Facebook Twitter
నిత్య స్వతంత్రం (ఆగస్టు 15 స్పెషల్)

తెల్లవారితే స్వతంత్రదినోత్సవం

 


స్వతంత్రభారతికి అక్షర నీరాజనాలర్పించాలని కాగితం, కలం
ముందుంచుకుని ఆలోచనా తపస్సులోకి వెళ్ళిపోయాను.
అదేమి చిత్రమో తెలియదుగానీ, ఎప్పుడూ కదం త్రొక్కే               
నా మేథాశ్వం నేడు అడుగు కదపనని మొండికేసింది.
నిముషాలనూ, గంటలనూ నిర్దయగా నలిపేస్తూ... కాలం
తన దారిన తను వెళ్ళిపోతూనేవుంది.... మౌనంగా.
భావప్రసవానికై పురిటి నొప్పులు పడుతున్న నేను, ఎందుకో
కన్నులు తెరిచి చూసాను.....నాకు తెలియకుండానే.
నిబిడాంధకారం తప్ప మరేదీ కనిపించలేదు నాకు.
గమ్యం తెలియని బాటసారిలా బయటకు బయలుదేరాను.
శ్రావణమాసపు శీతల గాలులు శరీరాన్ని సేద దీరుస్తున్నాయి.
నేను నడుస్తున్నా.... నా మనస్సు మాత్రం ఆలోచిస్తూనే వుంది.
ఎక్కడనుంచో లీలగా చిరునవ్వుల జల్లులు
నా ఏకాగ్రతనూ, ఏకాంతాన్ని ఒక్కసారి భగ్నం చేసాయి.
నాకు తెలియకుండానే నేనా దిశగా వెళ్ళాను.
ఒక నవయవ్వన సౌందర్యరాశి...వనమయూరాలతో, స్వర్ణహరిణాలతో
పాటలు పాడుతూ, ఆటలాడుతూ  నాకు కనిపించింది.
శుక, పిక, సారస సమూహాలు తమ కలస్వనాలతో...ఆమె
స్వతంత్ర లయవిన్యాసానికి స్వరజతులు వేస్తున్నాయి.
సింహ, శార్దూల, మత్తేభ, భల్లూకగణాలు... ఆమె నాట్యభంగిమలను
నయనమనోహరంగా తిలకిస్తూ,  ఆనందంతో చిందులేస్తున్నాయి.
‘‘ఆహా! ఎంతటి స్వేచ్ఛా సంబరం! ’’ అనుకుంటూ అనిమిషనేత్రుడనై
తిలకిస్తున్న నన్ను దగ్గరకు రమ్మని ఆ సుందరి పిలిచింది.
మంత్రముగ్ధుడనై నేను ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను.
‘‘నాకు అక్షర నీరాజనాలర్పించాలని వచ్చావు కదూ!’’
కోటి సితారులు మీటినట్లు పలికిందామె... ఒయ్యారాలుపోతూ.
‘‘ ఔనన్నట్లు’’ ఎంతో నిజాయతీగా, అమాయకంగా తలూపాను.
ఆ అడవి ప్రాణులు ఎంతో అవహేళనగా పకపకా నవ్వాయి.
వాటి నవ్వులోని భావం నాకు అర్ధం కాలేదు.
‘‘ అమాయకుడా! అర్ధంకాలేదా! అయితే విను.
నేనేనాడూ అస్వతంత్రురాలిని కాదు. స్వేఛ్ఛాసంచారిని.
మీరే...మీ రచయతలే.... మూర్ఖులు, శాడిస్టులు. మీ అస్వతంత్ర
భావాల బందిఖానాలో నన్ను బంధించి వుంచడం మీ నైజం.
వాస్తవంలోనే కాదు...భావనలో కూడా స్వతంత్రంగా
బ్రతకలేని దుర్బలులు మీరు. నా గురించి నీకు తెలియదేమో!
నా నడకలో ఎప్పుడూ పవిత్ర భాగీరథి హొయలున్నాయి.
నా ఎదలో ఎప్పుడూ పావన గోదావరి గలగలలున్నాయి.
నా గళంలో ఎప్పుడూ  మధురామృత రారులున్నాయి.  
నా పదంలో కృష్ణాతరంగ మృదంగ విన్యాసాలున్నాయి.                   
నిత్య వసంత ఋతుశోభ నా స్వంతం.
వేద విఙ్ఞాన  వాఙ్మయ వైభవం నా గంధం.
సనాతన సాంప్రదాయాలకు సాకారం....నా ఆకారం.
అందాన్ని, ఆనందాన్ని దర్శించలేని అంధులు కనుకనే...
మీ రచనల్లో నన్ను నిరంతర బందీని చేసి... ఆనందిస్తూంటారు.                              
రక్తాక్షరాలతో మృత్యుగీతాలు రాసుకుంటూ...సంతోషిస్తూంటారు.
జాతి వైషమ్యాలు, కుల కార్పణ్యాలు, భాషా భేదాలు
పెంచుకోమని నేను మీకు ఏనాడైనా చెప్పానా?
సరిహద్దు రేఖలు గీసుకుని సంగరాలు సాగించమన్నానా?
మానవత్వాన్ని మరచి మారణహోమాలు చెయ్యమన్నానా?                                  
మీతోపాటు సమానంగానే కన్నానే ఈ ప్రాణులను కూడా...!
కానీ...ఇవేనాడూ వర్గభేదంతో, విభేదించడం నేను చూడలేదు.
సమైక్యతా భావమేరా...  ‘‘స్వతంత్రం ’’ అంటే.
ఐకమత్యతా జీవనమేరా...‘‘స్వతంత్రం’’ అంటే.
అడ్డాలనాడే  గానీ...గడ్డాలనాడు కాదు...బిడ్డలంటే.
అందుకే...మాతృత్వ మమకారాన్ని కూడా చంపుకుని,
మీ నరజాతి మొత్తాన్ని శాశ్వతంగా వెలి వేసాను.
మేథోవంతులమనే అహంకారంతో మీరు చేసిన
స్వయంకృతాపరాధానికి, నేను మీకు వేసిన శిక్ష ఇదే.
మీకు ఏడాదికి ఒకేఒక్క స్వతంత్రదినం.
కానీ...మాకు ప్రతినిత్యం స్వతంత్రదినమే.
ఫో!  పోయి నిస్సారమైన కవితలు రాసుకుంటూ కాలం గడుపు.’’
ఆమెలా కటువుగా పలుకుతున్నా...అవి కఠోర సత్యాలనిపించాయి నాకు.
ఆత్మవంచన చేసుకుంటూ...అష్టైశ్వర్యాలతో తులతూగడంకన్నా..,
అనంత స్వతంత్రం అనుభవించే ఆ అరణ్యమృగాలతో
కలసి జీవించడం మేలనిపించింది నాకు. అంతే....
అహం విడచి, ఇహం మరచి అవనత శీర్షంతో
క్షమించమంటూ..  ఆ తల్లి పాదాల మీద వాలిపోయాను.
నా కన్నీరు ఆమె పవిత్ర పాదాలను అభిషేకించాయి.
ఆ తల్లి ఎంతో ప్రేమతో నన్ను అనుగ్రహించి, ఆశీర్వదించింది.
ద్విపాదినైన నేను....చతుష్పాదినయ్యాను.
                

         

యం.వి. సుబ్రహ్మణ్యం