Facebook Twitter
గంగమ్మ పూలు

                            గంగమ్మ పూలు                                                                                                  

                                                 

ఎదురుగా కనిపిస్తోంది ఏనుగు నల్లరాతి కొండ.
కొండ మధ్యలో నల్లరాతి బండ. బండ మధ్యలో గవి.
గవి లో ప్రవహిస్తోంది గంగమ్మ.
చీకటి గవి ముందు నిలబడి అంత ఎత్తు పైనుంచి కిందకి చూస్తే నీళ్లు పారుతున్న శబ్దం మాత్రం వినిపిస్తుంది. నీళ్లు కనపడవు.

గవిలోకి దిగిన వాళ్ళు లేరు. నీళ్లను చూసినోళ్లు లేరు.
ఆ నీళ్లు అట్లా ప్రవహిస్తూ పాతాళంలో ఉండే పరమశివుడి పాదాల చెంతకు చేరుతాయని చెప్పుకుంటూ ఉంటారు.

ఊరి చివరి వేపచెట్టు కింద ఉండే గంగమ్మ తల్లికి మొక్కుకున్నారు .
వాన కురిసే కాలానికి ముందు
నెత్తి మీదికి ' గంగమ్మ పూలు ' ఎత్తుకొని
ఆడోళ్ళు బయలుదేరారు. చిన్నచిన్న వెదురు బుట్టల్లో, రకరకాల రంగురంగులపువ్వులు కొత్త కాంతి తో, కొత్త శోభతో మెరుస్తున్నాయి. వాటిని తల పైకి ఎత్తుకుని వాళ్లందరూ కదిలారు.
వాళ్ల ముందు నలుగురు తప్పెట కొడుతున్నారు.
'మేలుకొనమ్మ మా తల్లి గంగమ్మ తల్లి
పూల పూజలు చేసెదము మేలుకొనమ్మ...' అని గుంపులో నుంచి ఎవరో పాటెత్తుకున్నారు.
వాళ్ళు అట్లా దేవళం దగ్గర బయలుదేరారు.

ఆ వచ్చే గుంపులోనే వస్తావుంది ఆయమ్మి.
అట్నుంచి దావ పట్టినారు.
ఎగువ గుట్ట దాటుకున్నారు. దిగువ గుట్ట దాటుకున్నారు.
చుట్టూ అడవి. కాలి దారెమ్మడి ఒకరేనక ఒకరు కొండ ఎక్కుతా ఉండారు.ఏనుగు కొండపై నుంచి
దూరం నుంచి వస్తాండే ఆయమ్మిని వాడు చూసినాడు.
వాడిని ఆయమ్మి చూసింది.

ఆడవాళ్లందరూ గస పెడుతూ కొండ ఎక్కారు.
గవి దగ్గరికి చేరుకున్నారు.
'ఈ పూలన్నీ గవిలోని గంగమ్మ కిస్తే మోసుకొని పోయి పాతాళంలో ఉండే పరమేశ్వరుడికి మన కోరికలు జెప్పి ఇస్తాది. ఆసామి నెరవేరుస్తాడు ' అని చెప్పింది నమ్మకంగా పెద్ద రామక్క.

'విరం కాశి .. విరం జ్యోతి ...నీకు హారతి,
గంగా మాతల్లి నీకు మంగళ హారతి...
చెవ్వు, చెవ్వ0దం చూడు, చెవుల కమ్మలు చూడు,
చెయ్యి, చెయ్యందం చూడు, చేతిగాజులు చూడు,
కాళ్లు, కాళ్ళందం చూడు, కాళ్ళ గజ్జెలు చూడు,
ముక్కు, ముక్కందం చూడు, మెరిసే ముక్కెర చూడు
పూజ చేయుమురారో గంగమ్మ తల్లికి...
కుసుమాల పూజ చేతుము రారో పుణ్యవతులారా...'
ఇట్లా హారతి పాట పాడుతూ పూజ చేశారు.

వాడు ఆయమ్మినే చూస్తా ఉండాడు.
పూజ అయిపోయిన తర్వాత ఆయమ్మి కొంచం పక్కకు వచ్చింది.
వాడు ఇంకేదో చెప్తుందని దగ్గరికి పోయాడు ఆశగా .

'ఇది గంధపు దండ. గంగమ్మ పూల తో పాటు తెచ్చినాను. గవిలేకి వేస్తా ఉండను.నువ్వు మొగుడివి అయితే దీన్ని బయటికి తీసకచ్చిసూపి...' అని చెప్పింది ఆయమ్మి.

వాడికి దిమ్మ తిరిగింది.
చెప్పి నడుము తిప్పుకుంటా పోయింది ఆయమ్మి.
గవిలోకి గంధపు దండ వేసింది.
వాడికి దిక్కు తెలియలేదు.
ఆయమ్మి పోయిన వైపుకే చూస్తా ఉండాడు.
పాతాళ గంగ శబ్దం వినిపిస్తా ఉండాది.


                                                                                   - డాక్టర్ వేంపల్లి గంగాధర్