రాష్ట్రాభివృద్ధిలో వైకాపా ప్రేక్షకపాత్రకే పరిమితమా?

 

నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని పదేపదే చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆ మాటలని ఆచరణలో మాత్రం పెట్టడం కనబడదు. తనకు రాజకీయంగా బద్ద శత్రువయిన చంద్రబాబుని ఆయన చాలా ద్వేషిస్తూ ఉండవచ్చును. కానీ ఆ కారణంగా ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని కూడా ద్వేషించడం అవివేకం. 

 

సమైక్యాంధ్ర అని పోరాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రావారిని అడుగడుగునా అవమానిస్తున్న టీ-ముఖ్యమంత్రిని పల్లెత్తు మాటనరు. కానీ, ఏదో ఒక సాకుతో చంద్రబాబు ప్రభుత్వంపై మీద ఒంటికాలిపై లేస్తుంటారు. ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంటు చేయమని కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పినా జగన్ పెదవి విప్పరు, పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణా ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్నా ఆ సమస్యతో తనకెటువంటి సంబందమూ లేదన్నట్లు వ్యవహరిస్తారు. కానీ ప్రజలెనుకొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేస్తూ, దానిపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు.

 

రాష్ట్రాభివృద్ధి కేవలం అధికార పార్టీ బాధ్యతే కాదు. ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కానీ రాష్ట్రాభివృద్ధిలో వైకాపా పాత్ర ఏమిటని ప్రశ్నించుకొంటే ఏమీ ఉండబోదనే జగన్ వైఖరి స్పష్టం చేస్తోంది. తీవ్ర ఆర్ధిక సమస్యల నడుమే రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకొని కొత్తగా రాజధానిని కూడా నిర్మించుకొని, రాష్ట్రానికి విద్యా, వైద్య, విద్యుత్, సాఫ్ట్ వేర్ సంస్థలు, పరిశ్రమలను రప్పించే ప్రయత్నం చేయవలసి ఉంది. అందుకు జగన్ కూడా తన పలుకుబడిని, పరిచయాలను ఉపయోగించి రాష్ట్రానికి లబ్ది చేకూర్చవచ్చును. కానీ ఆ విధంగా చేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ప్రభుత్వానికే వెళ్ళిపోతుంది గనుక ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.

 

కానీ రాష్ట్రాభివృద్ధికి కంకణం కట్టుకొన్న అధికార తెదేపాకు సహకరించకపోగా, దానికి అడ్డంకులు సృష్టిస్తే దానివల్ల వైకాపా ప్రతిష్ట మరింత మసకబారడం తధ్యం. ఈ విషయంలో వైకాపా సృష్టించే అడ్డంకులను తెదేపా ప్రభుత్వం అధిగమించి, రాష్ట్రాభివృద్ధి చేయగలిగినట్లయితే దానివల్ల తెదేపాపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu