ఏపీకి జగన్ అతిథా?
posted on Oct 1, 2015 6:34PM

రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట హైదరాబాద్ లోనే ఉండి పాలనా కార్యక్రమాలు నిర్వహించినా ఆతరువాత అది సాధ్యం కాదని భావించి వారంలో మూడు రోజులు అక్కడ మూడు రోజులు విజయవాడలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆతరువాత అది కూడా కాదని ఇప్పుడు మొత్తంగా అక్కడే ఉండి పాలనా విధానాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ ప్రతిపక్ష నేత అయిన జగన్ మీద పడింది. ప్రతిపక్షనేత ఏపీకి అతిధిగా మారారని విమర్శలు తలెత్తున్నాయి. ప్రతిపక్షనేత జగన్ హైదరాబాద్ ను విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడటం లేదని.. ఎప్పుడో ఒకసారి ఏపీకి వస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు పార్టీ నేతలు ఏపీకి వెళదాం అని సూచించినా కూడా ఇప్పుడే వెళ్లి ఏం చేస్తాం అని కూడా అంటున్నారట. మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా విజయవాడలో ఉండటంతో జగన్ కు రాబోయే కాలంలో ఇదే మైనస్ పాయింట్ అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి ఇప్పుడైనా జగన్ ఏపీ మకాం వేయడానికి ఇష్టపడతారో లేదో చూడాలి.