పట్టణీకరణపై జగన్ సర్కారు ఫోకస్... అభివృద్ధి వికేంద్రీకరణలో తొలి అడుగు...

పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమంటోన్న జగన్ ప్రభుత్వం... పట్టణీకరణపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ... తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ... అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీ పరిధుల్లోకి... పెద్దఎత్తున మున్సిపాలిటీలను, మండలాలను తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్న గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్ పరిధిలోకి కొత్తగా అమలాపురం, మండపేట, ముమ్మిడివరం, ఏలేశ్వరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను చేర్చింది. దాంతో, ప్రస్తుతం 2వేల 183 చదరపు కిలోమీటర్లున్న గోదావరి డెవలప్‌‌మెంట్‌ అథారిటీ పరిథి ఏకంగా 4వేల 396 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీలోకి రాప్తాడు నియోజకవర్గాన్ని చేర్చింది. రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లోని ఆత్మకూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు మండలాలను చేర్చడంతో... అహుడా పరిధి 6వేల 591 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి నగరి మున్సిపాలిటీతోపాటు 13 మండలాలను చేర్చడంతో... 4వేల 527 కిలోమీటర్లకు తుడా పరిథి పెరిగింది.

గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ... తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ... అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీలోకి... పెద్దఎత్తున మున్సిపాలిటీలను, మండలాలను తీసుకొస్తూ... పురపాలకశాఖ ఉత్తర్వులు ఇవ్వడంతో... ఒక్కసారిగా వేల చదరపు కిలోమీటర్ల పరిధి... ఈ సంస్థల నియంత్రణలోకి వచ్చాయి. అయితే, ఈ మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని భారీగా పెంచిన ప్రభుత్వం... కొత్తగా చేర్చిన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధిని చేపడుతుందో చూడాల్సి ఉంది.