నోట్లతో ఓట్లు.. ఇదే వైసీపీ తీరు..
posted on Feb 17, 2021 10:17AM
నోటు ఉంటేనే అధికార సీటు అన్నట్టుగా మారింది ఏపీ లో పంచాయతీ ఎన్నికల తీరు. మూడో దశ పోలింగ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. నోట్లు ,మద్యం, పంచుతూ వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. పవిత్రమైన పంచాయతీ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. అధికారాన్ని దక్కించుకోడానికి వైసీపీ బలపరిచిన అభ్యర్థులు తొక్కని అడ్డదారులు లేవు. ఒక వైపు కోర్టు, మరో వైపు ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు పెట్టిన వాటిని తుంగలో తొక్కుతున్నారు. పోటీలో నిలిచిన ఇతర అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడంతో ఆగకుండా ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. పోలీసులు కూడా ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పచ్చిమ గోదావారి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల ప్రలోభాలు కొనసాగాయి. చింతలపూడి మండలం, ప్రగడవరంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేశారు. వైసీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.