ఈసారి అమేథీలో రాహుల్ గాంధీ గెలుపు కష్టమేనా?

 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, బీజేపీని గద్దె దించి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్.. ఎన్నికల పోరుకి సిద్ధమయ్యాయి. అయితే ప్రధాని మోదీని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో ఈసారి ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని 1991 ఎన్నికల్లో ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాల్లో సంతకం చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు హజీ సుల్తాన్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడు హజీ హరూన్‌ రషీద్‌ను అమేథీ నుంచి రాహుల్‌కు పోటీగా బరిలోకి దింపనున్నారు. 1999లోనూ సోనియాగాంధీని ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాల్లో సుల్తాన్‌ సంతకం చేశారు. అయితే గత కొన్నేళ్లుగా స్థానిక నాయకత్వం తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రషీద్‌ తెలిపారు. తమ వర్గం మొత్తం పార్టీ స్థానిక నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 6 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. మేమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తాం అని తెలిపారు. ఇదే ఇప్పుడు రాహుల్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు అమేథీలో రాహుల్‌కు పోటీగా బీజేపీ తరపున స్మృతి ఇరానీ రెండోసారి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ రాహుల్ కి మంచి పోటీనే ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మూడున్నర లక్షల ఓట్లకు పైగా మెజారిటీ సాధించిన రాహుల్.. 2014 ఎన్నికల్లో లక్ష మెజారిటీనే సాధించారు. ఈసారి కూడా స్మృతి ఇరానీ బరిలోకి దిగారు, మరోవైపు రషీద్‌ రూపంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి ఎంతోకొంత గండిపడే అవకాశం కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఈసారి రాహుల్ మెజారిటీ బాగా తగ్గేలా ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.