టీడీపీకి 2 ఎంపీ సీట్లు కూడా కష్టమే.. బాబుకి నిద్ర పట్టదు
posted on May 14, 2019 2:15PM

టీడీపీ నిజంగా గెలుస్తుందని చంద్రబాబు భావిస్తే, నాలుగు రకాల సర్వేలను ఎందుకు చేయించాల్సి వచ్చిందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. "గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారు చంద్రబాబూ? ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయండి. ఎన్నికలు ఐదేళ్లకోసారొస్తాయి. పార్టీ శాశ్వతం. మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు?" అని ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా విజయసాయి రెడ్డి.. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శించారు. "స్టాలిన్ ను కెసీఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారని మీడియాలో వచ్చింది. ఇక చంద్రం సారుకు నిద్ర పట్టదు. స్టాలిన్ ను తనూ కలిసి అటువంటిదేమి లేదు అని ప్రకటించేదాకా ఊరుకోడు. 2 ఎంపీ సీట్లు కూడా కష్టమేనని తెలిశాక ఎవరు లెక్కచేస్తారు ఈయన పిచ్చి కాకపోతే." అని ఎద్దేవా చేశారు.