వైసీపీ ఎంపీల ఆక్రోశం.. ఆ ఇద్దరు రెడ్డి గార్లకే ప్రాధాన్యత.. మేమంతా అనామకులమా?

 

సర్వం సాయి రెడ్డే అన్నట్లు సాగుతున్న పరిణామాలపై పలువురు వైసిపి ఎంపిలు రగిలిపోతున్నారు. జగన్ సహచరుడైన సాయిరెడ్డి తో పాటు సమీప బంధువు మిథున్ రెడ్డి కి మాత్రమే పార్టీ లో ప్రాధాన్యం దక్కుతుందని తమను పట్టించుకునే వారే లేరని ఆక్రోశిస్తున్నారు. సాయిరెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా, మిథున్ రెడ్డిని లోక్ సభలో పార్టీ నేతగా ప్రకటించారు జగన్. పార్టీలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను.. ఆ ఇరువురు గీసిన గీత దాటవద్దని ఆదేశించారు. ఢిల్లీలో అన్ని అధికార పదవులు విజయసాయిరెడ్డికి అప్పజెప్పడంతో పాటు ఆయనను సంప్రదించకుండా ఏది చేయకూడదని.. ప్రధానమంత్రిని ,  కేంద్ర మంత్రులను కూడా కలవకూడదని స్పష్టం చేశారు జగన్. 

తమ కంటే వయసులో అనుభవంలో చిన్నవాడైన మిథున్ రెడ్డి అదుపాజ్ఞలో నడుచుకోవాలని జగన్ ఆదేశించడం సబబు కాదని కొందరు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకే సభా వ్యవహారాల కమిటీతో పాటు నాలుగు కీలక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిని చేయడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడటం లేదు. ప్రతి దానికీ ఆ ఇద్దరేనా.. వారిలో అంత ప్రత్యేకత ఏముందంటూ మండిపడుతున్నారు. ప్రధానమంత్రిని నేరుగా కలిస్తే తప్పేంటి.. ఢిల్లీలో వారికే ప్రాధాన్యత ఉండాలా.. మేమంతా అనామకులుగానే మిగిలిపోవాలా.. అని పలువురు ఎంపీలు అంతర్గత సంభాషణల్లో ఆక్రోశిస్తున్నారు.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను కలిస్తే వారికి ఎక్కడ సన్నిహితం అవుతామేమోనని వైసీపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు ఉందని.. బీజేపీ తమను ఆకర్షిస్తుందనే భయం వారిలో ఉన్నట్లుందని కొందరు చెబుతున్నారు. కోట్లు ఖర్చుపెట్టి దేశ రాజధానికి వస్తే ఇక్కడ ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొందని మరికొందరు వాపోతున్నారు. ఎంతమంది ఉన్నా ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించలేక పోతున్నాం. సభలో సెంట్రల్ హాల్ లో అనామకులు లాగా ఉండిపోవల్సి వస్తుందని ఎవరినీ పలకరించకుండా కట్టడి చేయడంతో పాటు నిఘా కూడా పెట్టారని ఒక ఎంపీ తన సహచరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఏం మాట్లాడాలన్నా.. వినతి పత్రం సమర్పించాలని వాపోతున్నారు. విజయసాయిరెడ్డి కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని తెలిపారు. జగన్ సర్కారు నిర్ణయాలను ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులు.. ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారని వారికి జవాబు చెప్పలేకపోతున్నామని వైసిపి ఎంపిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో క్రైస్తవ మత వ్యాప్తిని ప్రధాన ఎజెండాగా జగన్ పెట్టుకున్నట్టు కనపడుతుందన్న చర్చ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరుగుతుందని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షలు, రాజధాని నిలిపివేత, పోలవరంపై రివర్స్ టెండర్ తదితర అంశాలపైనా చర్చ జరుగుతుందని వీటిపై జాతీయ పత్రికల్లో కథనాలు సంపాదకీయాల గురించి కూడా తమను అడుగుతున్నారని ఒక ఎంపీ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై వివాదాస్పద నిర్ణయాల ప్రభుత్వమనే ముద్ర పడిందని తెలిపారు. వైసీపీలో తమకు ఉక్కపోత వాతావరణం నెలకొన్నదని.. ఇది మరింత పెరిగి ఊపిరాడని పరిస్థితి వస్తే మరో చల్లటి వాతావరణం చూసుకోవాల్సి వస్తుందని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.