అనుకున్నది అనుకున్నట్టు చేసిన జగన్... విపక్షాల విమర్శల్ని లెక్కచేయని సర్కారు

 

ఏపీలో నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ... ప్రైవేట్ స్కూల్స్‌కి ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఏడాదికో క్లాస్ పెంచుకుంటూ టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపిన ప్రభుత్వం... తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది.

ఇక, ఇంగ్లీష్ మీడియంలో విద్యాభోదన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. టీచర్ల నైపుణ్యాభివృద్ధి కోసం ఎస్‌‌ఈఆర్టీతో కలిసి పనిచేయాలని విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి వీలుగా టీచర్లకు హ్యాండ్ బుక్స్, శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. అలాగే, భవిష్యత్తులో చేపట్టబోయే ఉపాధ్యాయ నియామకాల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యమున్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది.

అయితే, ఇంగ్లీష్ మీడియం అమలుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని పిల్లలపై రుద్దుతున్నారని మండిపడుతున్నారు. ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే విద్యార్ధులకి అర్ధంకాదని, అలాగే ఇంగ్లీష్‌లో బోధించగలిగే సామర్ధ‌్యమున్న ఉపాధ్యాయులు లేరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాల మాటలను పట్టించుకోని జగన్ ప్రభుత్వం.... తాము అనుకున్నది అనుకున్నట్టు అమలు చేస్తోంది. అంతేకాదు, పేద పిల్లల భవిష్యత్తు... ఏపీ విద్యార్ధులు... ప్రపంచంతో పోటీ పడేందుకే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు జీవోలో పేర్కొంది.