పర్చూరులో వైసీపీని భయపెడుతున్న కేఏ పాల్

 

ఎన్నికల్లో గుర్తుని పోలిన గుర్తులు ఉండడం వల్ల ఒక్కోసారి ప్రధాన పార్టీల ఓట్లు చీలి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఈమధ్య తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా.. కారు గుర్తుని పోలిన ట్రక్కు గుర్తు ఉండడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో కారుకి పడాల్సిన ఓట్లు ట్రక్కుకు పడి తమ పార్టీకి కొంత నష్టం జరిగిందని టీఆర్ఎస్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో వైసీపీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కేఏ పాల్ కి చెందిన ప్రజాశాంతి పార్టీ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ గుర్తు హెలికాఫ్టర్. ఇది వైసీపీకి చెందిన ఫ్యాన్ గుర్తుకి కాస్త దగ్గరగా ఉంటుంది. రెండు పార్టీలకు చెందిన జెండా, కండువాలు కూడా ఒకేలా ఉంటాయి.. కానీ ఎన్నికల్లో గుర్తు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అసలే ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు సాగేలా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు ఫ్యాన్ అనుకోని.. కొందరు హెలికాఫ్టర్ కి ఓటేసినా చాలా ప్రభావం పడుతోంది. దీంతో ప్రజాశాంతి పార్టీ బరిలో ఉన్న స్థానాల్లో వైసీపీ కలవరపడుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. అదేవిధంగా ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా.. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అసలే ఈ పార్టీల గుర్తులకు దగ్గరి పోలికలు ఉన్నాయంటే, ఇప్పుడు రెండు పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. దీంతో తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.