వైఎస్ జగన్, కేసీఆర్ మద్దతు కూడా కాంగ్రెస్ కే!!
posted on May 14, 2019 12:59PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రస్తుత జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తీ మెజారిటీ రాదని.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విషయం తెల్సిందే. అయితే చింతా మోహన్ కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. కానీ, దానికి కొన్ని ట్విస్ట్ లు యాడ్ చేశారు.
కేంద్రంలో బీజేపీకి ఓటమి తప్పదన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని, కాంగ్రెస్ పార్టీతో 10 పార్టీలు కలసి రానున్నాయని చెప్పారు. రాహుల్ నేతృత్వంలోనే సంక్లీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చింతా మోహన్ పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు వైఎస్ జగన్, కేసీఆర్ కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాంగ్రెస్ నేతలు జగన్ కి టచ్ లో ఉన్నారని, కేంద్రంలో మద్దతివ్వాలని కోరారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కేసీఆర్ కూడా ఫలితాల తరువాత కాంగ్రెస్ కూటమికే మద్దతిచ్చే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. అందుకే కేసీఆర్ సీఎల్పీ విలీనాన్ని పక్కన పెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చింతా మోహన్ వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. చూద్దాం మరి ఫలితాల తరువాత కేసీఆర్, జగన్ కూడా కాంగ్రెస్ కి మద్దతిస్తారేమో.
ఇవేకాదు.. చింతా మోహన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత 2021 ఫిబ్రవరిలో లోక్‌సభకు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో 10 పార్టీలు కలసి రానున్నాయని, చంద్రబాబుతో పాటు జగన్, కేసీఆర్ కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తారని చెప్పిన చింతా మోహన్.. రెండేళ్ల తర్వాత మళ్ళీ లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని ఎందుకు అన్నారు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా.. భిన్న స్వభావాలున్న నేతలు, పార్టీలు ఎక్కువకాలం కలిసి ఉండలేవని ఆయన అభిప్రాయపడుతున్నారా?. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే త్వరలో జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగేలా ఉన్నాయి. మరి ఆయన ఊహించినట్టు జరుగుతుందో లేదో చూడాలి.