ్చు.
ఈ కార్యక్రమ రికార్డింగ్ ను జనవరి 25 వ తేదీ రాత్రి 10 గంటలనుండీ, దేశంలోని 450 ఆకాశవాణి కేంద్రాలు, దూరదర్శన్ అన్ని జాతీయ చానళ్ళూ ప్రసారం చేశాయి. కాగా, ఉత్తర భారత దేశమంతా ఒక్క సంస్కృతం, హిందీ, ఉర్దూ తప్ప తక్కిన అన్ని భాషల మూల కవితలూ, హిందీ అనువాదాలతో ప్రసారమౌతుండగా, దక్షిణాదిన సంస్కృతం తప్ప తక్కిన అన్ని భాషలకూ ఆయా రాష్ట్రానికి చెందిన భాషానువాదాలతో (కర్ణాటకలో కన్నడమూ, తమిళనాడులో తమిళం, మహారాష్ట్ర లో మరాఠీ, కేరళలో మళయాళం, రాజస్థాన్ లో రాజస్థానీ, గుజరాత్ లో గుజరాతీ ఇలా) ప్రసారం కాబడటం మరో విశేషం.
ఈ పద్ధతిన, అన్ని భాషలనూ గౌరవించే సంప్రదాయానికి ఆకాశవాణి పెద్ద పీట వేయటం ద్వారా పలువురికి ఆదర్శప్రాయంగా నిలవటమూ కూడా గమనించవచ్చు. ఈ కార్యక్రమం, ప్రతివత్సరమూ, క్రమం తప్పకుండా జనవరి 25 రాత్రే, గత 61 యేళ్ళుగా నిరంతరాయంగా ప్రసారం కాబడుతుండటం,యీ వత్సరం బీబీసీ వారి ప్రపంచ రికార్డ్ ను అందుకోవటం కూడా మన ఆకాశవాణి కీర్తి కిరీటంలో మరో వెలుగులీనే వజ్రం. జయహో ఆకాశవాణి !!
- Padmini Puttaparthi
