యోగి అదిత్యనాథ్ కు సబ్బు గిఫ్ట్...
posted on Jun 3, 2017 4:19PM

యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కు సబ్బును గిఫ్ట్ గా పంపిచనున్నారు. సబ్బు గిఫ్ట్ ఎందుకు... ఇంతకీ ఎవరు పంపిస్తున్నారు అనుకుంటున్నారా..? 'గుజరాత్ దళిత్' అనే సంస్థ నేతలు ఆదిత్యనాథ్ కు 16 అడుగుల సబ్బును పంపించబోతున్నామని ప్రకటించారు. అసలు సంగతేంటంటే..యూపీలోని కుషినగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉన్న దళితవాడలో యోగి ఈ మధ్య పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడున్న దళితులకు సబ్బులు, షాంపూలు, పౌడర్లు, సెంటులను అధికారులు ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలవాలనుకునేవారు శుభ్రంగా స్నానం చేసి, పౌడరు, సెంటు కొట్టుకోవాలని చెప్పారు. దీంతో యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కోసం 16 అడుగుల సబ్బును పంపుతున్నామని... ఈ సబ్బుతో ఆయన తన కుల వివక్షను కడిగేసుకోవాలని.. దళితులను కలిసేందుకు వచ్చేముందు... ఈ సబ్బుతో ఆయన స్నానం చేసి రావాలని తెలిపింది. ఈ నెల 9వ తేదీన అహ్మదాబాద్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ భారీ సబ్బును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేసి, సీఎంకు పంపనున్నట్టు సమాచారం.